ముత్తంగి అలంకరణలో రామయ్య

14 Nov, 2023 01:56 IST|Sakshi
పోలింగ్‌ కేంద్రంలో పరిశీలిస్తున్న కమల్‌ కిషోర్‌

భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి మూలమూర్తులు ముత్తంగి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ప్రతి సోమవారం స్వామివారిని ఈ రూపంలో అలంకరించడం ప్రత్యేకత. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.

పోలింగ్‌ కేంద్రాల్లో మౌలిక వసతులు కల్పించాలి

ఎన్నికల పరిశీలకులు కమల్‌కిషోర్‌

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఎన్నికల సంఘం నిబంధనల మేరకు పోలింగ్‌ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు ఏర్పాటుచేయాలని కొత్తగూడెం నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు కమల్‌కిషోర్‌ అన్నారు. నియోజకవర్గ పరిధిలోని పలు పోలింగ్‌ కేంద్రాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్ల కోసం సురక్షిత తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుత్‌, దివ్యాంగులు, వయోవృద్ధుల కోసం ర్యాంపులు, వీల్‌చైర్లు సిద్ధంగా ఉంచాలని బీఎల్‌ఓలను ఆదేశించారు. నూతన ఓటర్లకు ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించాలన్నారు. పోలింగ్‌ కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించి సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో లైజన్‌ అధికారి జినుగు మరియన్న, డీటీ అంజద్‌పాషా తదితరులు పాల్గొన్నారు.

జాప్యం లేకుండా పనులు నిర్వహించాలి

కొత్తగూడెంఅర్బన్‌: జిల్లాలో మన ఊరు – మన బడి పథకంలో ఎంపికై న పాఠశాలల్లో పనులు జాప్యం లేకుండా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి వెంకటేశ్వరాచారి అన్నారు. దుమ్ముగూడెం, గుండాల, దమ్మపేట మండలాల్లో మన ఊరు – మన బడి కార్యక్రమం కింద ఎంపికై న పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో సోమవారం ఆయన కొత్తగూడెంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పనుల్లో ఎక్కడైనా జాప్యం జరిగితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. అంతకుముందు ఆయా పాఠశాలల్లో ఇప్పటివరకు చేపట్టిన పనుల ఫొటోలతో కూడిన నివేదికలను ప్రధానోపాధ్యాయులు డీఈఓకు అందజేశారు. సమావేశంలో జిల్లా ప్లానింగ్‌ కో–ఆర్డినేటర్‌ ఎన్‌.సతీష్‌కుమార్‌, మూడు మండలాల విద్యాశాఖాధికారులు, అసిస్టెంట్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు