మూడో రోజూ లాభాలే

26 Feb, 2014 01:31 IST|Sakshi
మూడో రోజూ లాభాలే

 సెన్సెక్స్ 41 పాయింట్లు ప్లస్
 ఎఫ్‌ఐఐల పెట్టుబడుల అండ
 6,200 స్థాయి వద్ద నిలిచిన నిఫ్టీ
 
 ఎఫ్‌ఐఐల పెట్టుబడులు కొనసాగడంతో స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజు లాభపడ్డాయి. సెన్సెక్స్ 41 పాయింట్లు పెరిగి 20,852 వద్ద నిలవగా, 14 పాయింట్లు జమ చేసుకున్న నిఫ్టీ 6,200 కీలక స్థాయి వద్ద నిలిచింది. ఇది నెల రోజుల గరిష్టం. కాగా, సోమవారం రూ. 267 కోట్ల విలువైన షేర్లను కొన్న ఎఫ్‌ఐఐలు తాజాగా మరో రూ. 423 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. దేశీయ ఫండ్స్ మాత్రం రూ. 289 కోట్ల విలువైన షేర్లను విక్రయించాయి. మూడు రోజుల్లో సెన్సెక్స్ 316 పాయింట్లు లాభపడింది.
 
 విప్రో జోరు

 సెన్సెక్స్ దిగ్గజాలలో విప్రో 3% ఎగసి రూ. 595ను తాకింది. ఇది కొత్త గరిష్ట స్థాయి కాగా, ఇన్ఫోసిస్ సైతం 1% లాభపడి రూ. 3,783 వద్ద ముగిసింది. ఈ షేరు లైఫ్‌టైమ్ గరిష్టం రూ. 3,799. ఈ బాటలో బజాజ్ ఆటో, భెల్, సిప్లా, ఎయిర్‌టెల్, హిందాల్కో 2-1.5% మధ్య బలపడ్డాయి. మరోవైపు సెసాస్టెరిలైట్, కోల్ ఇండియా, టాటా స్టీల్, టాటా పవర్ 2%పైగా నష్టపోయాయి. ఇతర మెటల్ షేర్లలో సెయిల్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఎన్‌ఎండీసీ సైతం 2%పైగా డీలాపడటంతో మెటల్ ఇండెక్స్ దాదాపు 2% క్షీణించింది. చైనా ఆర్థిక వ్యవస్థ నెమ్మదిస్తున్న సంకేతాలు మెటల్ షేర్లలో అమ్మకాలకు కారణమైనట్లు నిపుణులు తెలిపారు. ఇక వీఐపీ, బజాజ్ ఎలక్ట్రికల్స్, టైటాన్, బ్లూస్టార్ 10-3% మధ్య పుంజుకోవడంతో వినియోగ వస్తువుల రంగం 3% ఎగసింది.

మరిన్ని వార్తలు