పండుగకు పసిడిని పట్టించుకోలేదా?

27 Oct, 2019 11:02 IST|Sakshi

దీపావళికి అమాంతం పెరిగే బంగారం అమ్మకాలు ఈసారి వెలవెలబోయాయి. అయితే ట్రేడర్లు ఊహించినదానికన్నా ఎక్కువ కొనుగోళ్లు జరగడం గమనార్హం. దంతేరస్‌ నాడు 30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయని అధికారులు తెలిపారు. గత కొన్నేళ్లుగా దీపావళి సీజన్‌లో అమ్మకాలు 40 టన్నులకు చేరుకున్నాయి. కానీ ఈ ఏడాది బంగారం ధర మెట్టు దిగకపోవడంతో కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరిగాయి. ఇండియన్‌ బులియన్‌ అండ్‌ జ్యువెలర్స్‌ అసోసియేషన్‌ జాతీయ కార్యదర్శి సురేంద్ర మెహతా మాట్లాడుతూ.. బంగారం అధిక ధర పలకడంతో మార్కెట్‌లో వాటికి డిమాండ్‌ తక్కువగా ఉందన్నారు. దీంతో ఈసారి ధన త్రయోదశికి అమ్మకాలు 20 టన్నుల వద్ద ఆగిపోతాయని అంచనా వేశామన్నారు.

కానీ అంచనాలను దాటి.. 30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరిగాయని తెలిపారు. అయితే అమ్మకాల్లో వృద్ధి కనిపించినప్పటికీ గత సంవత్సరంతో పోలిస్తే 25 % క్షీణించాయని పేర్కొన్నారు. పసిడి రేట్లు ఎగబాకడం వల్ల మార్కెట్‌లో డిమాండ్‌ తగ్గిందన్నారు. భారత ప్రభుత్వం విలువైన లోహాలపై దిగుమతి సుంకాన్ని 10 నుంచి 12.5 శాతానికి పెంచడంతో బంగారం ధర చుక్కలనంటడానికి కారణమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కాగా శుక్రవారం 10 గ్రాముల బంగారం ధర రూ.38,275గా నమోదైంది. గతేడాది అదేరోజున బంగారం ధర రూ.31,702 పలికింది.

మరిన్ని వార్తలు