మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ లైట్‌ - కొత్త ఫీచర్స్‌తో సరికొత్త ఎక్స్‌పీరియన్స్‌..

21 Nov, 2023 19:17 IST|Sakshi

Microsoft Outlook Lite: ప్రముఖ టెక్ దిగ్గజం 'మైక్రోసాఫ్ట్' (Microsoft) ఔట్‌లుక్ లైట్‌లో కొత్త ఫీచర్‌లను పరిచయం చేయడంతో పాటు, భారతీయ వినియోగదారుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఇమెయిల్ అండ్ ఎస్ఎమ్ఎస్ యాప్ పరిచయం చేసింది. వీటి గురించి మరిన్ని వివరాలు వివరంగా ఈ కథనంలో తెలుసుకుందాం.

మైక్రోసాఫ్ట్  ఔట్‌లుక్ లైట్‌ (Microsoft Outlook Lite) అనేది భారతదేశంలోని వినియోగదారుల కోసం కంపెనీ రూపొందించిన ఒక ప్రత్యేకమైన యాప్. ఇతరులతో కమ్యూనికేట్ అవ్వడానికి అనుకూలంగా ఇది స్థానిక భారతీయ భాషలకు మద్దతు ఇస్తుంది. ఇది 3G, 4G, 5G లాంటి ఏ నెట్‌వర్క్‌లో అయినా చాలా వేగంగా పనిచేస్తుంది.

ప్రాంతీయ భాషల్లో..
మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ లైట్ భారతదేశంలో విభిన్న భాషా వినియోగదారులకు అనుకూలంగా ఉంటుంది. దీని వల్ల కమ్యూనికేషన్ మరింత సులభమవుతుంది. ఇందులో వాయిస్ టైపింగ్, ట్రాన్స్‌లేషన్ వంటివి మాత్రమే కాకుండా ప్రాంతీయ భాషల్లో ఇమెయిల్ చదవడం వంటి ఫీచర్స్ ఉన్నాయి.

ఇందులోని లేటెస్ట్ ఫీచర్స్ ద్వారా వినియోగదారుడు తమ మాతృభాష లేదా ప్రాధాన్య భాషలో ఇమెయిల్‌లను కంపోజ్ చేసుకోవచ్చు, తద్వారా సులభంగా చదువుకోవచ్చు. అంతే కాకుండా ఒక భాషలో ఈ కంటెంట్ టైప్ చేసి దాన్ని తమకు నచ్చిన భాషలో ట్రాన్స్‌లేట్ చేసుకోవచ్చు.

ఉదాహరణకు.. హిందీలో ఇమెయిల్ టైప్ చేసి, దాన్ని ఆటోమాటిక్‌గా ఇంగ్లీష్‌లో లేదా ఇతర భాషల్లోకి మార్చుకోవాలనుకున్నప్పుడు ఔట్‌లుక్ లైట్ సహాయపడుతుంది. ప్రస్తుతం ఇది హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, గుజరాతీ వంటి ఐదు భాషలకు మాత్రమే సపోర్ట్ చేస్తుంది. రానున్న రోజుల్లో ఇది మరిన్ని భాషలు, మాండలికాల్లో కూడా అందుబాటులో ఉంటుందని సమాచారం.

మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ లైట్ ఎస్ఎమ్ఎస్..
ఇక ఎస్ఎమ్ఎస్ మెసేజింగ్ విషయానికి వస్తే, ఔట్‌లుక్ లైట్ కేవలం ఇమెయిల్స్‌కి మాత్రమే కాకుండా..  ఎస్‌ఎమ్‌ఎస్‌లకు కూడా సపోర్ట్ చేస్తుంది. ట్రాన్స్‌లేషన్, ప్రమోషనల్ ఇన్ఫర్మేషన్ వంటి వాటి కోసం సంస్థ 'స్మార్ట్ ఇన్‌బాక్స్‌' అందిస్తుంది. ఇది సమాచారాన్ని సులభతరం చేయడమే కాకుండా.. సంబంధిత సందేశాలను ఒకే చోట చూడటానికి అవకాశం కల్పిస్తుంది. అంతే కాకుండా ముఖ్యమైన అపాయింట్‌మెంట్‌లు, ట్రావెల్ బుకింగ్స్, బిల్ పేమెంట్స్, గ్యాస్ బుకింగ్ వంటి వాటిని గుర్తు చేయడానికి ఉపయోగపడుతుందని సంస్థ వెల్లడించింది.

ప్రస్తుతానికి ఔట్‌లుక్ లైట్ భారతీయ ప్రాంతీయ భాషల్లో అందుబాటులో లేనట్లు తెలుస్తోంది, కంపెనీ త్వరలోనే ఈ ఫెసిలిటీని కూడా అందించే అవకాశం ఉంది. ఆ తరువాత వినియోగదారుడు తనకు నచ్చిన భాషల్లో మెసేజస్ చదువుకోవచ్చు. నచ్చిన భాషలో అనువాదం చేసుకోవచ్చు.

మైక్రోసాఫ్ట్ ఔట్‌లుక్ లైట్‌ ఫీచర్స్ పరిచయం చేసిన సందర్భంగా, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ & మైక్రోసాఫ్ట్ ఎక్స్‌పీరియన్స్ అండ్ డివైజెస్, ఇండియా గ్రూప్ కార్పోరేట్ వైస్ ప్రెసిడెంట్ 'రాజీవ్ కుమార్' మాట్లాడుతూ.. భారతదేశం టెక్నాలజీలో దూసుకెళ్తున్న తరుణంలో డిజిటల్ అనుభవాలను పెంపొందించడంలో ఔట్‌లుక్ లైట్‌ ఫీచర్స్ ఉపయోగపడతాయని, వినియోగదారుల మధ్య బలమైన కమ్యూనికేషన్ పెంపొందించడం సహాయపడతాయని వెల్లడించారు.

ఇదీ చదవండి: ఇన్ఫోసిస్ నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు.. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ కావడం..

ప్రతి వ్యక్తి లేదా వినియోగదారుడు తన ప్రాధాన్య భాషతో సంబంధం లేకుండా ఇతరులతో కనెక్ట్ అవ్వడానికి, రోజువారీ పరస్పర చర్యలను సులభతరం చేయడంలో ఇది సహకరిస్తుందని చెబుతూ.. రానున్న రోజుల్లో మరిన్ని కొత్త ఫీచర్స్ తీసుకురావడంలో కంపెనీ కృషి చేస్తుందని వివరించారు.

మరిన్ని వార్తలు