‘పండుగ’ను క్యాష్‌ చేసుకుందామని అడ్డంగా దొరికాడు 

27 Oct, 2019 10:55 IST|Sakshi
ఏసీబీకి చిక్కిన హెడ్‌ కానిస్టేబుల్‌ గురువయ్య

టపాసుల దుకాణం కోసం హెడ్‌  కానిస్టేబుల్‌ లంచం డిమాండ్‌

దాడి చేసిన పట్టుకున్న ఏసీబీ అధికారులు 

మహేశ్వరం: టపాసుల దుకాణం అనుమతి కోసం ఓ దుకాణదారుడి నుంచి లంచం అడగడంతో అగ్నిమాపక కార్యాలయం హెడ్‌ కానిస్టేబుల్‌ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా ఏసీబీ డీఎస్పీ సూర్యనారాయణ వివరాల ప్రకారం.. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు గ్రామానికి చెందిన కడారి దుర్గాప్రసాద్‌ గ్రామంలో కిరాణ దుకాణం నిర్వహిస్తున్నాడు. దీపావళి సందర్భంగా గ్రామంలో టపాసుల దుకాణం ఏర్పాటుకు అనుమతి కావాలని మహేశ్వరం అగ్నిమాపక కార్యాలయంలో సంప్రదించాడు. హెడ్‌ కానిస్టేబుల్‌ గురువయ్య దుకాణం ఏర్పాటుకు రూ.2,500 ఇవ్వాలని డిమాండ్‌ చేశాడు. అంత డబ్బు ఇవ్వలేనని రూ.1,500 తీసుకోవాలని దుకాణదారుడు దుర్గాప్రసాద్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ను కోరాడు. అనంతరం ఈ విషయాన్ని ఈ నెల 20వ తేదీన ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఏసీబీ అధికారులు ఫోన్‌ రికార్డులను పరిశీలించి కేసు నమోదు చేసుకొని పథకం ప్రకారం  శనివారం అగ్నిమాపక కార్యాలయంపై అధికారులు దాడి చేశారు.

హెడ్‌కానిస్టేబుల్‌ గురవయ్యను విచారించి కార్యాలయంలో రికార్డులను పరిశీలించారు. మహేశ్వరం అగ్నిమాపక కార్యాలయం పరిధిలో మొత్తం 43 టపాసుల దుకాణాలకు అనుమతులు తీసుకున్నారు. ఒక్కో దుకాణదారుడి నుంచి రూ.2 వేల నుంచి 3 వేలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. కేసు నమోదు  చేసుకొని అనుమతి ఇచ్చిన 43 టపాసుల దుకాణదారులను విచారించి డబ్బులు తీసుకున్నట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటామని రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సూర్యనారయణ తెలిపారు. హెడ్‌కానిస్టేబుల్‌ గురువయ్యను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.  ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్‌ చేస్తే 94404 46140లో సమాచారం ఇవ్వాలని కోరారు.  

మరిన్ని వార్తలు