మీ ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ భద్రమేనా..?

26 Aug, 2019 05:06 IST|Sakshi

గరిష్టంగా రూ.లక్షకే ఒక బ్యాంకులో బీమా

వివిధ బ్యాంకుల్లో రూ.లక్ష చొప్పున డిపాజిట్‌

ఒకే బ్యాంకులో చేసుకోదలిస్తే కుటుంబ సభ్యుల పేర్లతో...

చిన్న డిపాజిట్లుగా విడగొట్టడం వల్ల పలు ప్రయోజనాలు

అవసరమైన సందర్భంలో ఒక డిపాజిట్‌ రద్దు చేసుకోవచ్చు

వడ్డీ రేట్లు తగ్గుతున్నందున వివిధ కాలావధులకు డిపాజిట్లు

బ్యాంకుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ అన్నది రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఎంతో విశ్వసనీయమైన, సౌకర్యమైన ఇన్వెస్ట్‌మెంట్‌ సాధనం. ఎన్నో దశాబ్దాలుగా ఎక్కువ మంది అనుసరించే సాధనాల్లో ఇది కూడా ఒకటి. ఎన్నో కాల పరీక్షలకు నిలిచింది. రిస్క్‌ లేని సాధనం కావడంతో రాబడి తక్కువైనా కానీ చిన్న ఇన్వెస్టర్లకు ఇది నమ్మతగ్గ ఆర్థిక సాధనంగా నిలబడింది. అయితే, ఇటీవలి సంవత్సరాల కాలంలో బ్యాంకుల్లోనూ సంక్షోభాలు వెలుగు చూస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకుల్లో మీ డిపాజిట్‌ సురక్షితంగా ఉన్నట్టేనా...?  
   
బ్యాంకుల్లో డిపాజిట్లకు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ యాక్ట్‌ (డీఐసీజీసీ) కింద బీమా ఉంటుంది. ఇందుకోసం డిపాజిట్‌ చేసిన వారు ఎటువంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు. ఆ పని బ్యాంకే చేస్తుంది. అయితే, ప్రతీ ఒక్కరూ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే... బ్యాంకులో ఒక వ్యక్తికి కేవలం రూ.లక్ష డిపాజిట్‌ మొత్తానికే బీమా వర్తిస్తుంది. ఒకవేళ రూ.లక్షకు మించి డిపాజిట్‌ చేసి ఉంటే అప్పుడు కూడా రూ.లక్షకే బీమా కవరేజీ ఉన్నట్టు. ఒకవేళ బ్యాంకు డిపాజిట్‌ దారునికి చెల్లించలేని పరిస్థితిలోకి వెళితే ఒక డిపాజిట్‌ దారునికి గరిష్టంగా రూ.లక్ష మేర బీమా కింద చెల్లింపులు చేస్తారు. అందుకే ఈ విషయంలో తమ డిపాజిట్‌కు భద్రత ఉండేలా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

ఇటీవలి కొన్ని నివేదికలను పరిశీలించినట్టయితే... మన బ్యాంకుల్లో మొత్తం డిపాజిట్లలో 30 శాతం డిపాజిట్లకే బీమా కవరేజీ ఉందని తెలుస్తోంది. పదేళ్ల క్రితం ఇది 60 శాతంతో పోలిస్తే సగానికి సగం తగ్గినట్టు భావించాలి. ఈ మధ్య కాలంలో రూ.లక్షకు మించి డిపాజిట్‌ చేసే వారి సంఖ్య బాగానే పెరుగుతోంది. రూ.లక్షకు మించి చేసే డిపాజిట్లకు రిస్క్‌ ఉందని అర్థం చేసుకోవాలి. ఊహించని పరిస్థితులు ఎదురై బ్యాంకు డిపాజిట్లు తిరిగి ఇవ్వలేని పరిస్థితి తలెత్తితే అప్పుడే రిస్క్‌లో పడతాం. కాకపోతే డిపాజిట్‌ దారులు తెలివిగా వ్యవహరించడం ద్వారా ఇటువంటి పరిస్థితులు రాకుండా చూసుకోవచ్చు.

స్థిరమైన బ్యాంకు
పెద్దవైన, స్థిరమైన బ్యాంకులు అంత సులభంగా సంక్షోభాల్లోకి వెళ్లకపోవచ్చు. ఆస్తుల పరమైన సమస్యలున్నప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యంతోనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో ఎస్‌బీఐ, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్‌ వంటి పెద్ద బ్యాంకులు రుణ ఆస్తుల విషయంలో ఎన్నో సమస్యలను చవిచూసినప్పటికీ, వాటిని అధిగమించే చర్యలతో మెరుగైన పనితీరునే చూపిస్తున్నాయి. పెద్ద బ్యాంకులు రుణాల విషయంలో కఠినమైన నిబంధనలనే అనుసరిస్తుంటాయి. అలాగే, యాజమాన్యం కూడా చురుగ్గానే వ్యవహరిస్తుందని భావించొచ్చు. మొత్తం రుణాల్లో... వసూలు కాని రుణాలు (ఎన్‌పీఏలు), ఎగవేసిన రుణాల పరిమాణం తక్కువగానే ఉంటుంది.

మీరు చేసిన డిపాజిట్‌ను బ్యాంకు కొంత కాలం తర్వాత మీకు అవసరమైన సందర్భంలో తిరిగి చెల్లించగలదా..? అని తెలుసుకునేందుకు ఆ బ్యాంకు నికర వడ్డీ మార్జిన్‌ను పరిశీలించాలి. డిపాజిట్‌ దారులకు బ్యాంకు చెల్లించే వడ్డీ రేటు, రుణాలపై బ్యాంకు వసూలు చేసే వడ్డీ రేటు.. వీటి మధ్య వ్యత్యాసమే నికర వడ్డీ మార్జిన్‌ అవుతుంది. బ్యాంకు మొత్తం రుణ ఆస్తులపై సగటున ఈ నికర వడ్డీ మార్జిన్‌ ఎంతుందనేది బ్యాంకు ప్రతీ త్రైమాసికం ఫలితాల్లోనూ ప్రకటిస్తుంటుంది. పరిశ్రమ సగటు కంటే బ్యాంకు నికర వడ్డీ మార్జిన్‌ అధికంగా ఉంటే లేదా బెంచ్‌ మార్క్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నా సరే.. ఆ బ్యాంకు ఆర్థిక ఆరోగ్యం మెరుగ్గానే ఉన్నట్టు. దాంతో డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకే ఎక్కువ అవకాశాలు ఉంటాయి.

ఒకే చోట వద్దు
ఆర్థిక ఆరోగ్యంతో ఉన్న పెద్ద బ్యాంకులో చేసే డిపాజిట్లు భద్రంగానే ఉంటాయని భావించొచ్చు. అయితే, ఆ డిపాజిట్‌కు ఏమీ కాదులేనని గ్యారంటీగా చెప్పలేం. పెద్ద బ్యాంకులు తమ ఆస్తుల పరిమాణాన్ని పెంచుకునేందుకు భారీ ఎత్తుగడులనే అనుసరిస్తుంటాయి. కనుక రిస్క్‌ కూడా ఉంటుంది. అందుకని డిపాజిట్‌ చేసే సమయంలోనే మనమే కొన్ని చర్యలు అనుసరించడం లాభిస్తుంది. కనుక ఒకే బ్యాంకులో ఒకరి పేరిటే మొత్తం డిపాజిట్‌ చేయకపోవడం ఓ మంచి ఆలోచన. కుటుంబ సభ్యులు ఒక్కొకరి పేరిట గరిష్టంగా రూ.లక్ష వరకు డిపాజిట్‌ చేసుకోవడం వల్ల... భవిష్యత్తులో బ్యాంకు సంక్షోభంలోకి వెళ్లినా తమ డిపాజిట్లకు భద్రత ఉంటుంది. అయితే, డిపాజిట్‌పై ఆదాయానికి పన్ను వర్తిస్తుందని మర్చిపోవద్దు.

ఇక కుటుంబ సభ్యుల పేరిట డిపాజిట్‌ను విభజించేందుకు ఇష్టం లేని వారు.. తమ పేరిట వివిధ బ్యాంకుల్లో రూ.లక్ష చొప్పున డిపాజిట్‌ చేసుకోవచ్చు. ఒకటే పెద్ద డిపాజిట్‌ కాకుండా దాన్ని పలు డిపాజిట్లుగా వేరు చేయడం వల్ల.. ఎప్పుడైనా డబ్బులతో పని పడితే అవసరమైనంత మేరకే డిపాజిట్లను రద్దు చేసుకోవచ్చు. అలా కాకుండా ఒక్క డిపాజిట్‌గానే చేయడం వల్ల ఆ మొత్తాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తే కొంత రాబడిని కోల్పోవాల్సి వస్తుంది. మరొకరితో కలసి రూ.2 లక్షలు జాయింట్‌గా డిపాజిట్‌ చేశారనుకోండి. అప్పుడు రూ.2 లక్షలకూ బీమా కవరేజీ వర్తించేలా చూసుకోవచ్చు. ఒక్కొక్కరికి రూ.లక్ష డిపాజిట్‌పై బీమా అమలవుతుంది.

వీటిని దృష్టిలో పెట్టుకోవాలి..
► కేవలం బ్యాంకుల్లో చేసే ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల(రూ.లక్ష వరకు)కే కొంత భద్రత ఉంటుంది. డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ అండ్‌ క్రెడిట్‌ గ్యారంటీ కార్పొరేషన్‌ అన్నది ఆర్‌బీఐ సబ్సిడరీ. గుర్తుంచుకోవాల్సినది ఏమిటంటే... బ్యాంకు డిపాజిట్లకు సంబంధించి బీమా ప్రీమియం చెల్లించి ఉండాలి.
 
► డిపాజిట్లను వివిధ బ్యాంకుల మధ్య వేరు చేయడం వల్ల రిస్క్‌ను చాలా వరకు తగ్గించుకోవచ్చు. పైగా ప్రస్తుతం వడ్డీ రేట్లు తగ్గిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒకటే డిపాజిట్‌ను దీర్ఘకాలానికి చేయడానికి బదులు... చిన్న డిపాజిట్లుగా వేర్వేరు కాలాలకు డిపాజిట్‌ చేసుకోవడం మంచి ఆలోచన అవుతుంది. ఉదాహరణకు రూ.4 లక్షలు డిపాజిట్‌ చేసుకోదలిస్తే.. రూ.లక్ష చొప్పున ఒక్కో డిపాజిట్‌గా చేసుకోవాలి. ఏడాది, రెండేళ్లు, మూడేళ్లు, నాలుగేళ్ల కాలానికి ఒకటి కేటాయించుకోవాలి. ఏడాది డిపాజిట్‌ గడువు తీరిపోగానే తిరిగి నాలుగేళ్లకు డిపాజిట్‌ చేసుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో వడ్డీ రేట్ల పరంగా స్థిరత్వం ఉండేలా, లిక్విడిటీ ఉండేలా చూసుకోవచ్చు.  

► ఎఫ్‌డీ చేసే సమయంలోనే కాలాన్ని ఆలోచించి నిర్ణయించుకోవాలి. దీర్ఘకాలానికి డిపాజిట్‌ చేసుకుని, ముందే రద్దు చేసుకుంటే తక్కువ రాబడులకే పరిమితం కావాల్సి వస్తుంది. ఎందుకంటే గడువుకు ముందే డిపాజిట్‌ రద్దు చేసుకుంటే బ్యాంకులు ఒక శాతాన్ని తగ్గించి ఇస్తాయి. ఏడాది కాలానికి 7 శాతం, 5 ఏళ్ల దీర్ఘకాలానికి 7.5 శాతం ఆఫర్‌ చేసినప్పుడు, వడ్డీ ఎక్కువగా వస్తుందన్న ఆలోచనతో దీర్ఘకాల డిపాజిట్‌కు వెళ్లడం కంటే అవసరమైన కాలానికే డిపాజిట్‌ చేసుకోవాలి.

► ఎఫ్‌డీపై వచ్చే డిపాజిట్‌ ఆదాయంపై పన్ను అమలవుతుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వడ్డీ ఆదాయం రూ.10,000 దాటితే బ్యాంకులు వడ్డీ రాబడిపై 10.3 శాతాన్ని టీడీఎస్‌ కింద మినహాయిస్తాయి. ఇంతటితో పన్ను బాధ్యత తీరినట్టు కూడా కాదు. అధిక పన్ను పరిధిలో ఉంటే తమ శ్లాబు ప్రకారం అదనపు పన్ను కూడా చెల్లించాలి. టీడీఎస్‌ మినహాయించకపోయినప్పటికీ, బ్యాంకు సేవింగ్స్‌ ఖాతా, డిపాజిట్, బాండ్లపై వడ్డీ ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. క్యుములేటివ్‌ బాండ్‌లో ఇన్వెస్ట్‌ చేస్తే పన్నును ఏటా చెల్లించడం మరిచిపోవద్దు. బ్యాంకు డిపాజిట్లపై వడ్డీ ఆదాయం ఉన్నప్పటికీ, మొత్తం వార్షికాదాయం బేసిక్‌ కనీస మిహాయింపు పరిధిలోనే ఉంటే అప్పుడు టీడీఎస్‌ను వెనక్కి పొందేందుకు పన్ను రిటర్నులు దాఖలు చేసి క్లెయిమ్‌ చేసుకోవాలి. తమ ఆదాయం పన్ను మినహాయింపు పరిధిలోనే ఉందంటూ బ్యాంకులోనే ఫామ్‌ 15జీ ఇస్తే టీడీఎస్‌ మినహాయించరు. అదే సీనియర్‌ సిటిజన్లు అయితే ఫామ్‌ 15హెచ్‌ ఇవ్వాలి.

► మీ జీవిత భాగస్వామి, పిల్లల పేరిట డిపాజిట్‌ చేయడం ద్వారా పన్ను బాధ తప్పించుకోవచ్చు అనుకుంటే కుదరదు. మీ జీవిత భాగస్వామి, పిల్లలకు ఇచ్చే మొత్తంపై పన్ను చెల్లించనక్కర్లేదు. కానీ, అలా ఇచ్చిన మొత్తాన్ని ఇన్వెస్ట్‌ చేసిన సందర్భాల్లో వచ్చే ఆదాయం, ఇచ్చిన వారి ఆదాయానికే కలుస్తుంది.

ఇతర ఉత్పత్తులు
డిపాజిట్‌లకు ప్రత్యామ్నాయంగా రిస్క్‌ తక్కువగా ఉండే ఇతర పెట్టుబడి పథకాలను కూడా పరిశీలించొచ్చు. గవర్నమెంట్‌ సెక్యూరిటీలు లేదా జీసెక్‌లు అత్యధిక భద్రతతో ఉంటాయి. షార్ట్‌ టర్మ్‌ నుంచి లాంగ్‌ టర్మ్‌ వరకు ఎంచుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది. జీసెక్‌లను వద్దనుకుంటే సెకండరీ మార్కెట్లోనూ విక్రయించుకోవచ్చు. రెపో మార్కెట్‌లో వీటిపై రుణాలను కూడా పొందొచ్చు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు