7 శాతం కాదు.. 6.7 శాతమే..!

14 Dec, 2017 01:20 IST|Sakshi

భారత్‌ వృద్ధి అంచనాకు ఏడీబీ కోత

డీమోనిటైజేషన్, జీఎస్‌టీ, రుతుపవన అంశాలే ప్రాతిపదిక!

న్యూఢిల్లీ: భారత్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2017–18) వృద్ధి అంచనాలను ఆసియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ (ఏడీబీ) 6.7 శాతానికి తగ్గించింది. ఇంతక్రితం ఈ అంచనా 7 శాతం. డీమోనిటైజేషన్, జీఎస్‌టీ తొలి దశ ప్రతికూలాంశాలు, దీనికితోడు రుతుపవనాలు, వ్యవసాయంపై సంబంధిత ప్రభావం వంటి అంశాలను వృద్ధి అంచనాల తాజా తగ్గింపునకు కారణంగా చూపింది. 2018–19 వృద్ధి అంచనాలను సైతం 7.4 శాతం నుంచి 7.3 శాతానికి కుదించింది. క్రూడ్‌ ధరల పెరుగుదల, ప్రైవేటు పెట్టుబడులు తక్కువగా వంటి అంశాలను దీనికి కారణంగా చూపింది.

3, 4 త్రైమాసికాల్లో బెటర్‌...
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో భారత్‌ వృద్ధి రేటు మూడేళ్ల గరిష్టస్థాయి 5.7 శాతం పడిపోయి, రెండవ త్రైమాసికంలో కొంత కోలుకుని 6.3 శాతంగా నమోదయిన సంగతి తెలిసిందే. ప్రభుత్వం తీసుకువస్తున్న సంస్కరణల ఫలితాల కారణంగా తదుపరి మూడు, నాలుగు త్రైమాసికాల్లో వృద్ధి పుంజుకునే అవకాశం ఉందని ఏడీబీ అంచనా వేస్తోంది. 2017–18 ద్రవ్యోల్బణం అంచనాను 3.7 శాతంగా ఏడీబీ పేర్కొంది.  ఇంతక్రితం 4 శాతం అంచనాకన్నా ఇది తక్కువ.

వివిధ సంస్థల అంచనాలు ఇలా...
2017–18 వృద్ధి అంచనాను ప్రపంచబ్యాంక్‌ 7.2 శాతం నుంచి 7 శాతానికి తగ్గించిన సంగతి తెలిసిందే. 2019–20 నాటికి 7.4 శాతానికి పెరుగుతుందని విశ్లేషించింది.
ఇక 2017–18కి  ఓఈసీడీ (ఆర్థిక సహకార అభివృద్ధి సంఘం) వృద్ధి అంచనా 6.7 శాతం.
ఫిచ్‌ రేటింగ్స్‌ కూడా 6.9 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గించింది. 2018–19కి 7.4 శాతం నుంచి 7.3 శాతానికి తగ్గించింది.
ఇక మూడీస్‌ విషయంలో 2017–18 వృద్ధి అంచనా 7.1 శాతం నుంచి 6.7 శాతానికి తగ్గింది.
2017–20 మధ్య  సగటు వృద్ధి రేటు 7.6 శాతంగా ఉంటుందని స్టాండర్డ్‌ అండ్‌ పూర్స్‌ విశ్లేషిస్తోంది. 

మరిన్ని వార్తలు