మాల్యా బాటలోనే మెహుల్‌ చోక్సీ..

27 Aug, 2018 09:03 IST|Sakshi
పీఎన్‌బీ స్కామ్‌ నిందితుడు, గీతాంజలి జెమ్స్‌ అధిపతి మెహుల్‌ చోక్సీ (ఫైల్‌ ఫోటో)

న్యూఢిల్లీ : లండన్‌ కోర్టులో తన అప్పగింత పిటిషన్‌పై లిక్కర్‌ కింగ్‌ విజయ్‌ మాల్యా వినిపించిన వాదనలనే రూ 13,578 కోట్ల పీఎన్‌బీ స్కాం కేసులో నిందితుడు, ప్రముఖ జ్యూవెలర్‌ మెహుల్‌ చోక్సీ ముందుకుతెచ్చారు. భారత్‌ జైళ్లలో పరిస్థితులు సరిగ్గా ఉండవనే కారణం చూపి ఆయనపై రెడ్‌కార్నర్‌ నోటీస్‌ జారీ చేయాలని సీబీఐ ఇంటర్‌పోల్‌ను కోరడాన్ని వ్యతిరేకించారు.

భారత్‌లో జైళ్లు మానవ హక్కులను ఉల్లంఘించేలా ఉంటాయని, తనకు వ్యతిరేకంగా జరుగుతున్న మీడియా విచారణ న్యాయవ్యవస్థను ప్రభావితం చేస్తుందని ఇంటర్‌పోల్‌కు దాఖలు చేసిన అప్పీల్‌లో పేర్కొన్నారు. పీఎన్‌బీ స్కామ్‌లో కీలక నిందితుడైన చోక్సీ కరేబియన్‌ జంట ద్వీవులు అంటిగ్వా, బార్బుడాల్లో తలదాచుకున్నట్టు భావిస్తున్నారు.

కేసు చుట్టూ మీడియా హడావిడి అధికంగా ఉండటంతో ఆరోపణల్లో ఉన్న నిజాయితీని ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదని అన్నారు. కేసులో ప్రధాన నిందితుడైన నీరవ్‌ మోదీతో కలిపి ఈ కేసులో తనను పేర్కొంటున్నారని, భారత్‌లో నిందితులకు ఎలాంటి చట్టపరమైన రక్షణ లేదని వాపోయారు. తన ఉద్యోగులు, ఫ్రాంచైజీల నుంచి తనకు ప్రాణహాని ఉందని చోక్సీ ఇంటర్‌పోల్‌కు మొరపెట్టుకున్నారు.

>
మరిన్ని వార్తలు