అయిదేళ్లలో 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు | Sakshi
Sakshi News home page

అయిదేళ్లలో 7 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు

Published Thu, Dec 21 2023 5:34 AM

auto parts industry plans to invest 7 billion in five years - Sakshi

న్యూఢిల్లీ: వాహనాలకు డిమాండ్‌ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో ఆటో విడిభాగాల పరిశ్రమ తదనుగుణంగా సామరŠాధ్యలను పెంచుకోవడంపై, టెక్నాలజీని అప్‌గ్రేడ్‌ చేసుకోవడంపై దృష్టి పెడుతోంది. ఇందులో భాగంగా వచ్చే అయిదేళ్లలో 6.5 –7 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేసే యోచనలో ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆటో విడిభాగాల పరిశ్రమ ఆదాయం 12.6 శాతం పెరిగి రూ. 2.98 లక్షల కోట్లకు చేరింది.

పూర్తి ఆర్థిక సంవత్సరంతో పాటు వచ్చే ఏడాదీ ఇదే ధోరణి కొనసాగవచ్చని, రెండంకెల స్థాయిలో అమ్మకాలు ఉండగలవని పరిశ్రమ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలోనే పెట్టుబడి ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘పండుగ సీజన్‌లో వివిధ సెగ్మెంట్లలో గణనీయంగా అమ్మకాలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఆటో విడిభాగాల రంగం మరింత మెరుగ్గా రాణించగలదని ఆశాభావంతో ఉన్నాము‘ అని ఆటోమోటివ్‌ విడిభాగాల తయారీ సంస్థల సమాఖ్య ఏసీఎంఏ ప్రెసిడెంట్‌ శ్రద్ధా సూరి మార్వా తెలిపారు.

దేశ, విదేశ కస్టమర్ల అవసరాలను తీర్చే విధంగా సామర్ధ్యాలను పెంచుకుంటున్నట్లు ఆమె చెప్పారు. గత అయిదేళ్లలో సుమారు 3.5–4 బిలియన్‌ డాలర్ల ఇన్వెస్ట్‌ చేయగా.. రాబోయే అయిదేళ్లలో 6.5–7 బిలియన్‌ డాలర్లు వెచి్చంచనున్నట్లు వివరించారు. 875 పైచిలుకు సంస్థలకు ఏసీఎంఏలో సభ్యత్వం ఉంది. సంఘటిత ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరులో వీటికి 90 శాతం పైగా వాటా ఉంటుంది.  

స్థిరంగా ఎగుమతులు..
వాహన విక్రయాలు, ఎగుమతులు స్థిరమైన పనితీరు కనపరుస్తున్నాయని ఏసీఎంఏ డైరెక్టర్‌ జనరల్‌ విన్నీ మెహతా తెలిపారు. వాహన పరిశ్రమలోని అన్ని సెగ్మెంట్లకు ఆటో విడిభాగాల సరఫరా నిలకడగా కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో ఆటో విడిభాగాల ఎగుమతులు 2.7 శాతం పెరిగి 10.4 బిలియన్‌ డాలర్లకు చేరగా, దిగుమతులు 3.6 శాతం పెరిగి 10.6 బిలియన్‌ డాలర్లకు చేరాయని వివరించారు. దిగుమతుల్లో ఆసియా వాటా 63 శాతంగా ఉండగా, యూరప్‌ (27 శాతం), ఉత్తర అమెరికా (9 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నట్లు పేర్కొన్నారు. దిగుమతులను తగ్గించుకునేందుకు, ప్రభుత్వ తోడ్పాటుతో దేశీయంగా తయారీని పెంచేందుకు పరిశ్రమ గట్టిగా కృషి చేస్తోందని మెహతా వివరించారు. మార్వా, మెహతా చెప్పిన మరిన్ని ముఖ్యాంశాలు..
     
► ఏప్రిల్‌–సెపె్టంబర్‌ మధ్య కాలంలో ఎగుమతులకు సంబంధించి చెరి 33 శాతం వాటాతో ఉత్తర అమెరికా, యూరప్‌ అతి పెద్ద మార్కెట్లుగా కొనసాగాయి.  
► ఇదే వ్యవధిలో దేశీయంగా ఉత్పాదనల తయారీ సంస్థలకు (ఓఈఎం) విడిభాగాల అమ్మకాలు 13.9 శాతం పెరిగి రూ. 2.54 లక్షల కోట్లకు చేరాయి.  
► భారీ, శక్తిమంతమైన వాహనాలపై ఆసక్తి పెరుగుతుండటం .. ఆటో విడిభాగాల పరిశ్రమ టర్నోవరు వృద్ధికి దోహదపడుతోంది. ఆఫ్టర్‌మార్కెట్‌ సెగ్మెంట్‌ 7.5 శాతం పెరిగి రూ. 45,158 కోట్లకు చేరింది.  
► ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) సెగ్మెంట్‌ వృద్ధి కొనసాగుతోంది. గత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంతో పోలిస్తే ఈసారి ఈవీల విడిభాగాల విక్రయాలకు సంబంధించిన ఆదాయం గణనీయంగా పెరిగింది.

Advertisement
Advertisement