వేలానికి 23 చమురు బ్లాక్‌లు

11 Feb, 2019 03:53 IST|Sakshi

ఓఏఎల్‌పీ మూడో విడత ప్రారంభం 

700 మిలియన్‌ డాలర్ల పెట్టుబడుల అంచనా 

చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ వెల్లడి 

గ్రేటర్‌ నోయిడా: ఓపెన్‌ ఎక్రేజ్‌ లైసెన్సింగ్‌ విధానం (ఓఏఎల్‌పీ) కింద మూడో విడతలో కేంద్రం 23 చమురు, గ్యాస్, సీబీఎం బ్లాక్‌ల వేలం వేస్తోంది. దీనితో ఈ రంగంలోకి 600–700 మిలియన్‌ డాలర్ల మేర పెట్టుబడులు రావొచ్చని భావిస్తోంది. ఆదివారమిక్కడ పెట్రోటెక్‌ 2019 సదస్సులో ఓఏఎల్‌పీ మూడో రౌండును ఆవిష్కరించిన సందర్భంగా కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఈ విషయాలు వెల్లడించారు. దేశీయంగా ఇంధన ఉత్పత్తి పెంచేందుకు, దిగుమతులపై ఆధారపడటం తగ్గించుకునేందుకు ఇది తోడ్పడగలదని భావిస్తున్నట్లు ఆయన వివరించారు. మూడో విడతలో అయిదు కోల్‌ బెడ్‌ మీథేన్‌ బ్లాక్‌లు కూడా ఉన్నాయని, మొత్తం 31,000 చ.కి.మీ. మేర అన్వేషణ ప్రాంతం విస్తరించి ఉంటుందని మంత్రి చెప్పారు. బిడ్డింగ్‌కు ఏప్రిల్‌ 10 ఆఖరు తేదీగా ఉంటుందని తెలిపారు.

ఇప్పటికే ప్రకటించిన ఓఏఎల్‌పీ రెండో విడతకు సమాంతరంగా మూడో విడత బిడ్డింగ్‌ కూడా జరుగుతుందని ఆయన వివరించారు.  రెండో విడత కింద 29,333 చ.కి.మీ. విస్తీర్ణంలో 14 బ్లాక్‌లను వేలం వేస్తుండగా, మార్చి 12 బిడ్డింగ్‌కు ఆఖరు తేదీగా ఉంది. దీని ద్వారా రూ. 40,000 కోట్ల పెట్టుబడులు రావొచ్చని అంచనా. ప్రస్తుతం లైసెన్సులు జారీ కాని ప్రాంతాల్లో చమురు, గ్యాస్‌ నిక్షేపాలు ఉండొచ్చన్న అంచనాలు ఉన్న పక్షంలో ఆయా ప్రాంతాల కోసం ఓఏఎల్‌పీ కింద ఏడాది పొడవునా కంపెనీలు దరఖాస్తు చేసుకోవచ్చు. వాటన్నింటినీ పరిశీలించాకా కేంద్రం ఏటా రెండు సార్లు ఆయా ప్రాంతాలను బ్లాక్‌ల కింద వేలం వేస్తోంది.  

సంక్లిష్ట క్షేత్రాల్లో ఉత్పత్తికి ప్రోత్సాహకాలు.. 
ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీ, ఆయిల్‌ ఇండియా సంస్థలు దాదాపు 12 సంక్లిష్టమైన క్షేత్రాల నుంచి కూడా గ్యాస్‌ ఉత్పత్తి చేపట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.  ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్, ముంబైలో ఓఎన్‌జీసీకి ఉన్న సంక్లిష్ట క్షేత్రాల్లో 35 బిలియన్‌ ఘనపు మీటర్ల (ఎంసీఎండీ) నిక్షేపాలు ఉన్నట్లు అంచనా. 
 

మరిన్ని వార్తలు