పెట్టుబడుల ఉపసంహరణకు ప్రత్యామ్నాయాలు

20 Oct, 2018 01:03 IST|Sakshi

పీఎస్‌యూల విలీనాలు, కొనుగోళ్లు, షేర్ల బైబ్యాక్‌లు

రూ.80,000 కోట్ల లక్ష్యం చేరే మార్గాల్లో కేంద్రం  

న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వరంగ సంస్థల్లో (పీఎస్‌యూలు) పెట్టుబడుల ఉపసంహరణ (వాటాల విక్రయం) ద్వారా రూ.80,000 కోట్లను సమీకరించాలన్న లక్ష్యంతో ఉన్న కేంద్రం... మార్కెట్‌ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఆశ్రయిస్తోంది. ఇందుకోసం ప్రభుత్వరంగ సంస్థల మధ్యే విలీనాలు, కొనుగోళ్లు, షేర్ల బైబ్యాక్‌ మార్గాలను కేంద్ర ఆర్థిక శాఖ తెరపైకి తీసుకొస్తోంది.

2018–19లో తొలి ఆరు నెలల్లో కేంద్ర ప్రభుత్వం మూడు పీఎస్‌యూల ఐపీవోలు, భారత్‌–22 ఈటీఎఫ్‌ ద్వారా రూ.9,600 కోట్లను సమీకరించింది. తన లక్ష్యంలో భారీ మొత్తాన్ని మిగిలిన ఆరు నెలల కాలంలో చేరుకోవాలి. మార్కెట్లో గడిచిన మూడు, నాలుగు నెలలుగా లిక్విడిటీ పరమైన సమస్య నెలకొందని, అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితి ఉన్నంత వరకు, చము రు ధరల మంటలు చల్లారనంత వరకు లిక్విడిటీ పరమైన ఇబ్బందులు కొనసాగొచ్చని కేంద్ర ఆర్థిక శాఖ సీనియర్‌ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘‘పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యాన్ని చేరుకుంటాం. ఒకే తరహా వ్యాపారాల్లో ఉన్న పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ తరహా ప్రభుత్వరంగ సంస్థల మధ్య కొనుగోళ్లను పరిశీలిస్తున్నాం’’ అని ఆ అధికారి చెప్పారు.  

జాబితాలోని కంపెనీలు
విలీనం, కొనుగోళ్లను వెంటనే ప్రారంభించేందుకు పెట్టుబడుల ఉపసంహరణ విభాగం (దీపం) త్వరలోనే మర్చంట్‌ బ్యాంకర్ల కోసం బిడ్లను ఆహ్వానించనుంది. పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (పీఎఫ్‌సీ)లో తనకున్న 65.61 శాతం వాటాను రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌ (ఆర్‌ఈసీ)కి విక్రయించడం ద్వారా కేంద్ర ఖజానాకు రూ.14,000 కోట్లు సమకూరతాయని అంచనా. ఇక షేర్ల బైబ్యాక్‌ కోసం కోల్‌ ఇండియా, ఎన్‌టీపీసీ, నాల్కో, ఎన్‌ఎండీసీ తదితర కంపెనీలతో కేంద్ర ఆర్థిక శాఖ ఓ జాబితా రూపొందించింది.

ఈ జాబితాలో బీహెచ్‌ఈఎల్, ఎన్‌హెచ్‌పీసీ, ఎన్‌బీసీసీ, ఎస్‌జేవీఎన్, కేఐఓసీఎల్, హిందుస్తాన్‌ ఏరోనాటిక్స్‌ ఉన్నాయి. ఇప్పటికే నాల్కో, ఎన్‌ఎల్‌సీ, కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ కలిపి రూ.2,000 కోట్లతో షేర్ల బైబ్యాక్‌కు నిర్ణయించిన విషయం గమనార్హం. ప్రస్తుత మార్కెట్‌ పరిస్థితుల నేపథ్యంలో ఐపీవోలు, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ను పరిశీలించడం లేదని ఆ అధికారి స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు