కొనసాగుతున్న ఎఫ్‌పీఐ అమ్మకాలు

14 Nov, 2023 06:02 IST|Sakshi

నవంబర్‌లో ఇప్పటివరకు రూ. 5,800 కోట్ల విక్రయాలు

న్యూఢిల్లీ: మధ్యప్రాచ్యంలో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, వడ్డీ రేట్లు పెరుగుతుండటం వంటి అంశాల నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) దేశీయంగా ఈక్విటీలను విక్రయించడం కొనసాగిస్తున్నారు. డిపాజిటరీల గణాంకాల ప్రకారం .. నవంబర్‌లో ఇప్పటివరకు (1 నుంచి 10వ తేదీ వరకు) రూ. 5,800 కోట్ల మేర అమ్మేశారు. ఇప్పటికే అక్టోబర్‌లో రూ. 24,548 కోట్లు, సెపె్టంబర్‌లో 14,767 కోట్ల మేర పెట్టుబడులను ఉపసంహరించుకున్నారు.

దాని కన్నా ముందు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో (మార్చి నుంచి ఆగస్టు వరకు) దాదాపు రూ. 1.74 లక్షల కోట్లు ఇన్వెస్ట్‌ చేశారు. మరోవైపు, అక్టోబర్‌లో డెట్‌ మార్కెట్లో రూ. 6,381 కోట్లు ఇన్వెస్ట్‌ చేసిన విదేశీ ఇన్వెస్టర్లు ఈ నెలలో ఇప్పటివరకు రూ. 6,053 కోట్లు పెట్టుబడులు పెట్టారు. మొత్తం మీద ఈ ఏడాది ఇప్పటివరకు ఎఫ్‌పీఐల పెట్టుబడులు ఈక్విటీల్లో రూ. 90,161 కోట్లు, డెట్‌ మార్కెట్లో రూ. 41,554 కోట్లకు చేరాయి.

ఇజ్రాయెల్‌–హమాస్‌ మధ్య ఉద్రిక్తతలు, అమెరికా ట్రెజరీ బాండ్‌ ఈల్డ్‌లు పెరగడం వంటి అంశాల కారణంగా ఎఫ్‌పీఐల విక్రయాల ధోరణి కొనసాగుతోందని మారి్నంగ్‌స్టార్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ ఇండియా అసోసియేట్‌ డైరెక్టర్‌ హిమాంశు శ్రీవాస్తవ చెప్పారు. పరిస్థితులు మెరుగుపడి ఈక్విటీల్లో తిరిగి ఇన్వెస్ట్‌ చేసే వరకు నిధులను స్వల్పకాలికంగా డెట్‌ మార్కెట్లోకి మళ్లించే వ్యూహాన్ని మదుపుదారులు అమలు చేస్తున్నట్లు పరిశీలకులు తెలిపారు.  ఆర్థిక రంగ సంస్థలు మెరుగైన క్యూ2 ఫలితాలు ప్రకటిస్తూ, ఆశావహ అంచనాలు వెలువరిస్తున్నప్పటికీ ఎఫ్‌పీఐలు వాటిలో అత్యధికంగా అమ్మకాలు కొనసాగిస్తున్నారు. దీంతో బ్యాంకింగ్‌ స్టాక్స్‌ వేల్యుయేషన్లు ఆకర్షణీయంగా మారినట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ స్ట్రాటెజిస్ట్‌ వీకే విజయకుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు