ఈ దీపావళి అమెజాన్‌దా? ఫ్లిప్‌కార్ట్‌దా?

14 Sep, 2017 19:35 IST|Sakshi
ఈ దీపావళి అమెజాన్‌దా? ఫ్లిప్‌కార్ట్‌దా?
సాక్షి, న్యూఢిల్లీ : ఈ దీపావళి సీజన్‌లో ఈ-కామర్స్‌ దిగ్గజాలు ఫ్లిప్‌కార్ట్‌, అమెజాన్‌లు పోటాపోటీగా ఆఫర్ల పండుగకు సిద్ధమవుతున్నాయి. నో కాస్ట్‌ ఈఎంఐలు, క్రాస్‌-ఎక్స్చేంజ్‌ స్కీమ్‌లతో ఫ్లిప్‌కార్ట్‌కు చెక్‌ పెట్టాలని అమెజాన్‌ ప్లాన్‌ చేస్తోంది. అంతేకాక గతేడాది ఆఫర్‌ చేసిన దానికంటే ఎక్కువ మొత్తంలోనే మోడల్స్‌ను విక్రయానికి తీసుకొస్తోంది. టెలివిజన్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్ల వంటి కన్జ్యూమర్‌ ఎలక్ట్రానిక్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలని అమెజాన్‌ నిర్ణయించింది. 70 మోడల్స్‌ను ప్రవేశపెడుతోంది కూడా. అదేవిధంగా ఓ వినూత్న ఆఫర్‌ను కూడా అమెజాన్‌ ప్రవేశపెట్టింది. వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌ను ఏదైనా ఎలక్ట్రానిక్స్‌తో ఎక్స్చేంజ్‌ చేసుకోవచ్చని అమెజాన్‌ పేర్కొంది. ఇలా దీపావళి విక్రయాల్లో తన ప్రత్యర్థి ఫ్లిప్‌కార్ట్‌కు అడ్డుకట్ట వేయాలని చూస్తోంది. 
 
ఆగస్టులో నిర్వహించిన ఇండిపెండెన్స్‌ డే సేల్స్‌లో ఆఫర్‌ చేసిన నో-కాస్ట్‌ ఈఎంఐ ఆప్షన్‌ ద్వారానే తమ మూడోవంతు విక్రయాలు నమోదయ్యాయని అమెజాన్‌ ఇండియా డైరెక్టర్‌ కవీస్‌ చావ్లా చెప్పారు. ఏడాది ఏడాదికి తమ టెలివిజన్‌ సేల్స్‌ 158 శాతం పెరుగుతున్నాయన్నారు. అదేవిధంగా గృహోపకరణాలు 400శాతం జంప్‌ చేసినట్టు తెలిపారు. ప్రాంతీయంగా డిమాండ్‌ పెరుగుతుండటంతో, ఈ కేటగిరీల కోసం ప్రత్యేకంగా 12 ఫుల్‌ఫిల్మెంట్‌ సెంటర్లను ఏర్పాటుచేసినట్టు చావ్లా చెప్పారు. అమెజాన్‌, ఫ్లిప్‌కార్ట్‌లు రెండు సెప్టెంబర్‌ 20 నుంచి 24 మధ్యలో పండుగ ఆఫర్లతో వినియోగదారుల ముందుకు వస్తున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి ఫ్లిప్‌కార్ట్‌ అడ్వర్‌టైజింగ్‌ క్యాంపెయిన్‌ను నిర్వహిస్తోంది. అమెజాన్‌ కూడా తన క్యాంపెయిన్‌ను ప్రారంభించడానికి సిద్దమవుతోంది. 
మరిన్ని వార్తలు