యాపిల్‌ స్టోర్స్‌ బంద్‌- డోజోన్స్‌ డౌన్‌

20 Jun, 2020 09:25 IST|Sakshi

ఆటుపోట్ల మధ్య అటూఇటుగా..

డోజోన్స్‌- ఎస్‌అండ్‌పీ నేలచూపు

నామమాత్ర లాభంతో నాస్‌డాక్‌

క్రూయిజర్‌, ఎయిర్‌లైన్‌ షేర్లు బోర్లా

టాటా మోటార్స్‌ అప్‌- వేదాంతా వీక్‌

మరోసారి కోవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం అమెరికా స్టాక్‌ మార్కెట్లు ఊగిసలాటకు లోనయ్యాయి. హెచ్చుతగ్గుల మధ్య అటూఇటుగా ముగిశాయి. డోజోన్స్‌ 209 పాయింట్లు(0.8 శాతం) క్షీణించి 25,871కు చేరగా..ఎస్‌అండ్‌పీ 18 పాయింట్లు(0.6 శాతం) వెనకడుగుతో 3,098 వద్ద స్థిరపడింది. అయితే నాస్‌డాక్‌ 3 పాయింట్ల నామమాత్ర లాభంతో 9,9436 వద్ద స్థిరపడింది. యూరోపియన్‌ మార్కెట్లలో జర్మనీ, ఫ్రాన్స్‌, యూకే 0.4-1 శాతం మధ్య బలపడ్డాయి. ఇక ఆసియాలో చైనా, హాంకాంగ్‌, జపాన్‌, కొరియా, ఇండొనేసియా 1-0.4 శాతం మధ్య పుంజుకోగా.. సింగపూర్‌ 1.2 శాతం, థాయ్‌లాండ్‌ 0.2 శాతం మధ్య బలహీనపడ్డాయి. తైవాన్‌ యథాతథంగా ముగిసింది.

నాస్‌డాక్‌ జోరు
గత వారం డోజోన్స్‌ నికరంగా 1 శాతం లాభపడగా.. ఎస్‌అండ్‌పీ దాదాపు 2 శాతం ఎగసింది. టెక్‌ దిగ్గజాల అండతో నాస్‌డాక్‌ మరింత అధికంగా 3.7 శాతం జంప్‌చేసింది. కాగా.. ఫిబ్రవరిలో సాధించిన చరిత్రాత్మక గరిష్టాలకు డోజోన్స్‌ 8.5 శాతం, ఎస్‌అండ్‌పీ 12.5 శాతం దూరంలో నిలవగా.. నాస్‌డాక్‌ 1.3 శాతం సమీపంలో ముగిసింది.

యాపిల్‌ స్టోర్లు బంద్‌
ఇటీవల ఫ్లోరిడా, ఆరిజోనా, ఉత్తర, దక్షిణ కరోలినాలలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా కొన్ని ప్రాంతాలలో స్టోర్లను మూసివేస్తున్నట్లు ఐఫోన్ల దిగ్గజం యాపిల్‌ ఇంక్‌ పేర్కొంది. దీంతో యాపిల్‌ షేరు స్వల్పంగా 0.5 శాతం నీరసించింది. కోవిడ్‌-19 కేసులు మళ్లీ పెరుగుతున్న ఆందోళనలతో థియేటర్ల నిర్వాహక సంస్థ ఏఎంసీ ఎంటర్‌టైన్‌మెంట్‌ హోల్డింగ్స్‌ 2 శాతం క్షీణించింది. ఈ ఆందోళనలతో క్రూయిజర్‌ కంపెనీలు నార్వేజియన్‌, కార్నివాల్‌ 5 శాతం చొప్పున పతనంకాగా.. రాయల్‌ కరిబ్బియన్స్‌ 7 శాతం జారింది. ఈ బాటలో రిటైల్‌ దిగ్గజాలు, వియానయాన కంపెనీలు నార్డ్‌స్ట్రామ్‌, కోల్స్‌, యునైటెడ్‌ ఎయిర్‌లైన్స్‌, డెల్టా 6-4 శాతం మధ్య తిరోగమించాయి.

బ్యాంక్స్‌ ప్లస్‌
అమెరికా స్టాక్‌ ఎక్స్ఛేంజీలలో లిస్టయిన దేశీ స్టాక్స్‌ (ఏడీఆర్‌)లో వారాంతాన అత్యధిక శాతం లాభాలతో ముగిశాయి. టాటా మోటార్స్‌(టీటీఎం)3.5 శాతం జంప్‌చేసి 6.6 డాలర్ల వద్ద నిలవగా.. ఐసీఐసీఐ బ్యాంక్‌(ఐబీఎన్‌) 2.5 శాతం ఎగసి 9.47 డాలర్ల వద్ద స్థిరపడింది, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌(హెచ్‌డీబీ) 2.15 శాతం పుంజుకుని 44.69 డాలర్లను తాకగా.. వేదాంతా(వీఈడీఎల్‌) 3.7 శాతం పతనమై 5.44 డాలర్ల వద్ద ముగిసింది. ఇతర కౌంటర్లలో విప్రో లిమిటెడ్‌ 1.2 శాతం నీరసించి 3.3 డాలర్లకు చేరగా.. ఇన్ఫోసిస్‌ 0.7 శాతం వెనకడుగుతో 9.16 డాలర్ల వద్ద స్థిరపడింది. ఈ బాటలో డాక్టర్‌ రెడ్డీస్‌ 0.2 శాతం బలహీనపడి 53.18 డాలర్ల వద్ద నిలిచింది.   

మరిన్ని వార్తలు