అలాంటి యూపీఐ ఐడీలు డీయాక్టివేట్ అవుతాయ్ - చెక్ చేసుకోండి!

18 Nov, 2023 10:52 IST|Sakshi

యూపీఐ లావాదేవీలు పెరుగుతున్న సమయంలో చాలామంది చేతిలో డబ్బు పెట్టుకోవడమే మర్చిపోయారు. చిన్న కొట్టు దగ్గర నుంచి పెద్ద షాపింగ్ మాల్స్ వరకు ఎక్కడ ఏది కొనాలన్నా ఆన్‌లైన్‌ చెల్లింపులు చేస్తున్నారు. ఇది చాలా సులభమైన ప్రాసెస్ కూడా. అయితే ఇప్పుడు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ఓ కొత్త రూల్ తీసుకువచ్చింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ ప్రకారం వాడకంలో లేని.. లేదా వినియోగంలో లేని యూపీఐ ఐడీలను డీయాక్టివ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రక్రియను ఫోన్‌పే, గూగుల్ పేకి మాత్రమే కాకుండా పేటీఎమ్ వంటి ఇతర పేమెంట్స్ యాప్స్ కూడా ప్రారంభించాలని ఆదేశించింది.

ఒక సంవత్సరంకంటే ఎక్కువ రోజులు వినియోగంలో లేని యూపీఐ ఐడీలను పూర్తిగా క్లోజ్ చేయాలని సంబంధిత సంస్థలకు నేషనల్‌ పేమెంట్‌ కార్పొరేషన్‌ సర్క్యులర్ జారీ చేసినట్లు సమాచారం. ఇందులో 2023 డిసెంబర్ 31 నాటికి ఈ మార్గదర్శకాలను అమలు చేయాలనీ స్పష్టం చేసింది.

ఇదీ చదవండి: ఓపెన్‌ఏఐ కొత్త సీఈఓ.. ఎవరీ 'మీరా మురాటి'?

వినియోగదారులు లేదా ఖాతాదారులు మొబైల్ నెంబర్స్ మార్చుకునే సమయంలో.. అప్పటికే ఉన్న నెంబర్స్ డీయాక్టివేట్ చేయకపోతే.. వారికి సంబంధం లేని కొన్ని ఖాతాలకు డబ్బు బదిలీ అయ్యే అవకాశం ఉందని ఎన్‌పీసీఐ భావించి ఈ నిర్ణయం తీసుకుంది. అంటే టెలికం ఆపరేటర్లు పాత నెంబర్స్ వేరొకరికి అందించడం వల్ల ఈ ప్రమాదం జరుగుతుంది. కాబట్టి వినియోగంలో లేని ఐడీలను డీయాక్టివేట్ చేస్తే ఈ సమస్య జరగదని ధ్రువీకరించింది.

మరిన్ని వార్తలు