మార్కెట్లో 60 శాతం షేర్లు చౌకే!

3 Jul, 2013 06:46 IST|Sakshi
Laxmikant Reddy

మూడేళ్ళుగా నడుస్తున్న బేర్ ట్రెండ్‌కు వచ్చే ఏడాది బ్రేక్ పడుతుందంటున్నారు ఐసీఐసీఐసీ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఈక్విటీ హెడ్ లక్ష్మీకాంత్ రెడ్డి.  ప్రస్తుత మార్కెట్లో 60 శాతానికిపైగా షేర్లు ఆకర్షణీయంగా ఉన్నాయని, ఇదే సమయంలో ఈ ఏడాది ఎఫ్‌ఎంసీజీ షేర్లు పతనమయ్యే అవకాశం ఉందంటున్న లక్ష్మీకాంత్ రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూ. ముఖ్యాంశాలు...
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో
అంతర్జాతీయ పరిణామాలు దేశీయ మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. మున్ముందు పరిస్థితులెలా ఉంటాయి?
వృద్ధిరేటు సన్నగిల్లడం, కరెంట్ అకౌంట్‌లోటు, ద్రవ్యలోటు పెరగడం, విదేశీ నిధులపై ఎక్కువగా ఆధారపడటం వంటివి కొత్త సమస్యలేమీ కావు. ఇవన్నీ దేశీయ మార్కెట్ ఎప్పటి నుంచో ఎదుర్కొంటున్నవే. అంతర్జాతీయ పరిణామాల వల్ల ఎఫ్‌ఐఐలు క్రమంగా వెనక్కెళ్ళిపోతుండటమే ఇపుడు ప్రధాన సమస్య. అమెరికా మార్కెట్లో బాండ్ల ద్వారా వచ్చే రాబడి పెరగడం, వర్ధమాన, ధనిక దేశాల మధ్య నమోదవుతున్న వృద్ధిరేటులో వ్యత్యాసం తగ్గుతుండటం వంటి కారణాలతో ఎఫ్‌ఐఐల నిధుల ప్రవాహంలో ఒడిదుడుకులు ఉండొచ్చు.
 
 ఇప్పటికే దేశీయ మార్కెట్ల నుంచి ఎఫ్‌ఐఐలు భారీగా వైదొలిగారు. మరి భవిష్యత్తులో...?
 దేశీయ సంస్థాగత మదుపుదారుల పెట్టుబడులపై ఎంతో నమ్మకంగా మాట్లాడవచ్చు. కానీ ఎఫ్‌ఐఐల విషయానికొస్తే గత సంవత్సరంలో దేశీయ మార్కెట్లో 40 బిలియన్ డాలర్లకుపైగా విలువైన పెట్టుబడులు పెట్టారు. అందులో కొంత మొత్తం వెనక్కి వెళ్ళి ఉంటుంది. కాని గతంతో పోలిస్తే ఎఫ్‌ఐఐల అమ్మకాలు చాలా తక్కువే. ఇక్కడ ఇంకొకటి కూడా గుర్తుంచుకోవాలి. ఎఫ్‌ఐఐలవన్నీ దీర్ఘకాలిక పెట్టుబడులే కావల్సిన అవసరం లేదు. కొన్ని స్వల్పకాలానికి వెనక్కి వెళ్ళిపోయేవి కూడా ఉంటాయి.
 
 తొలి త్రైమాసిక ఫలితాలు ఎలా ఉండొచ్చు?
 తొలి త్రైమాసికంతోపాటు మొదటి ఆరు నెలల కాలానికి అమ్మకాల్లో వృద్ధి చాలా తక్కువగానే ఉంటుంది. ఈ వృద్ధిరేటు సింగిల్ డిజిట్‌కే పరిమితమవుతుంది. అలాగే ఎర్నింగ్ పర్ షేర్ (ఈపీఎస్)లో కూడా ఎటువంటి పెరుగుదల ఉండదు. ఈ మధ్యకాలంలో రూపాయి విలువ బాగా క్షీణించడం వల్ల కొన్ని రంగాల ఆదాయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ ఇదే సమయంలో కొన్ని రంగాలకు వ్యయం పెరుగుతోంది. స్వల్పకాలానికి కంపెనీల ఆదాయంలో ఎలాంటి వృద్ధి ఉండకపోవచ్చు.
 
 ప్రస్తుతం మార్కెట్లు ఆకర్షణీయంగా ఉన్నాయంటారా?
 ప్రస్తుత మార్కెట్ల విలువ గత సగటుకు అనుగుణంగానే ఉన్నప్పటికినీ... ఇప్పుడున్న మార్కెట్‌ను రెండు రకాలుగా చూడాలి. స్టాక్ మార్కెట్లో 60 శాతం వాటాను కలిగి ఉన్న క్యాపిటల్ గూడ్స్, కమోడిటీస్, యుటిలిటీస్, ప్రభుత్వరంగ సంస్థలు విలువపరంగా చౌకగా ఉన్నాయి.  మిగిలిన 40 శాతానికి చెందిన ఎఫ్‌ఎంసీజీ, ప్రైవేటు ఫైనాన్షియల్, ఫార్మా రంగాల షేర్లు ఖరీదైనవిగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న వడ్డీరేట్లు, వృద్ధిరేటు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుంటే మార్కెట్లు మరీ చౌకగా ఉన్నాయని చెప్పలేము... అలా అని ఖరీదైనవనీ చెప్పలేం. కాని కొన్ని రంగాల్లో మంచి అవకాశాలున్నాయి.
 
 అంటే.. ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా రంగాల షేర్లు క్షీణిస్తాయా?
 ఇప్పటికే బాగా క్షీణించిన రంగాలు కోలుకునే అవకాశం ఉంటే, ఇప్పటికే అధిక విలువ ఉన్న కొన్ని రంగాలు క్షీణించే అవకాశాలున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఎంసీజీ షేర్ల విలువ క్షీణించే అవకాశం ఉంది. ఇండియా వినిమయశక్తి తగ్గుతుండటంతో ఎఫ్‌ఎంసీజీ షేర్లు ఈ విలువను నిలబెట్టుకోవడం కష్టమే. కొన్ని పెద్ద ఎఫ్‌ఎంసీజీ కంపెనీ షేర్లలో బైబ్యాక్ నడుస్తుండటం వల్ల ఇప్పటికీ అధిక ధరలో కొనసాగుతున్నాయి. ఫార్మా విషయానికి వస్తే రూపాయి విలువ క్షీణించడం వల్ల ఎగుమతులు ఎక్కువగా చేసే ఫార్మా కంపెనీల షేర్లు పతనం కాకపోవచ్చు.
 
 ప్రస్తుత మార్కెట్ కదలికలపై మీ అంచనాలేంటి? ర్యాలీ వస్తే ఇన్వెస్టర్లను వైదొలగమంటారా? లేక కొనమంటారా?
 మూడేళ్ల క్రితం మొదలైన పతనం చివరి అంకానికి చేరిందని భావిస్తున్నాం. వచ్చే ఏడాది ఈ ట్రెండ్ రివర్స్ కావచ్చు. కంపెనీల ఆదాయం బాగా తగ్గడంతో మిగిలిన పెట్టుబడి సాధనాలతో పోలిస్తే ఈక్విటీలు పనితీరు నిరాశాజనకంగా ఉంది. మున్ముందు ఈ పరిస్థితి నుంచి ఈక్విటీలు బయటపడి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈక్విటీల నుంచి వైదొలగమని సూచించం. కానీ, పతన సమయంలో కొన్ని ఎంపిక చేసుకున్న స్టాక్స్‌ను కొనుగోలు చేయమని చెపుతాను. లేదంటే ఇలాంటి స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవచ్చు.
 

>
మరిన్ని వార్తలు