సాక్షి మనీ మంత్ర: స్వల్ప నష్టాల్లో ముగిసిన దేశీయ మార్కెట్లు

16 Oct, 2023 16:05 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు సోమవారం స్వల్ప నష్టాలతో ముగిశాయి. ముగిసిన గత వారం మార్కెట్‌తో పోలిస్తే సెన్సెక్స్‌ 125 పాయింట్ల నష్టంతో 66,166 వద్దకు చేరింది. నిఫ్టీ 19 పాయింట్లు నష్టపోయి 19,731లో ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం 83.29 వద్ద నిలిచింది. 

సెన్సెక్స్‌ 30 సూచీలో టాటా స్టీల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిక్‌ బ్యాంక్‌, పవర్‌గ్రిడ్‌, ఎం అండ్‌ ఎం, టైటాన్‌, ఎన్‌టీపీసీ, ఎల్‌ అండ్‌ టీ, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నెస్లే, టీసీఎస్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఏషియన్‌ పెయింట్స్‌, సన్‌ ఫార్మా, భారతీ ఎయిర్‌టెల్‌, టెక్‌ మహీంద్రా, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, బజాజ్‌ ఫైనాన్స్‌, రిలయన్స్‌ షేర్లు నష్టాల్లో ఉన్నాయి.

అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాలతో ముగిశాయి. అక్కడి టెక్‌ స్టాక్స్‌లో వచ్చిన అమ్మకాల సెగ సూచీలను కిందకు లాగింది. ఐరోపా మార్కెట్లు సైతం నష్టాల్ల్లోనే స్థిరపడ్డాయి. నేడు ఆసియా- పసిఫిక్‌ సూచీలూ స్వల్ప నష్టాల్లో ట్రేడయ్యాయి. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులకు సిద్ధమవుతోందన్న సంకేతాలు మదుపర్లను కలవరపెడుతున్నాయి. ఇది ఎక్కడికి దారితీస్తోందోననే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. విదేశీ సంస్థాగత మదుపర్లు శుక్రవారం ఇటీవలి ధోరణికి భిన్నంగా రూ.317.01 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ సంస్థాగత మదుపర్లు రూ.102.8 కోట్లు విలువ చేసే షేర్లను విక్రయించారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, సియెట్‌, ఫెడరల్‌ బ్యాంక్‌, ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌, జై బాలాజీ ఇండస్ట్రీస్‌, జియో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, ఓరియెంట్‌ హోటల్స్‌, యాత్రా ఆన్‌లైన్‌ కంపెనీలు ఈ రోజు ఫలితాలు ప్రకటించనున్నాయి.

మరిన్ని వార్తలు