సచిన్‌, షారూఖే కాదు.. ఇక రాందేవ్‌ కూడా

25 Jun, 2018 20:12 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: యోగా విన్యాసాలతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన ప్రముఖ యోగా గురు రాందేవ్‌ బాబా మరో విశేషాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ప్రపంచవ్యాప్తంగా గుర్తింపుపొందిన ప్రముఖుల మైనపు విగ్రహాలను ఉంచే లండన్‌ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో రాందేవ్ బాబా మైనపు బొమ్మ త్వరలో కొలువు దీరనుంది. తద్వారా ప్రముఖ సెలబ్రిటీలు, లెజెండ్స్‌ సరసన ఈ యోగా  గురూ కూడా చేరనున్నారు.  దీంతో  ఈ ఘనత సాధించిన తొలి యోగా గురువుగా కూడా అవతరించనున్నారు.  ఈ విషయాన్ని రాందేవ్ బాబా ట్విటర్‌లో షేర్‌ చేశారు. ట్రీ పోజ్(వ్రికాసన) యోగ ఆసనంలో ఆయన మైనపు బొమ్మ రూపకల్పనకు రంగం సిద్ధమైంది.  దాదాపు 20మంది నిపుణులు ఇప్పటికే ఈ పనిలో బిజీగా ఉన్నారు. కళ్లు, చెవులు, తల, ఆయన రంగు  తదితర వివరాలను సేకరిస్తున్నారు. 

యోగా, ఆయుర్వేదం రెండూ ప్రపంచానికి  లభించిన అతిపెద్ద బహుమతులని ఆయన  పేర్కొన్నారు. భారతీయ యోగా, ఆధ్యాత్మికతకు ఇలాంటి గుర్తింపు దొరకడం గర్వకారణమని, తన మైనపు బొమ్మను మ్యూజియంలో పెట్టడం ద్వారా యోగా శాస్త్ర కీర్తి మరింత విశ్వవ్యాప్తవుతుందని చెప్పారు. అలాగే యోగా జీవనశైలిని అనుసరించడానికి ప్రపంచవ్యాప్తంగా ప్రజలను ఇది  మరింత ప్రోత్సహిస్తుందన్నారు. తన ప్రతిమను పెట్టాలన్న ప్రతిపాదన రెండు నెలల క్రితమే వచ్చిందని, బాగా ఆలోచించి అంగీకారం తెలిపానని రాందేవ్ తెలిపారు. 

కాగా తన ఆయుర్వేద ఉత్పత్తులతో పతంజలి సంస్థ  నెస్లే, కోల్గేట్‌ ప్రోక్టర్ అండ్ గాంబుల్, హిందూస్తాన్ యూనీలీవర్ వంటి విదేశీ రిటైల్ కంపెనీలను ఇప్పటికే  భారీగా దెబ్బ కొట్టింది.  2017 నాటికి పతంజలి వార్షిక టర్నోవర్  10,000 కోట్ల మార్కును దాటేసింది. దీంతో పతంజలి సీఈవో  బాలకృష్ణ భారీ సంపదతో  ఫో‍ర్బ్స్‌ బిలియనీర్ జాబితాలో చేరారు. మరోవైపు ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు పోటీగా స్వదేశీ  వెర్షన్‌ ‘పరిధాన్‌’ను త్వరలోనే లాంచ్‌  చేయనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే.

>
మరిన్ని వార్తలు