సమాజానికి ఆదర్శంగా నిలవాలి కలెక్టర్‌ అమ్రపాలి | Sakshi
Sakshi News home page

సమాజానికి ఆదర్శంగా నిలవాలి కలెక్టర్‌ అమ్రపాలి

Published Mon, Jun 25 2018 8:25 PM

Must be ideal for society : Amrapali - Sakshi

కాటకాజీపేట అర్బన్‌ :  ఇంటర్న్‌షిప్‌లో శిక్షణ పొందిన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలవాలని జిల్లా కలెక్టర్, రెడ్‌క్రాస్‌ సొసైటీ అధ్యక్షురాలు అమ్రపాలి కాట తెలిపారు. అర్బన్‌ జిల్లా కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఆదివారం ఇంటర్న్‌షిప్‌ పూర్తి చేసిన విద్యార్థులకు సర్టిఫికెట్లను కలెక్టర్‌ అందించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హన్మకొండ సుబేదారిలోని రెడ్‌క్రాస్‌ సొసైటీలో 22 మంది ఇంజనీరింగ్, మెడికల్, డిగ్రీ, ఇంటర్‌ విద్యార్థులకు మే 28 నుంచి జూన్‌ 11వ తేదీ వరకు ఇంటర్న్‌షిప్‌ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

ఇంటర్న్‌షిప్‌లో భాగంగా రెడ్‌క్రాస్‌లోని ధాలసెమియా సెంటర్‌లో 252 మంది వ్యాధిగ్రస్తులు రిజిస్ట్రేషన్‌ చేయించుకోగా విద్యార్థులు వారిపై అవగాహన పెంచుకుని తాము సైతం రక్తదానం అందించేందుకు అంగీకరించినట్లు తెలిపారు.

సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు అతి తక్కువ ధరలకు మందులు అందించే జనరిక్‌ మందుల దుకాణాలు, బ్లడ్‌ బ్యాంకులో బ్లడ్‌ గ్రూప్, క్రాస్‌ మ్యాచింగ్‌ విధానంపై అవగాహన కల్పించినట్లు తెలిపారు.

రెడ్‌ క్రాస్‌ చరిత్ర, బ్లడ్‌ డొనేషన్‌ క్యాంపుల్లో అందించాల్సిన సేవలు, 108, వృద్ధాశ్రమాలు, సోషల్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ వలంటరీ ప్రొగ్రాంలో భాగస్వామ్యం అందిస్తూ ప్రథమ చికిత్స అందించడంపై విద్యార్థులకు ఇంటర్న్‌షిప్‌లో నేర్పించినట్లు చెప్పారు. కార్యక్రమంలో వరంగల్‌ అర్బన్‌ జిల్లా రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ పి.విజయ్‌చందర్‌రెడ్డి, రాష్ట్ర పాలక వర్గ సభ్యులు ఈవీ.శ్రీనివాసరావు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement