నేరాలను గుర్తించేందుకు సెబీ వినూత్న వ్యూహాలు

9 Dec, 2019 01:19 IST|Sakshi

మ్యాట్రిమోనియల్‌ సైట్లో వివరాలతో ఓ ట్రేడరుపై నిషేధం

న్యూఢిల్లీ: స్టాక్‌ మార్కెట్లలో అవకతవకలకు పాల్పడే వారిని గుర్తించేందుకు మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ అన్ని మార్గాల్లో నుంచి సమాచారం సేకరిస్తోంది. తాజాగా ఫ్రంట్‌ రన్నింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న వైభవ్‌ ధడ్డా అనే ట్రేడరు ఆనుపానులను ఓ మ్యాట్రిమోనియల్‌ సైట్‌ ద్వారా గుర్తించింది. వైభవ్‌తో పాటు  అతని కుటుంబం క్యాపిటల్‌ మార్కెట్‌ లావాదేవీలు జరపకుండా నిషేధం విధించింది. వివరాల్లోకి వెడితే ఫిడిలిటీ గ్రూప్‌లో పనిచేస్తున్న వైభవ్‌కు.. కీలకమైన ఆర్డర్లకు సంబంధించి ముందస్తు సమాచారం ఉండేది.

దీని ఆధారంగా అతను, అతని తల్లి అల్కా, సోదరి ఆరుషి ట్రేడింగ్‌ చేసేవారు. వైభవ్‌కి సంబంధించిన ఇతర వివరాలను సేకరించే క్రమంలో జైన్‌శుభ్‌బంధన్‌డాట్‌కామ్‌లో పొందుపర్చిన సమాచారం ఆధారంగా ఈ ముగ్గురి మధ్య బంధుత్వాన్ని సెబీ గుర్తించింది. వీరు అక్రమంగా ఆర్జించిన రూ. 1.86 కోట్ల లాభాలను 15 రోజుల్లోగా ఎస్క్రో ఖాతాలో జమచేయాలంటూ ఆదేశించింది. నిధులను దారి మళ్లించకుండా వారి ఖాతాలను స్తంభింపచేసింది. కొన్నాళ్ల క్రితం దీప్‌ ఇండస్ట్రీస్‌ .. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంలో ఫేస్‌బుక్‌ అకౌంట్ల ఆధారంగా అనుమానితులను పట్టుకుంది సెబీ.

మరిన్ని వార్తలు