నగదు లేకుండా నడవగలమా?

2 Dec, 2016 04:00 IST|Sakshi
నగదు లేకుండా నడవగలమా?
‘ప్లాస్టిక్’ నాణేనికి రెండు వైపులా పదును
డిజిటల్ మనీతో నల్లధనానికి, అవినీతికి ముకుతాడు
ప్రభుత్వానికి ఆదాయం.. ఆర్థిక వ్యవస్థకూ లాభం
ఉగ్రవాద నిధులకూ, నకిలీ నోట్లకూ చరమగీతం 
కానీ.. సైబర్ నేరాలకు, హ్యాకింగ్ మోసాలకు నెలవు 
వ్యయంపై నియంత్రణ, వ్యక్తిగత గోప్యతకు చెల్లుచీటీ
కరెన్సీ వినియోగ సంస్కృతి ఉన్నఫళంగా మారుతుందా?
నిరక్షరాస్యత, పేదరికం అవరోధాలను అధిగమించేనా?

మనిషి శ్రమకు ప్రతిరూపం... నిత్య జీవనాధారం... భవిష్యత్తుకు భరోసా!  నాలుగు రాళ్లు సంపాదించినా.. ఖర్చు చేసినా.. దాచుకున్నా.. అంతా డబ్బు రూపంలోనే.. కరెన్సీ నోట్ల రూపంలోనే!  
భారతీయ సంస్కృతిలో వందల ఏళ్లుగా వస్తున్న అలవాటు ఇది.. నాణేనికి, నోటుకు లక్ష్మీదేవి ప్రతిరూపమని దేవత హోదా ఇచ్చిన సంస్కృతి ఇది!
ఇప్పుడా డబ్బు.. కరెన్సీ నోట్లు వాడటం మానేద్దాం అంటోంది ప్రభుత్వం! డబ్బును ఇళ్లలో, పెట్టెల్లో దాచుకోవద్దు అంటోంది. అంతా బ్యాంకుల్లోనే ఉంచేద్దామంటోంది. కంప్యూటర్ సంకేతాలుండే ప్లాస్టిక్ ముక్కతోనో.. మొబైల్ ఫోన్లలో అప్లికేషన్ ద్వారానో.. డిజిటల్ మనీగా ఖర్చు పెట్టుకునే అలవాటు చేసుకుందాం అంటోంది! ఇది మన దేశానికి.. మన ప్రజలకు.. మన ఆర్థిక వ్యవస్థకు మేలు చేస్తుందని, అభివృద్ధికి బాటలు పరుస్తుందని చెప్తోంది. అవినీతి, నల్లధనం వంటి రుగ్మతలకు ఇదే విరుగుడని అంటోంది! చాలా మంది ఆర్థికవేత్తలు, రాజకీయ నాయకులు, నిపుణులూ ఇదే మాట చెబుతున్నారు. మరోవైపు నగదు రహిత డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో చాలా లోటుపాట్లు ఉన్నాయనే వాదనలూ వినిపిస్తున్నాయి. 
 
వ్యక్తి తన శ్రమ ఫలాన్ని నగదు రూపంలో తన దగ్గర దాచుకోలేకపోవడం.. భౌతికంగా చేతిలో లేకపోవడం వల్ల ఖర్చుపై నియంత్రణ లేకపోవడం.. సైబర్ దాడుల ముప్పు వంటి ఎన్నో ప్రతికూలతలపై మరికొందరు ఆర్థికవేత్తలు, నిపుణులు అప్రమత్తం చేస్తున్నారు. ఈ లాభనష్టాల సంగతి ఎలా ఉన్నా భారతదేశం నగదు రహితంగా మారడానికి ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయన్న దానిపై మాత్రం అందరూ ఏకీభవిస్తున్నారు. దేశం చారిత్రకంగా, ఆర్థికంగా, సామాజికంగా ఒక పెను మార్పు వైపుగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. నగదు రహిత వ్యవస్థ లాభనష్టాలు, అందుకు గల అవరోధాలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనాలు..
 - సాక్షి నాలెడ్‌‌జ సెంటర్
 
ప్రస్తుతం దేశంలో 14.6 లక్షల స్వైపింగ్ మెషీన్లే ఉన్నాయి.
 
డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేయాలంటే స్వైపింగ్ మెషీన్లు ఉండాలి.
 
నగదురహిత లావాదేవీలను విస్తృతం చేయడానికి వచ్చే మూడునెలల్లో మరో 10 లక్షల స్వైపింగ్ మెషీన్లను దుకాణదారులకు అందించాలని బ్యాంకులను ప్రభుత్వం ఆదేశించింది. 
 
నోట్ల రద్దు కారణంగా గత 20 రోజుల్లో మొబైల్ వ్యాలెట్, ఈ-వ్యాలెట్ సంస్థల వ్యాపారం ఏకంగా నాలుగు రెట్లు పెరిగిపోరుుంది. ఇంకా పెరుగుతూనే ఉంది.
 
  16.7
 భారత్‌లో ఈ ఏడాది నవంబర్ నాటికి ఇంకా 16.7 కోట్ల మందికి అసలు బ్యాంకు ఖాతానే లేదని ఆర్బీఐ,  ప్రైస్  వాటర్ కూపర్ హౌస్‌ల నివేదికలు చెబుతున్నాయి. వీరందరినీ బ్యాంకు సేవల పరిధిలోకి తేవాల్సి ఉంటుంది.
 
19.5 కోట్ల ఖాతాలు పేరుకు మాత్రమే ఉన్నాయని, వీటిల్లో దీర్ఘకాలంగా ఎలాంటి లావాదేవీలు జరగడం లేదని వరల్డ్ బ్యాంక్ 2015లో వెల్లడించింది.
 
 68.84 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉంటే... వీరికి సేవలు అందించడానికి పనిచేస్తున్న బ్యాంకులు 38 శాతమే (భారత్లో బ్యాంకు శాఖల్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవి).
 
  31.16 శాతంగా ఉన్న పట్టణ ప్రజలకు సేవలందించడానికి బ్యాంకు శాఖల్లో 62 శాతం నగరాలు, పట్టణాల్లోనే ఉన్నారుు.
 
 నిరక్షరాస్యత.. ఇంగ్లిష్ లోపం
 దేశంలో నాలుగో వంతు మందికి పైగా నిరక్షరాస్యులే. మూడొంతుల మంది అక్షరాస్యులే అయినా.. అందులో సగం మందికిపైగా ఏదో ఒక భాషలోనే చదవడం, రాయడం తెలిసినవారు. ఇంగ్లిష్‌లో చదవగల, రాయగల వారి సంఖ్య పావు శాతం కూడా ఉండదు. ఇంగ్లిష్‌లో ఉండే ఆన్‌లైన్ వ్యవహారాలను ఎంత మంది చేయగలరనేది ప్రశ్నార్థకం.
 
 డిజిటల్, ఆన్‌లైన్ అక్షరాస్యత
 దేశంలో సగం మంది పాతికేళ్ల లోపు యువతే. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వారు ఇట్టే అందిపుచ్చుకోగలరు. కానీ వారికున్న ఆర్థిక స్వేచ్ఛ తక్కువ. అధికంగా ఆర్థిక లావాదేవీలు జరిపే వర్గాల వారిలో అత్యధికులకు డిజిటల్, ఆన్‌లైన్ అక్షరాస్యత లేదు. 
 
ఆన్‌లైన్ ఆర్థిక మోసాలు పెరిగిపోవడం, ఆ మోసాలు జరిగే తీరు తెన్నులు, తీసుకోవలసిన జాగ్రత్తలు అర్థంకాకపోవడం వల్ల చాలా మంది ప్లాస్టిక్, డిజిటల్ మనీని ఇష్టపడటం లేదు.
 
 బ్యాంకులు, ఏటీఎంల కొరత
 దేశ జనాభా సుమారు 134 కోట్లయితే.. బ్యాంకు శాఖలు 1.32 లక్షలు ఉన్నాయి. 68.84 శాతం జనాభా గ్రామీణ ప్రాంతాల్లో ఉండగా.. మొత్తం బ్యాంకుల్లో 38 శాతమే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నాయి. పట్టణ జనాభా 31.16 శాతం ఉంటే.. 62 శాతం బ్యాంకు శాఖలు వాటిల్లో కేంద్రీకృతమై ఉన్నాయి. అలాగే ఇంత మంది జనాభాకు 2.03 లక్షల ఏటీఎంలు మాత్రమే ఉన్నాయి.
 
 అసంఘటిత రంగంలో ఎలా?
 దేశంలో అతి పెద్ద ఉద్యోగ రంగం.. అసంఘటిత రంగం! ఈ రంగం దాదాపుగా నగదు ఆధారితంగానే నడుస్తుంది. వ్యవస్థ నుంచి భారీ మొత్తంలో నోట్లను ఉపసంహరించడం.. భరోసానివ్వగల లావాదేవీల వ్యవస్థలు లోపించడం కారణంగా.. గ్రామీణ ప్రాంతాలు, అసంఘటిత రంగాలు కష్టాలు ఎదుర్కోనున్నాయి.
 
 యజమానుల వ్యతిరేకత
 పనిచేసే వారిలో 90 శాతం మంది (దేశవార్షిక ఉత్పత్తిలో సగం వీరి నుంచే వస్తుంది) అసంఘటిత రంగంలోనే ఉన్నారు. కాంట్రాక్టు లేబర్‌తో చిన్న పరిశ్రమలు పని చేయించుకుంటాయి. వారికి చెల్లింపులన్నీ నగదు రూపంలో.. వోచర్ పేమెంట్ ద్వారా జరుగుతాయి. యాజమాన్యాలు వారికి బ్యాంకు ఖాతాలు తెరిచి జీతాలు చెల్లించడానికి ముందుకు రావు. ఎందుకంటే ఒకసారి ఖాతాలు తీసి కార్మికులుగా చూపితే.. చట్టబద్ధంగా వారికి ప్రయోజనాలన్నీ ఇవ్వాల్సి వస్తుంది.
 
 37.1 కోట్లు
భారత్‌లో మొబైల్‌ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య
 
2016 జూలై నాటికి భారత్‌లో ఇంటర్నెట్ వాడుతున్న వారి సంఖ్య 46 కోట్లు (సింహభాగం మొబైల్ ఇంటర్నెట్). ప్రపంచంలో ఇంటర్నెట్ వాడకందారులు ఎక్కువగా ఉన్న దేశాల్లో  చైనా తర్వాతి స్థానం మనదే. అమెరికాను కూడా దాటిపోయాం. దేశంలో జనాభాలో ఇంటర్నెట్ యాక్సెస్‌ఉన్న వారు 34.8 శాతం.
 
⇔  భారత్‌లో సెల్‌ఫోన్ కనెక్షన్ల సంఖ్య 103.32 కోట్లు.
 
స్మార్ట్ ఫోన్లు 22 కోట్లు
మొబైల్ వ్యాలెట్ల ద్వారా చెల్లింపులు చేయాలంటే స్మార్ట్ ఫోన్లు, కనెక్టివిటీ అవసరం. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లో నెట్ చార్జీలు అధికం. ఆండ్రాయిడ్ ఫోన్ కూడా పేదలకు భారమే. తక్కువ ధరకే ఆండ్రాయిడ్ ఫోన్లు ప్రజలకు అందుబాటులోకి తేవడంలో ప్రభుత్వం సాయపడటం, నెట్ చార్జీలు తగ్గించడం, పబ్లిక్ ప్లేస్‌లలో ఉచిత వైఫైని విరివిగా అందించడం... జనాన్ని మొబైల్ వ్యాలెట్ దిశగా ప్రోత్సహిస్తాయి. 
 
అనుకూలాంశమేమిటంటే... భారత్ జనాభాలో 50 శాతం మంది 25 ఏళ్ల లోపు వారే. వీరికి టెక్నాలజీపై పట్టు ఉంటుంది. మొబైల్ వ్యాలెట్లు ఉపయోగించడానికి, ఆన్‌లైన్ లావాదేవీలు చేయడానికి సంసిద్ధత చూపుతారు.
 
 ఖాతాలపై పేదల వ్యతిరేకత
 దేశంలో చాలా మంది పేదలు బ్యాంకు ఖాతాలతో అనుసంధానం అవడానికి నిరాకరిస్తున్నారు. వారు వేతనాన్ని  బ్యాంకుల ద్వారా తీసు కుంటే, అది రూ.60 వేలు దాటితే.. దారిద్య్రరేఖకు దిగువన గల పేదలుగా అందే సంక్షేమ పథకాలను కోల్పోతామనే భయమే కారణం.
 
 71.24 కోట్లు
 రిజర్వుబ్యాంకు ఈ ఏడాది ఆగస్టులో విడుదల చేసిన డేటా ప్రకారం దేశంలో అన్ని బ్యాంకులు కలిపి 71.24 కోట్ల డెబిట్ కార్డులు (ఒకటికి మించి డెబిట్ కార్డులు కలిగిన వారు చాలామంది ఉంటారు)  జారీచేశాయి. అయితే గ్రామీణ ప్రాంతాల్లో స్వైపింగ్ మెషిన్లు లేకపోవడం, నగదుతోనే కొనడానికి బాగా అలవాటుపడటం... కారణమేదైనా ప్లాస్టిక్ మనీతో కొనుగోళ్లు మాత్రం జరగడం లేదు. కొనుగోళ్లు తదితర ఖర్చుల కోసం డెబిట్ కార్డులను ఉపయోగించటానికి.. దేశంలో ఆ కార్డులున్న వారు కూడా పూర్తిగా అలవాటుపడలేదు.
 
డెబిట్ కార్డులను ఎలా ఉపయోగిస్తున్నారని చూస్తే విస్మయం చెందుతాం. డెబిట్ కార్డుల వాడకం... 85 % ఏటీఎంలలో నగదు ఉపసంహరణకే జరుగుతోంది.
 
 25 కోట్లు 
25 కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభించారు. 
20 కోట్ల రూపే డెబిట్ కార్డులు ఇచ్చారు.
 
94 %డెబిట్ కార్డుల ద్వారా జరిగే ఖర్చు కూడా స్వల్పమే. డెబిట్ కార్డుల ద్వారా బయటికి వెళ్లే డబ్బులో 94 శాతం నగదుగా జనం తీసుకుం టున్నారు. ఉదాహరణకు చెప్పాలంటే లక్ష రూపాయలు డెబిట్ కార్డు ద్వారా వాడితే అందులో 94 వేలు నగదు ఉపసంహరణే ఉంటోంది. మిగిలిన రూ.6 వేలే కొనుగోళ్లు, చెల్లింపులకు వాడుతున్నారన్న మాట.
 
 75 %
 2015లో భారతదేశంలో జరిగిన ఆర్థిక లావాదేవీల్లో 75 శాతం నగదు ఆధారిత లావాదేవీలేనని.. అదే సమయంలో అమెరికా, జపాన్, ఫ్రాన్‌‌స, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నగదు రూపంలో లావాదేవీలు 20-25 శాతంగా ఉందని గూగుల్‌ఇండియా, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ అధ్యయన నివేదిక చెప్తోంది. ఆ 75 శాతం నగదు లావాదేవీల్లో మూడింట రెండు వంతులు నగదు రహితంగా మారడం ఇప్పటికిప్పుడు సాధ్యమేనా?   1,50,000  దేశంలో కంప్యూటర్లతో పనిచేసే పోస్టాఫీసులు లక్షా యాభై వేల పైచిలుకు ఉన్నాయి. వీటిల్లో నగదు లావాదేవీలు జరపొచ్చు.
>
మరిన్ని వార్తలు