అధిక ధర రావాలంటే?

8 Dec, 2018 02:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మనం కొన్న స్థలానికి లేదా ఇంటికి భవిష్యత్తులో మంచి ధర రావాలంటే? అభివృద్ధి చెందడానికి ఆస్కారమున్న ప్రాంతాన్ని.. పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు వంటి సౌకర్యాలకు చేరువలో ప్రాపర్టీ ఉండేలా చూసుకోవాలి. సొంతింటి విషయానికొస్తే మనకేం కావాలనే విషయంపై స్పష్టమైన అవగాహన ఉండాలి. చూడటానికి ఇల్లు ఎలా ఉంది? అందులోని సదుపాయాలు, చుట్టుపక్కల ప్రాంతం మౌలిక వసతులు ఉన్నంత మాత్రానే మంచి ఇల్లు అని అనుకోలేం. వీటితో పాటూ మరికొన్ని అంశాల్ని పరిశీలించాల్సి ఉంటుంది. 

ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా ఆధారపడుతుంది. ప్రస్తుతం నివసించడానికి సౌకర్యా లన్నీ ఉన్నాయా? ఒకవేళ భవిష్యత్తులో అమ్మితే మంచి ధర వస్తుందా? ఈ రెండు అంశాలు ముఖ్యం. ఉదాహరణకు చేరువలో షాపింగ్‌ మాల్‌ లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూల్, ఆసుపత్రి, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేవా అనేవి చూడాలి. చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూల్‌ అవసరముండకపోవచ్చు. కాకపోతే ఇల్లు అమ్మాలనుకున్నప్పుడు మాత్రం ఇదే అంశం కీలకమని గుర్తుంచుకోండి. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్‌ సదుపాయాలు వంటివి కూడా ప్రధానమైనవే. 

పెరిగేది ఎప్పుడు? 
ఇళ్లు, స్థలాల రేట్లు ఒకే విధంగా పెరగవు. మనం స్థలం కొన్న ప్రాంతంలో మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందితే ఫ్లాట్ల రేట్లు పెరుగుతాయని గుర్తుంచుకోండి. వీటితో పాటు నివసించడానికి కావాల్సిన సౌకర్యాలు పెరిగితేనే ఆయా ప్రాంతంలో ఇళ్ల ధరలు రెట్టింపవుతాయి. ఆరంభంలోనే మంచి ప్రాంతాన్ని ఎంచుకుంటే అక్కడ అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంటే గనక.. ఇంటి విలువకు రెండు, మూడేళ్లకే రెక్కలొస్తాయి. అక్కడి అభివృద్ధి చూసి చాలా మంది ఇళ్లను కొనడానికి అవకాశముండటమే ఇందుకు ప్రధాన కారణం. అయితే ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాలను కూడా పరిగణలోకి తీసుకోవాలి. కారు లేదా బైక్‌ ఉన్నప్పటికీ ప్రజా రవాణా వ్యవస్థ అవసరమం ఉండకపోవచ్చు. ఈ–మెయిల్స్, కొరియర్ల యుగంలో పోస్టాఫీసు అనవసరం కావచ్చు. కానీ, ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. చేరువలో షాపింగ్‌ మాల్‌ ఉందనుకోండి.. వారాంతంలో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తి చూపకపోవచ్చు. 

మరిన్ని వార్తలు