101 కోల్డ్‌ చెయిన్‌ ప్రాజెక్టులకు ఓకే..

28 Mar, 2017 01:30 IST|Sakshi
101 కోల్డ్‌ చెయిన్‌ ప్రాజెక్టులకు ఓకే..

కేంద్ర ప్రభుత్వం ఆమోదం
రూ. 3,100 కోట్ల పెట్టుబడులు
లిస్టులో తిరుమల మిల్క్, అమూల్‌ తదితర సంస్థల ప్రాజెక్టులు


న్యూఢిల్లీ: కూరగాయలు, పండ్ల వృథాను అరికట్టే లక్ష్యంతో కేంద్రం కొత్తగా 101 కోల్డ్‌ చెయిన్‌ ప్రాజెక్టులకు ఆమోద ముద్ర వేసింది. సుమారు రూ. 3,100 కోట్ల పెట్టుబడులతో అమూల్, హల్దీరామ్, బిగ్‌ బాస్కెట్, తిరుమల మిల్క్‌ తదితర సంస్థలు వీటిని ఏర్పాటు చేయనున్నాయి. ఈ ప్రాజెక్టులకు సంబంధించి తమ శాఖ రూ. 838 కోట్లు గ్రాంట్‌ కింద ఇస్తుందని, మిగతా రూ. 2,200 కోట్లు ప్రైవేట్‌ రంగం నుంచి వస్తాయని కేంద్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి హర్‌సిమ్రత్‌ కౌర్‌ బాదల్‌ సోమవారం తెలిపారు. 

101 కొత్త కోల్డ్‌ చెయిన్‌ ప్రాజెక్టుల సామర్థ్యం 2.76 లక్షల టన్నులుగా ఉంటుందని ఆమె వివరించారు.  హట్సన్‌ ఆగ్రో, స్టెర్లింగ్‌ ఆగ్రో, ప్రభాత్‌ డైరీ, బామర్‌ లారీ, దేశాయ్‌ బ్రదర్స్, ఫాల్కన్‌ మెరీన్‌ (ఒరిస్సా) మొదలైన సంస్థల ప్రాజెక్టులు కూడా లిస్టులో ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే మహారాష్ట్రలో అత్యధికంగా 21 ప్రాజెక్టులు, ఉత్తరప్రదేశ్‌ 14, గుజరాత్‌ 12, ఆంధ్రప్రదేశ్‌ 8, పంజాబ్‌..మధ్యప్రదేశ్‌లలో చెరి ఆరు ప్రాజెక్టులు రానున్నాయి. 53 ప్రాజెక్టులు కూరగాయలు.. పండ్లవి కాగా, డెయిరీలో 33, మాంసం.. పౌల్ట్రీ.. మెరీన్‌ విభాగాల్లో 15 ప్రాజెక్టులు ఉండనున్నాయి.

2.6 లక్షల మంది రైతులకు ప్రయోజనకరం..
సుమారు 2.6 లక్షల రైతులకు వీటివల్ల ప్రయోజనం చేకూరనుందని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా 60,000 మందికి ఇవి ఉపాధి కల్పించగలవని బాదల్‌ పేర్కొన్నారు. వీటిలో సుమారు రూ. 12,000 కోట్ల విలువ చేసే 4.7 మిలియన్‌ టన్నుల అగ్రి, హార్టికల్చర్‌ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ జరుగుతుందని, 13 శాతం మేర వృథాను అరికట్టవచ్చని మంత్రి తెలిపారు. ఇప్పటిదాకా ఆమోదించిన కోల్డ్‌ చెయిన్స్‌ సంఖ్య 234కి చేరిందని, కొత్తగా మరో 50 ప్రాజెక్టులు కూడా మంజూరు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని వివరించారు.  2014 టోకు ధరల ప్రాతిపదికన చూస్తే దాదాపు రూ. 92,000 కోట్ల విలువ చేసే పండ్లు, కూరగాయలు వృ«థా అవుతున్నట్లు బాదల్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు