3 నుంచి బీఎస్‌ఎన్‌ఎల్‌  ఉద్యోగుల నిరవధిక సమ్మె 

29 Nov, 2018 01:01 IST|Sakshi

   జియోపై ప్రభుత్వం పక్షపాతం చూపిస్తోందని ఆరోపణ 

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ టెలికం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్‌ ఉద్యోగులు డిసెంబర్‌ 3 నుంచి నిరవధిక సమ్మెకు దిగనున్నారు. కొత్త టెల్కో రిలయన్స్‌ జియోపై ప్రభుత్వం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందన్న ఆరోపణలే ఇందుకు కారణం. టెలికం సేవల్లో జియోతో పోటీపడకుండా చేసేలా బీఎస్‌ఎన్‌ఎల్‌కు కేంద్రం 4జీ స్పెక్ట్రం కేటాయించలేదని ఉద్యోగ సంఘాలు ఆరోపించాయి. ‘ప్రస్తుతం మొత్తం టెలికం రంగం అంతా కూడా సంక్షోభంలో ఉంది. ఇదంతా కూడా ముకేశ్‌ అంబానీ సారథ్యంలోని రిలయన్స్‌ జియో కారుచౌక చార్జీలతో మిగతా సంస్థలను దెబ్బతీయడం వల్లే జరుగుతోంది. ప్రభుత్వ రంగ బీఎస్‌ఎన్‌ఎల్‌ సహా ఇతర పోటీ సంస్థలన్నింటినీ నామరూపాల్లేకుండా చేయాలన్నదే జియో వ్యూహం. ఆ తర్వాత నుంచి కాల్, డేటా చార్జీలను ఎకాయెకిన పెంచేస్తూ ప్రజలను లూటీ చేయబోతోంది.

ఇలాంటి రిలయన్స్‌ జియోకి నరేంద్ర మోదీ ప్రభుత్వం బాహాటంగా మద్దతునిస్తుండటం ఆందోళనకరం’ అని బీఎస్‌ఎన్‌ఎల్‌ యూనియన్లు(ఏయూఏబీ) ఒక సంయుక్త ప్రకటనలో ఆరోపించాయి. 4జీ సేవలు ప్రారంభించేందుకు అవసరమైన స్పెక్ట్రంను తక్షణం కేటాయించడం, 2017 జనవరి 1 నుంచి వర్తించేలా ఉద్యోగుల జీతాలు, రిటైరీల పెన్షన్‌ సవరణ తదితర అంశాలను డిమాండ్‌ చేస్తున్నట్లు వివరించాయి. పోటీ సంస్థలను దెబ్బతీసేందుకు భారీగా అర్థబలం ఉన్న రిలయన్స్‌ జియో .. వ్యయాల కన్నా తక్కువ రేట్లతో సేవలు అందిస్తోందన్నాయి. దీంతో ఎయిర్‌సెల్, టాటా టెలీ, రిలయన్స్‌ కమ్యూనికేషన్స్, టెలినార్‌ వంటి సంస్థలు మొబైల్‌ సర్వీసుల నుంచి తప్పుకున్నాయని పేర్కొన్నాయి. 

మరిన్ని వార్తలు