తయారీపై ప్రభుత్వానివన్నీ పైపై మాటలే!

25 Feb, 2016 00:57 IST|Sakshi
తయారీపై ప్రభుత్వానివన్నీ పైపై మాటలే!

బయోకాన్ చీఫ్ కిరణ్ మజుందార్ షా
హైదరాబాద్: తయారీ రంగానికి ఊతమిచ్చే విషయంలో ప్రభుత్వం చెప్పేవన్నీ పైపై మాటలుగానే ఉంటున్నాయని బయోకాన్ సంస్థ చీఫ్ కిరణ్ మజుందార్ షా వ్యాఖ్యానించారు. భారత్‌లో సులభతరంగా వ్యాపారాలు నిర్వహించుకునేలా పరిస్థితులు ఇప్పటికీ మెరుగుపడలేదని, విధానాల్లో స్థిరత్వమూ లేదని ఆమె పేర్కొన్నారు. ‘మేకిన్ ఇండియా అని ఊదరగొట్టడం మినహా తయారీ రంగంలో ఉద్యోగాలు కల్పించేలా విధానాలేమీ లేవు.  ప్రభుత్వం ఎంతసేపూ సేవల రంగంపైనే దృష్టి పెడుతోంది.. తయారీ రంగం విషయంలో మాత్రం పైపై మాటలే చెబుతోంది. తయారీ రంగం మీద సీరియస్‌గానే ఉన్న పక్షంలో ప్రభుత్వం నిఖార్సుగా ఏదో ఒకటి చేసి చూపించాలి’ అని మజుందార్ షా చెప్పారు. ప్రభుత్వం ప్రధానంగా వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు కల్పించడంపైనా, విధానాల్లో అస్పష్టత లేకుండా స్థిరత్వం ఉండేలా చూడటంపైనా దృష్టి సారించాలన్నది తన అభిప్రాయమని వివరించారు. రాబోయే బడ్జెట్‌లో సామాజిక-ఆర్థిక అభివృద్ధి, విద్య.. వైద్యం.. ఉపాధి కల్పన.. ఇన్‌ఫ్రా తదితర రంగాలపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టాలని మజుందార్ షా చెప్పారు.

>
మరిన్ని వార్తలు