సాధారణ బీమా ప్రీమియం ప్రియం

27 Mar, 2017 01:13 IST|Sakshi
సాధారణ బీమా ప్రీమియం ప్రియం

ఏప్రిల్‌ 1నుంచి అమల్లోకి...
న్యూఢిల్లీ: మోటారు సైకిళ్లు, కార్లు, ఆరోగ్య బీమా పాలసీల ప్రీమియం ధరలు ఏప్రిల్‌ 1 నుంచి భారం కానున్నాయి. ఏజెంట్లకు చెల్లించే కమిషన్లలో సవరణలు చేసేందుకు, వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించేందుకు బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ అనుమతించింది. దీంతో పాలసీ ప్రీమియంలను బీమా కంపెనీలు సవరించనున్నాయి. అయితే, దీని కారణంగా ప్రీమియంల పెంపు 5 శాతం మించకుండా ఐఆర్‌డీఏఐ పరిమితి విధించింది. థర్డ్‌ పార్టీ కవరేజీ రేట్ల పెంపునకు ఇది అదనం. ఏప్రిల్‌ 1 నుంచి వాహన బీమా థర్డ్‌పార్టీ ప్రీమియం రేట్లను 50 శాతం పెంచేందుకు ఐఆర్‌డీఏఐ ఇప్పటికే పచ్చజెండా ఊపింది. ఈ రెండు రకాల పెంపులతో వినియోగదారులపై భారం పడనుంది.

1 నుంచి దేశవ్యాప్తంగా లారీల నిరవధిక సమ్మె
కోల్‌కతా: వాహనాల థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్‌ ప్రీమియంతో పాటు ఇతర చార్జీల పెంపునకు నిరసనగా దేశవ్యాప్తంగా ఏప్రిల్‌ 1నుంచి  నిరవధిక సమ్మెకు దిగుతామని అఖిల భారత రవాణా వాహనాల యాజమానుల సమాఖ్య(ఏఐసీజీవీఓఏ) కేంద్రాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఏఐసీజీవీఓఏ కార్యవర్గ సభ్యుడు సుభాష్‌ చంద్ర ఆదివారం మీడియాకు తెలిపారు. థర్డ్‌ పార్టీ ప్రీమియం 50 శాతం పెంపుతో పాటు ఇతర చార్జీల పెరుగుదల లారీలకు గుదిబండగా మారిందన్నారు. పాలు, ఇతర అత్యవసర వస్తువులు మినహా మిగతా అన్ని రంగాలకు సమ్మె వర్తిస్తుందన్నారు. దీనిపై కేంద్ర మంత్రులతో పాటు అన్ని ప్రభుత్వ శాఖలకు సమాచారం అందించినట్లు సుభాష్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు