సిమెంటు పరిశ్రమ 8% వృద్ధి

12 May, 2017 00:03 IST|Sakshi
సిమెంటు పరిశ్రమ 8% వృద్ధి

ఏపీ, తెలంగాణల్లో డిమాండ్‌ పెరుగుతోంది
► సీఎంఏ అడ్వైజర్‌ హండూ వెల్లడి  

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: సిమెంటు పరిశ్రమ ఈ ఏడాది 7–8 శాతం వృద్ధి నమోదు చేస్తుందని సిమెంట్‌ మాన్యుఫాక్చరర్స్‌ అసోసియేషన్‌ (సీఎంఏ) అంచనా వేస్తోంది. దేశంలో 2016–17లో 300 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి జరిగింది. ప్లాంట్ల సామర్థ్యం 425 మిలియన్‌ టన్నులు ఉందని సీఎంఏ టెక్నికల్‌ అడ్వైజర్‌ సురిందర్‌ కె హండూ తెలిపారు. గురువారమిక్కడ సీఐఐ ఆధ్వర్యంలో ప్రారంభమైన సిమెంటెక్‌ సదస్సులో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రపంచ సగటు వినియోగం 570 కిలోలుంటే, దేశంలో ఇది కేవలం 218 కిలోలకే పరిమితమైందని గుర్తు చేశారు.

ప్రభుత్వ ప్రాజెక్టులతో సిమెంటు పరిశ్రమకు మంచి భవిష్యత్‌ ఉందని తెలిపారు. ప్రస్తుతం సిమెంటు ప్లాంట్ల నుంచి 300 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి అవుతోందని చెప్పారు. 800 మెగావాట్లు ఉత్పత్తి చేయగలిగే అవకాశం ఉందని, ఇందుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని కోరారు. నిర్మాణాలు పెరగనున్నందున తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది సిమెంటు డిమాండ్‌ గతం కంటే అధికంగా ఉంటుందని ఏసీసీ సిమెంట్‌ ఎనర్జీ విభాగం డైరెక్టర్‌ కె.ఎన్‌.రావు తెలిపారు. సిమెంటు ప్లాంట్లలో బొగ్గుకు ప్రత్యామ్నాయంగా చెత్తను వినియోగించడం పెరిగిందని చెప్పారు. 2010లో ఈ వినియోగం 0.6 శాతం ఉండగా,  ప్రస్తుతం 4 శాతానికి చేరిందన్నారు. దీనిని 25 శాతానికి చేర్చాలని పరిశ్రమ లక్ష్యంగా చేసుకుందని అన్నారు. తయారీ వ్యయంలో ఇంధనానికి 50 శాతం ఖర్చు అవుతోందని చెప్పారు. 200 ప్లాంట్లలో 25 కంపెనీలే చెత్తను ఇంధనంగా వాడుతున్నాయని వివరించారు.

మరిన్ని వార్తలు