ప్రభుత్వ పథకాలకు ఒక్క క్లిక్‌ చాలు!

15 Feb, 2017 01:23 IST|Sakshi
ప్రభుత్వ పథకాలకు ఒక్క క్లిక్‌ చాలు!

సోషల్‌ స్టార్టప్స్‌’ వేదికపై కేంద్ర, రాష్ట్రాల పథకాలు
ప్రైవేటు సంస్థల స్కాలర్‌షిప్‌లు, శిక్షణ వివరాలు కూడా
దరఖాస్తు చేయటం నుంచి లబ్ధి పొందేదాకా సేవలు
గ్రామీణులు. రైతులు, వికలాంగులు, స్థానిక వర్తకులకు మేలు


హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో
మనకొచ్చిన స్కోరును బట్టి కాలేజీలోనో, యూనివర్సిటీలోనో సీటొస్తుందో.. రాదో తెలిసిపోతుంది. మరి మన వివరాలన్నీ ఇస్తే ప్రభుత్వ పథకాలకు మనం అర్హులమో, కాదో తెలియదెందుకు...?

అయినా ప్రభుత్వ పథకాలేం ఉన్నాయి? వాటి వివరాలేంటి? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? చేసినా మనకు అందుతుందా? ఇవన్నీ తెలుసుకోవటం కూడా అంత ఈజీ కాదు మరి!!.

ఇదిగో... ఈ కష్టాలకు చెక్‌ చెబుతూ దీన్నే వ్యాపారంగా మార్చుకుంటున్నాయి కొన్ని సోషల్‌ స్టార్టప్‌లు. ప్రభుత్వ పథకాలకు, ప్రజలకు మధ్య వారధిలా పనిచేస్తున్నాయి. ఇవి ఒకవైపు పథకాలు, పాలసీలు, రాయితీల వివరాలను అందిస్తూనే మరోవైపు వాటి దరఖాస్తు ప్రక్రియ, విశ్లేషణ వంటి కన్సల్టింగ్‌ సేవలను అందిస్తూ ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నాయి. దీంతో సామాన్యులకు పథకాలు అందడంతో పాటూ దళారులు, మధ్యవర్తుల లంచాలకూ చెక్‌ పెట్టినట్లు అవుతోందన్నది ‘ది ఇండియన్‌ ఐరిస్‌’ కో–ఫౌండర్‌ సాహిత్య సింధు మాట. దరఖాస్తు చేసుకున్న వారు కచ్చితంగా లబ్ధిపొందుతారన్నది ఈ సంస్థలు చెప్పేమాట. గ్రామీ ణ, పట్టణవాసులకు, రైతులు, చిన్న వ్యాపారస్తులకు, వికలాంగులకు వీటి సేవలు ఎంతో ఉపయుక్తంగా ఉంటున్నాయి కూడా.

వివరాలందిస్తే చాలు చెప్పేస్తాయి..
సోషల్‌ స్టార్టప్స్‌లో వ్యక్తిగత, కుటుంబ, పారిశ్రామిక.. ఇలా 3 రకాలైన పథకాల వివరాలుంటాయి. వ్యక్తిగత వివరాలందిస్తే చాలు... ఏ పథకానికి అర్హులమో చెప్పేస్తాయి. కేవలం వివరాలే కాకుండా ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఎప్పుడు చేసుకోవాలి? వంటి సేవలన్నీ అందిస్తాయి. విద్యా, వైద్యం, వ్యవసాయం, గ్రామీణ, పట్టణాభివృద్ధి, కార్మిక, క్రీడా, పారిశ్రామికం వంటి అన్ని రంగాల్లోని పథకాల వివరాలూ ఉంటాయి. ఆయా మంత్రిత్వ శాఖల నోటిఫికేషన్లు, వార్తలు కూడా అందిస్తాయి.

ఫెయిర్‌ అండ్‌ లవ్లీ, గూగుల్‌ స్కాలర్‌షిప్స్, మైక్రోసాఫ్ట్‌ ట్రైనింగ్‌ వంటి కార్పొరేట్‌ సంస్థల పథకాలూ ఉంటాయి. బ్యాంకులు, ఎన్‌జీవోలు, డబ్ల్యూటీఓ, డబ్ల్యూహెచ్‌ఓ వంటి సంస్థలకు సంబంధించిన స్కీంలూ ఉంటాయి. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలు (ఎంఎస్‌ఎంఈ), స్టార్టప్స్, విద్యా రుణాలు, స్కాలర్‌షిప్స్, గ్రాంట్లు, శిక్షణ శిబిరాలు, బ్యాంక్‌ ఖాతాలు, ఆధార్‌ వంటి గుర్తింపు కార్డుల సమాచారమంతా తెలుసుకోవచ్చు. దరఖాస్తు కూడా చేసుకోవచ్చు.

స్థానిక భాషలో పథకాల వివరాలు..
దేశంలో ఇప్పటివరకు కేంద్రంతో పాటు, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల పథకాలు, పాలసీ గురించి ఒకే వేదికపై తెలుసుకునే వీలులేదు. కానీ, ఈ సోషల్‌ స్టార్టప్స్‌ వచ్చాక ఆ లోటు తీరిపోయింది. అది కూడా ఆయా స్థానిక భాషల్లో. దీంతో స్థానికులకు ఆయా పథకాల గురించి సులువుగా అర్థం కావటమే కాక దరఖాస్తు చేసుకునే వీలూ కలుగుతోంది. నిజానికిక్కడ ఓ సందేహం రావచ్చు. ఈ సోషల్‌ స్టార్టప్స్‌లో ఆయా పథకాల గురించి తెలుసుకోవాలంటే ఇంటర్నెట్‌ ఉండాలి కదా అని? దీనికి పరిష్కారం చూపించేందుకు సోషల్‌ స్టార్టప్స్‌ అవగాహన యాత్రలు చేస్తున్నాయి. అంటే స్థానిక ప్రభుత్వం, ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో ఆయా రాష్ట్రంలో పర్యటించి పథకాల గురించి స్థానికులకు వివరిస్తున్నాయి. ఇటీవలే బైకర్స్‌ క్లబ్‌తో కలిసి రాజస్తాన్‌లో పర్యటించామని.. ఇప్పుడు తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్‌ రాష్ట్రాల్లో పర్యటించాలని నిర్ణయించుకున్నామని సింధు తెలియజేశారు. పర్యటనకు అవసరమైన ఖర్చుల నిమిత్తం స్థానిక ప్రభుత్వాలు, కొన్ని ప్రైవేట్‌ సంస్థలతో చర్చిస్తున్నామన్నారు.

కమీషన్‌ రూపంలో ఆదాయం..
ప్రభుత్వ, ప్రైవేట్‌ పథకాలను ప్రచారం చేయడం వల్ల సోషల్‌ స్టార్టప్స్‌కు ఎలాంటి ఆదాయం రాదు. కన్సల్టింగ్‌ సేవలతో ఇవి ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. అంటే ఆయా పథకాలకు లబ్ధిదారులను ఎంపిక చేయడం, వారి దరఖాస్తులను నింపడం, పంపించడం, వాటిని ఫాలో చేయడం, ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌లను తయారు చేయడం వంటి సేవలందిస్తూ కస్టమర్‌ నుంచి కొంత మొత్తాన్ని వసూలు చేస్తాయి. ఇలా గత 5 నెలల్లో బీటుసీ విభాగంలో రూ.4 లక్షలకు పైగా, బీటుబీ విభాగంలో రూ.50 లక్షలకు పైగా ఆదాయాన్ని ఆర్జించామని హక్‌దర్షక్‌ వ్యవస్థాపకుడు ఆనంద్‌ తెలిపారు. ప్రస్తుతానికైతే ఇండియన్‌ ఐరిస్‌ ఈ సేవలను ఉచితంగానే అందిస్తోందని, ఇటీవలే ఉత్తరాఖండ్‌లోని ఐఐటీ రూర్కీ, ఒకరిద్దరు ఏంజిల్‌ ఇన్వెస్టర్ల నుంచి రూ.కోటి నిధులను సమీకరించామని ఇండియన్‌ ఐరిస్‌ కో–ఫౌండర్‌ నారాయణ్‌ సింగ్‌ రావ్‌ తెలిపారు.

>
మరిన్ని వార్తలు