కర్నూలులో పైలట్ల శిక్షణ కేంద్రం | Sakshi
Sakshi News home page

కర్నూలులో పైలట్ల శిక్షణ కేంద్రం

Published Fri, Jan 19 2024 1:12 AM

Kurnool Airport to begins Pilot Training - Sakshi

కర్నూలు విమానాశ్రయంలో పైలట్ల శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో.. ఇప్పటికే అయిదారు సంస్థలు ఆసక్తి కనబరిచాయని ఏపీ ప్రభుత్వ ఏవియేషన్‌ సలహాదారు, ఏపీ ఎయిర్‌పోర్ట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ వి.ఎన్‌.భరత్‌ రెడ్డి సాక్షి బిజినెస్‌ బ్యూరోకు తెలిపారు.  టెండర్లకు జనవరి 31 వరకు గడువు ఉందని ఆయన పేర్కొన్నారు. ఇది కార్యరూపం దాలిస్తే ఏటా 40–50 మంది శిక్షణ తీసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు.

గడువు కంటే ఆరు నెలల ముందే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. 2025 మే నాటికి ఇది సిద్ధం అవుతుందని వెల్లడించారు. తొలి దశలో ఏటా 60 లక్షల మంది, తుది దశ పూర్తి అయ్యే నాటికి ఏటా 4 కోట్ల మంది ప్రయాణికులకు సేవలు అందించేలా విమానాశ్రయాన్ని నిరి్మస్తున్నట్టు వివరించారు. భోగాపురం విమానాశ్రయాన్ని పీపీపీ విధానంలో జీఎంఆర్‌ నిరి్మస్తోంది. 2,200ల ఎకరాలకుపైగా విస్తీర్ణంలో సుమారు రూ.5,000 కోట్లు వ్యయం అవుతోందని భరత్‌ రెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఎయిర్‌పోర్టులను అనుసంధానిస్తూ కొత్త రూట్లలో సర్వీసులను అందించాల్సిందిగా కోరుతూ పలు విమానయాన సంస్థలతో ఇటీవల చర్చలు జరిపామని చెప్పారు.

Advertisement
Advertisement