చిద్దూ షి 'కారు '

18 Feb, 2014 02:21 IST|Sakshi
చిద్దూ షి 'కారు '

ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో చిదంబరం వాహన మంత్రం
  అన్ని వాహనాలపై ఎక్సైజ్ సుంకాల తగ్గింపు
  ఆడి రూ. 3.82 లక్షల దాకా; మెర్సిడెస్   
      బెంజ్ రూ. 2 లక్షల వరకూ రేట్ల కట్
  తగ్గించనున్నట్లు ప్రకటించిన మహీంద్రా,
       టాటా మోటార్స్, జీఎం, నిస్సాన్
  ఇదే బాటలో మరిన్ని ఇతర కంపెనీలు...
 
   సియామ్ గణాంకాల ప్రకారం 2013లో దేశీ కార్ల అమ్మకాలు 9.59% క్షీణించి 18,07,011కు పరిమితమయ్యాయి. 2012లో అమ్మకాల సంఖ్య 19,98,703.
 
   11 ఏళ్లలో తొలిసారిగా వార్షిక కార్ల విక్రయాలు తిరోగమనంలోకి జారడం పరిశ్రమ ఎదుర్కొంటున్న తీవ్ర ఇక్కట్లకు నిదర్శనం.
 
    ఈ ఏడాది జనవరిలోనూ(వరుసగా నాలుగో నెల) కార్ల అమ్మకాలు రివర్స్‌గేర్‌లోనే కొనసాగాయి. గతేడాది జనవరితో పోలిస్తే 7.59% క్షీణించి 1,60,289కి తగ్గాయి.
 
 అమ్మకాలు ఘోరంగా పడిపోయి... కష్టాల్లో ఉన్న ఆటోమొబైల్ రంగానికి ఆర్థిక మంత్రి చిదంబరం కాస్త ఊరట కల్పించారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించడం ద్వారా వాహన కంపెనీలకు చేయూతచ్చే చర్యలను ప్రకటించారు. దీంతో కార్లు, బైక్‌లు, స్కూటర్లతో పాటు వాణిజ్య వాహనాల ధరలు కూడా కొంత దిగిరానున్నాయి.  ఆడి, మెర్సిడెస్ బెంజ్ కంపెనీలు రేట్ల తగ్గింపులో బోణీ చేశాయి. టాటా మోటార్స్, జనరల్ మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా సైతం తమ వాహనాల రేట్లను తగ్గించనున్నట్లు ప్రకటించాయి. నిస్సాన్...  తమ కార్లపై 4-6 శాతం మేర ధరలు తగ్గించేందుకు ఆస్కారం ఉందని పేర్కొంది. టయోటా, సూపర్‌బైక్ తయారీ సంస్థ డీఎస్‌కే హ్యోసంగ్‌లు ధరల తగ్గింపు సంకేతాలిచ్చాయి.
 
 న్యూఢిల్లీ: మధ్యంతర బడ్జెట్‌లో చిదంబరం వాహన పరిశ్రమకు అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆటోమొబైల్ రంగంలోని అన్నిరకాల విభాగాలకు సంబంధించి ఎక్సైజ్ సుంకాలను తగ్గించడం పట్ల వాహన కంపెనీలు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రయోజనాన్ని కచ్చితంగా తమ కస్టమర్లకు బదలాయిస్తామని టాటా మోటార్స్ ప్రతినిధి పేర్కొన్నారు. రేపటి నుంచి జరిగే కొత్త డిస్పాచెస్(పంపిణీ)కు దీన్ని వర్తింపజేస్తామన్నారు. అయితే, ఎంతమేరకు రేట్లు తగ్గించాలనేదానిపై కసరత్తు చేస్తున్నట్లు ఆమె వెల్లడించారు. జనరల్ మోటార్స్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ పి.బాలేంద్రన్ మాట్లాడుతూ... సుంకాల తగ్గింపు ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు అందిస్తామని, ఏ వాహనాలపై ఎంతెంత మేరకు రేట్లను తగ్గించాలనేది పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా, చిదంబరం సుంకాల తగ్గిం పు చర్యలు ఈ ఏడాది జూన్ 20 వరకూ వర్తిస్తాయి. ఎన్నికల తర్వాత వచ్చే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌లో మార్పుచేర్పులకు అవకాశం ఉంటుంది.
 
 సెంటిమెంట్ మెరుగవుతుంది...
 ఎక్సైజ్ సుంకం తగ్గింపు ప్రకటన ప్రస్తుత పరిస్థితుల్లో అత్యవసరమైన చర్యగా దేశీ కార్ల దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా ఎండీ, సీఈఓ కె.అయుకవా వ్యాఖ్యానించారు. పరిశ్రమలో సెంటిమెంట్‌ను పెంపొందించడమే కాకుండా.. వాహనాల కొనుగోళ్లకు వినియోగదారులను ప్రోత్సహించేలా ఈ చర్యలు దోహదం చేస్తాయని చెప్పారు. భారతీయ వాహన తయారీదార్ల సంఘం(సియామ్) ప్రెసిడెంట్ విక్రమ్ కిర్లోస్కర్ మాట్లాడుతూ.. సుంకం తగ్గింపు వల్ల వాహనాల రేట్లు దిగొస్తాయని, డిమాండ్ తిరిగి పుంజుకుంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. మొత్తంమీద తయారీ రంగం పునరుత్తేజానికి ఈ చర్యలు దోహదం చేస్తాయని అభిప్రాయపడ్డారు. మధ్యంతర బడ్జెట్ వాహన రంగానికి సానుకూలంగా ఉందని... సుంకాల తగ్గింపుతో డిమాండ్ పెరిగి, అమ్మకాలు మళ్లీ పుంజుకుంటాయని హోండా కార్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ జ్ఞానేశ్వర్ సేన్ పేర్కొన్నారు.
 
 
 ఆడి... భారీ తగ్గింపు
 జర్మనీ లగ్జరీ కార్ల దిగ్గజం ఆడి భారత్‌లో అమ్ముతున్న ఐదు ప్రధాన మోడళ్లపై రూ.3.82 లక్షల వరకూ ధరలను తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ఎస్‌యూవీలో టాప్‌ఎండ్ వెర్షన్ క్యూ7 ధరను 3.82 లక్షలు తగ్గి రూ.78.28 లక్షలకు లభిస్తుందని ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక ఇందులోనే బేస్ వెర్షన్ ధర రూ.61.19 లక్షల నుంచి రూ.58.34 లక్షలకు(రూ.2.84 లక్షలు కట్) తగ్గనుంది. ఎస్‌యూవీ క్యూ5 రేటు రూ.47.95 లక్షల నుంచి రూ.45.72 లక్షలకు(రూ.2.22 లక్షల తగ్గింపు) దిగిరానుంది. లగ్జరీ సెడాన్ ఏ4 ధర రూ.72,000 తగ్గి... రూ.30.58 లక్షల నుంచి రూ.29.85 లక్షలకు చేరనుంది. ఇందులోనే టాప్‌ఎండ్ వేరియంట్ రేటు రూ.90 వేలు తగ్గనుంది. రూ.37.94 లక్షల నుంచి రూ.37.04 లక్షలకు దిగొస్తుందని కంపెనీ వివరించింది.
 
 మెర్సిడెస్ బెంజ్ కూడా...
 మెర్సిడెస్ బెంజ్ ఎస్‌యూవీ జీఎల్-క్లాస్‌పై రూ.2 లక్షలు ధర తగ్గించి రూ.72 లక్షలకు చేర్చినట్లు ప్రకటించింది. సీ-క్లాస్(సీ220 అవా గ్రాండ్ ఎడిషన్) రేటును రూ.39.9 లక్షల నుంచి రూ.39.35 లక్షలకు తగ్గించినట్లు తెలిపింది.  ఇక ఈ-క్లాస్ రేటు రూ.47.66 లక్షల నుంచి రూ.46.90 లక్షలకు దిగిరానుంది. ఇవన్నీ ఎక్స్‌షోరూమ్ ఢిల్లీ ధరలు. సుంకం తగ్గింపు ప్రయోజనాన్ని తమ కస్టమర్లకు సాధ్యమైనంత మేరకు బదలాయిస్తున్నట్లు మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈఓ ఎబర్‌హార్డ్ కెర్న్ వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు