భారత్‌కు సువర్ణావకాశం

12 Jun, 2020 06:20 IST|Sakshi
టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌

చైనాకు ప్రత్యామ్నాయం కావచ్చు

టాటా సన్స్‌ చైర్మన్‌ చంద్రశేఖరన్‌

ముంబై: ఏకైక సరఫరా మార్కెట్‌గా చైనాపై ప్రపంచం అధికంగా ఆధారపడడం కరోనా తర్వాత తగ్గిపోతుందని, ఇది భారత్‌కు మంచి అవకాశమని టాటా సన్స్‌ చైర్మన్‌ ఎన్‌.చంద్రశేఖరన్‌ పేర్కొన్నారు. గ్రూపు కంపెనీ టీసీఎస్‌ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) ఆన్‌లైన్‌లో నిర్వహించగా.. దీనిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. టెక్నాలజీ ప్రపంచం ‘వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌’ (ఇంటి నుంచే పని) విధానానికి మారుతోందని.. టీసీఎస్‌ కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోందన్నారు. చైనాతోపాటు మరో 50 దేశాల్లో టీసీఎస్‌ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు.

ఆయా దేశాల్లోని ఉద్యోగులను స్థానిక ప్రాజెక్టులతోపాటు అంతర్జాతీయ ప్రాజెక్టులకూ వినియోగిస్తున్నట్టు తెలిపారు. ఏజీఎంలో వాటాదారులు వర్క్‌ఫ్రమ్‌ హోమ్‌ గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపించగా.. ప్రస్తుతం ఈ విధానానికి మళ్లడం అన్నది ఖర్చుతో కూడుకున్నదంటూ.. కరోనా తర్వాత భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఇంటి నుంచే పని చేయవచ్చని చంద్రశేఖరన్‌ అభిప్రాయం వ్యక్తం చేశారు. టీసీఎస్‌ కేంద్రాల్లో 25 శాతం మందే పనిచేస్తున్నారంటూ మీడియాలో వచ్చిన వార్తలు ఊహించి రాసినవిగా పేర్కొన్నారు. వర్క్‌ ఫ్రమ్‌ హోమ్‌ను సరికొత్త ధోరణిగా పరిగణిస్తూ దీనిపై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నట్టు చెప్పారు. అనుసంధానం, కంప్యూటర్‌ పరికరాలే కాకుండా అన్ని రకాల భద్రతా చర్యలను కూడా తీసుకుంటున్నట్టు తెలిపారు.

>
మరిన్ని వార్తలు