కాగ్నిజెంట్‌లో స్వచ్ఛంద విరమణ ఆఫర్‌

5 May, 2017 00:27 IST|Sakshi
కాగ్నిజెంట్‌లో స్వచ్ఛంద విరమణ ఆఫర్‌

న్యూఢిల్లీ: ఐటీ సేవల సంస్థ కాగ్నిజెంట్‌ స్వచ్ఛందంగా వైదొలగాలనుకునే కొందరు పైస్థాయి ఉద్యోగులకు ప్రత్యేక ఆఫర్‌ ప్రకటించింది. దీని ప్రకారం హోదాను బట్టి ‘వాలంటరీ సెపరేషన్‌ ఇన్సెంటివ్‌’ కింద తొమ్మిది నెలల దాకా జీతాన్ని పరిహారంగా చెల్లించనుంది. సీనియర్‌ వైస్‌ప్రెసిడెంట్‌ స్థాయి ఉద్యోగులు ఆరు నెలలు, డైరెక్టర్స్‌ తొమ్మిది నెలల జీతం పరిహారంగా పుచ్చుకుని కంపెనీ నుంచి తప్పుకునే ఆప్షన్‌ ఇచ్చింది. సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ నుంచి డైరెక్టర్‌ స్థాయి దాకా ఉన్న మేనేజ్‌మెంట్‌ స్థాయి ఉద్యోగులకు ఈ స్వచ్ఛంద ఆఫర్‌ ఇస్తున్నట్లు, అర్హతను బట్టి కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని కాగ్నిజెంట్‌ ప్రతినిధి తెలిపారు. ఎంత మంది ఉద్యోగులకు ఇది వర్తించవచ్చు, ఆఫర్‌ వివరాలు మొదలైనవి వెల్లడించడానికి ఆయన నిరాకరించారు.

 స్వచ్ఛందంగా వైదొలగాలనుకుంటున్న ఎగ్జిక్యూటివ్స్‌ మే 12లోగా తమ నిర్ణయాన్ని తెలియజేయాల్సి ఉంటుందని, తదుపరి కంపెనీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంటుందని సంబంధిత వర్గాలు తెలిపాయి. కాగ్నిజెంట్‌లోని సుమారు 2.6 లక్షల మంది ఉద్యోగుల్లో సింహభాగం భారత్‌లోనే ఉన్నారు. అత్యుత్తమ ఆర్థిక పనితీరుతో ముందుకెళ్లిన సంస్థ వృద్ధి గత కొన్నాళ్లుగా మందగిస్తోంది. గత సంవత్సరం వృద్ధి అంచనాలను మూడు సార్లు సవరించిన కాగ్నిజెంట్‌ ఆదాయాలు 8.6 శాతం వృద్ధితో 13.49 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. అయితే, 2017 సంవత్సరానికి గాను ఆదాయం 14.5–14.84 బిలియన్‌ డాలర్లుగా ఉండగలదని కాగ్నిజెంట్‌ గైడెన్స్‌ ఇచ్చింది.  

జనరల్‌ మోటార్స్‌లోనూ..: మరోవైపు జనరల్‌ మోటార్స్‌ ఇండియా సైతం హలోల్‌ ప్లాంట్‌లోని ఉద్యోగులకు తాజాగా మళ్లీ స్వచ్ఛంద పదవీ విరమణ (వీఆర్‌ఎస్‌) ఆఫర్‌ పరిశీలిస్తోంది. ఈ ప్లాంట్‌లో ఉత్పత్తి నిలిపివేయడం దీనికి కారణం.

 

>
మరిన్ని వార్తలు