2016-17లో వృద్ధి 7.9 శాతం: క్రిసిల్ అంచనా

12 Mar, 2016 00:58 IST|Sakshi
2016-17లో వృద్ధి 7.9 శాతం: క్రిసిల్ అంచనా

ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 2016-17లో 7.9 శాతం నమోదవుతుందని అంచనావేస్తున్నట్లు దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ చీఫ్ ఎకనమిస్ట్ ధర్మకీర్తి జోషి శుక్రవారం పేర్కొన్నారు. అయితే ఇందుకు సాధారణ వర్షపాతం, ఇప్పటి వరకూ ప్రకటించిన సంస్కరణల అమలు కీలకమని పేర్కొన్నారు. ఇదే జరిగితే బ్యాంకింగ్‌లో మొండిబకాయిల సమస్య ఎలావున్నా... 7.9 శాతం వృద్ధి ఖాయమన్నది క్రిసిల్ అంచనా అని తెలిపారు. క్రిసిల్ తాజా అంచనాలు ప్రభుత్వం అంచనాల శ్రేణి 7- 7.75 శాతం కన్నా ఎక్కువగా ఉండడం గమనార్హం. క్రిసిల్ అంచనాల ప్రకారం..

కమోడిటీల ధరలు మరికొంత కాలం ప్రస్తుత స్థాయిల్లోనే కొనసాగే వీలుంది. ఇది ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణం వంటి స్థూల ఆర్థిక వ్యవస్థకు లాభించే అంశం.
ప్రైవేటు పెట్టుబడులు వచ్చే ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో జోరందుకోవచ్చు.
2016-17 బడ్జెట్ ప్రగతికి తోడ్పడుతుంది.
మొండిబకాయిల సమస్య తీవ్రమైనదే.  స్థూల ఎన్‌పీఏలుసహా బలహీన రుణ పరిమాణం మొత్తం 8.9%కి (దాదాపు రూ. 8 లక్షల కోట్ల) పెరిగే అవకాశం ఉంది. వచ్చే ఏడాదీ ఈ ఒత్తిడులు కొనసాగుతాయి.

మరిన్ని వార్తలు