కంపెనీ మారుతున్నారా...?

1 Aug, 2016 00:41 IST|Sakshi
కంపెనీ మారుతున్నారా...?

పన్ను నుంచి పీఎఫ్ వరకూ చూడాల్సిందే
బోనస్, ఎల్‌టీఏ వంటివి కూడా పరిగణనలోకి
అన్నీ కొత్త కంపెనీకి తెలిస్తేనే మంచిది..

కాస్త వయసులో ఉన్నవారు తరచూ కంపెనీలు మారటం సహజమే. ఇక ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉద్యోగాలు పెరిగిపోయిన ఈ రోజుల్లో తరచూ ఉద్యోగాలు మారటం కూడా అసాధారణమేమీ కాదు. కాకపోతే కంపెనీలు మారేటపుడు పన్ను బాధ్యతల్ని మరిచిపోకూడదు. ఇలా జంప్ చేసేటప్పుడు పన్ను పరంగా సమస్యలు రాకుండా కొన్ని విషయాలపై అవగాహన పెంచుకోవడం అవసరం. అదే ఈ కథనం...

కన్సాలిడేటెడ్ ఫామ్-16...
వార్షికంగా ఓ ఉద్యోగికి చెల్లిస్తున్న వేతనం ఆధారంగా ఆ ఉద్యోగి చెల్లించాల్సిన పన్నును కంపెనీ లెక్కిస్తుంది. దాన్ని ప్రతినెలా వేతనంలో నిర్ణీత శాతం చొప్పున మినహాయిస్తుంది. ఒకవేళ ఆర్థిక సంవత్సరం మధ్యలో కంపెనీ మారితే... కొత్తగా చేరిన కంపెనీలో గత వేతనం గురించి తెలియజేయాలి. లేదంటే రిటర్నుల దాఖలు సమయంలో అదనపు పన్ను చెల్లించాల్సి రావచ్చు. ఎందుకంటే రెండు కంపెనీల్లోనూ రూ.2.5 లక్షల బేసిక్ ఎగ్జంప్షన్‌కు తోడు రూ.1.5 లక్షలు సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపును పరిగణనలోకి తీసుకుంటారు. అలాగే, పన్ను లెక్కించేటప్పుడు దిగువ స్థాయి ట్యాక్స్ స్లాబ్‌ను పరిశీలనలోకి తీసుకుంటారు.

 పాత కంపెనీలో వేతన సమాచారాన్ని కొత్త కంపెనీలో నిర్ణీత పత్రంలో తెలియజేస్తే నిబంధనల మేరకు పన్ను మినహాయిస్తారు. ఆర్థిక సంవత్సరం ముగిశాక కొత్త కంపెనీ కన్సాలిడేటెడ్ ఫామ్-16ను జారీ చేస్తుంది. ఇందులో పాత కంపెనీ వేతన సమాచారంతోపాటు టీడీఎస్ వివరాలు కూడా ఉం టాయి. ఒకవేళ పాత కంపెనీ వేతన వివరాలను కొత్త కంపెనీలో ఇవ్వకుంటే రెండు కంపెనీల్లోనూ జారీ చేసిన ఫామ్-16లను పరిగణనలోకి తీసుకుని పన్ను రిటర్నులను స్వయంగా వేయాలి. ఆ మేరకు పన్ను కూడా కట్టాలి. ఒక ఆర్థిక సంవత్సరం మధ్యలో కంపెనీ మారినప్పటికీ మినహాయింపులను ఒక్కసారే క్లెయిమ్ చేసుకోవాలి. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా దగ్గర ఉంచుకుంటే భవిష్యత్తులో పన్ను అధికారులు అడిగితే చూపించడానికి ఉంటుంది.

 ఎల్‌టీఏ...
నాలుగేళ్ల కాలంలో కుటుంబ సభ్యులతో కలసి రెండు సార్లు పర్యటనల కోసం చేసిన ఖర్చులను లీవ్ ట్రావెల్ అలవెన్స్ నిబంధనల కింద పన్ను క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంది. ఈ నాలుగేళ్ల కాలంలో ఎన్ని కంపెనీలు మారినా రెండు సార్లకే ఈ అవకాశం.

 జనవరిలోపు మారిపోతే
హెచ్‌ఆర్‌ఏ ఇతర అలవెన్స్‌లకున్న పన్ను మినహాయింపు సౌకర్యాన్ని పొందేందుకు ఏటా జనవరిలో ఉద్యోగం చేస్తున్న సంస్థకు ఆధారాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ జనవరిలోపే కంపెనీ మారిపోతే పన్ను మినహాయింపులు కోల్పోవాల్సి వస్తుంది. ఎందుకంటే పాత కంపెనీ ఈ మేరకు పన్నును ఐటీ శాఖకు జమ చేస్తుంది. ఒకవేళ ఇలా జరిగితే పన్ను రిటర్నుల సందర్భంగా క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది.

 విదేశీ ఆదాయంపై పన్ను
ఆర్థిక సంవత్సరం మధ్యలో అంటే అక్టోబర్‌లోపే విదేశీ జాబ్ కోసం వెళ్లిపోతే ఎన్‌ఆర్‌ఐగా పరిగణిస్తారు. కనుక ఇక్కడ పన్ను కట్టక్కర్లేదు. ఒకవేళ రెసిడెంట్ ఇండియన్ అని భావిస్తే విదేశీ ఆదాయంపై ఇక్కడే పన్ను చెల్లించాలి. 

 ఇవి మర్చిపోవద్దు...
ఆర్గనైజేషన్ మారుతున్నప్పుడు పే స్లిప్‌లు, ఫామ్ 16, ఫామ్ 10సీ (పీఎఫ్ ఉపసంహరణకు సంబంధించి), ఫైనల్ సెటిల్‌మెంట్ స్టేట్‌మెంట్ మొదలైనవి తప్పకుండా తీసుకోవాలి.

ప్రావిడెంట్ ఫండ్...
కంపెనీ మారినప్పుడు పీఎఫ్ ఉపసంహరించుకుంటే పన్ను కట్టాల్సి వస్తుందేమో చూడాలి. ఎందుకంటే ఐదేళ్లు పూర్తి కాకుండా పీఎఫ్ నిధులను వెనక్కి తీసుకుంటే నిబంధనల ప్రకారం పన్ను చెల్లించాలి. ఉపసంహరించుకున్న మొత్తాన్ని సాధారణ ఆదాయం కింద పరిగణించి పన్ను కట్టాలి. దీనికి బదులు నూతన కంపెనీకి పీఎఫ్ బదిలీ చేసుకోవడం ఉత్తమం.

 జాయినింగ్ బోనస్‌పై పన్ను: కొన్ని కంపెనీల్లో కొత్తగా చేరిన ఉద్యోగులకు జాయినింగ్ బోనస్ ఇచ్చే సంప్రదాయం ఉంది. ఈ బోనస్‌పై కంపెనీ పన్నును తగ్గించి ఇస్తుంది. అయితే, చేరిన 6 నెలల్లోనే ఆ కంపెనీకి గుడ్‌బై చెబితే తీసుకున్న బోనస్‌ను తిరిగిచ్చేయాలి. అందుకున్న నికర బోనస్‌తోపాటు కంపెనీ ఉపసంహరించుకున్న పన్నును కూడా చెల్లించాల్సి ఉంటుంది. ఎందుకంటే పన్ను రూపంలో తీసుకున్న మొత్తాన్ని కంపెనీ ఐటీ శాఖకు జమ చేస్తుంది. ఉదాహరణకు శ్రీరామ్ ‘ఎ’ కంపెనీలో చేరిన సందర్భంగా కంపెనీ రూ.లక్ష బోనస్ ఇచ్చింది. 30% పన్నును ఉపసంహరించుకుని రూ.70వేలు చెల్లించింది. చేరిన ఆరు నెలల్లోనే శ్రీరామ్ కంపెనీకి రాజీనామా చేశాడు. దీంతో అతడు రూ.లక్షను కంపెనీకి కట్టాల్సి ఉంటుంది. రూ.30వేలను రిఫండ్ కోసం ఐటీ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి.

మరిన్ని వార్తలు