ఎవరూలేని సమయంలో.. 'డెత్‌నోట్‌' రాసి.. విషాద నిర్ణయం!

4 Nov, 2023 14:24 IST|Sakshi

ఐశ్వర్య ఆత్మహత్య అనంతరం.. భర్త రాజేశ్‌, కుటుంబ సభ్యులు ముంబైలో పార్టీ..

భర్త, అత్త, మామ సహా ఐదుగురి అరెస్ట్!

సాక్షి, కర్ణాటక: వరకట్న వేధింపులతో ఆత్మహత్యకు పాల్పడిన మహిళా టెక్కీ కేసులో శుక్రవారం గోవిందరాజనగర పోలీసులు ఐదుమందిని అరెస్ట్‌చేశారు. భర్త రాజేశ్‌, మామ గిరియప్ప, అత్త సీతా, విజయ్‌, తస్మితాను కటకటాల వెనక్కు పంపారు. అమెరికాలో ఎంబీఏ చదివిన ఐశ్వర్య(26)కు డైరీరీచ్‌ ఐస్‌క్రీమ్‌ కంపెనీ యజమాని రాజేశ్‌తో ఐదేళ్ల క్రితం వివాహమైంది. ఐశ్వర్య తండ్రి సుబ్రమణి చెల్లెలి భర్త రవీంద్ర.. రాజేశ్‌ కంపెనీలో ఆడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇతనే రాజేశ్‌కు పెళ్లి సంబంధం చూశాడు.

మూడునాలుగేళ్లు ఇరుకుటుంబాలు సంతోషంతో అన్యోన్యంగా ఉన్నాయి. ఆస్తి విషయంలో రవీంద్ర, సుబ్రమణి కుటుంబాల్లో గొడవలు ఏర్పడ్డాయి. ఐశ్వర్య తండ్రిపై కోపంతో రవీంద్ర ఐశ్వర్య సంసారంలో నిప్పులు పోశారు. ఐశ్వర్యపై రాజేశ్‌కు లేనిపోని అబద్దాలు చెప్పి దంపతుల మధ్య గొడవలు పెట్టాడు. దీంతో రాజేశ్‌ కుటుంబ సభ్యులు ఐశ్వర్యను వేధించారు. అయినప్పటికీ ఐశ్వర్య సహనం కోల్పోలేదు. ఉద్యోగం చేసిన సంపాదనలో భర్తకు విలాసవంతమైన బైకు, బంగారు ఆభరణాలు అందించింది. కానీ కుటుంబ సభ్యులు మాటలు విని రాజేశ్‌ దూషణలకు పాల్పడటంతో ఐశ్వర్య 20 రోజుల క్రితం విజయనగరలోని పుట్టింటికి చేరుకుంది.

గతనెల 26 తేదీన ఇంట్లో ఎవరూలేని సమయంలో డెత్‌నోట్‌రాసి ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. తమ కుమార్తె మృతికి అల్లుడు, కుటుంబసభ్యులే కారణమని పలువురు పేర్లతో గోవిందరాజనగర పోలీస్‌స్టేషన్‌లో ఐశ్వర్య తండ్రి ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఐశ్వర్య భర్తతో పాటు కుటుంబసభ్యులను అరెస్ట్‌చేసి విచారణ చేపడుతున్నారు. ఐశ్వర్య ఆత్మహత్యకు పాల్పడిన అనంతరం భర్త రాజేశ్‌, తల్లిదండ్రులు గిరియప్ప, సీతా, విజయ్‌, తస్మిన్‌ గోవా, ముంబైలో పార్టీ చేసుకున్నట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది.

ముఖ్య గమనిక: ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
ఇవి చదవండి: వివాహేతర సంబంధంతో.. ప్రియురాలి మోజులో.. భార్యను కిరాతకంగా..

మరిన్ని వార్తలు