ఒడిదుడుకుల వారం!

16 Mar, 2020 06:53 IST|Sakshi

కరోనా పరిణామాలే కీలకం..

భారీ ఆటుపోట్లకు అవకాశం

అమెరికా ఫెడ్‌ సమావేశంపై దృష్టి...

టోకు ద్రవ్యోల్బణం గణాంకాలు ఈవారంలోనే వెల్లడి...

ముంబై: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెను సవాలుగా మారుతోన్న కోవిడ్‌–19 (కరోనా) వైరస్‌ కీలక పరిణామాలే ఈ వారంలోనూ దేశీ స్టాక్‌ మార్కెట్‌ను నడిపించనున్నాయని దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలు భావిస్తున్నాయి. వైరస్‌ విస్తృతి ఆధారంగా సూచీల కదలికలు ఉండనున్నాయని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ ఖేమ్కా విశ్లేషించారు. శుక్రవారం ట్రేడింగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ చరిత్రలోనే అత్యధికంగా 3091 పాయింట్లు (10 శాతం) నష్టపోయి.. 45 నిమిషాల హాల్ట్‌ తరువాత, ట్రేడింగ్‌ తిరిగి ప్రారంభమైన కొద్ది సేపట్లోనే రికవరీతోపాటు 550 పాయింట్లవరకూ పెరిగింది. ఈ వారం ట్రేడింగ్‌లో కూడా ఇదే తరహాలో భారీ స్థాయి ఒడిదుడుకులకు ఆస్కారం ఉందని అన్నారు.

ఇటువంటి ఆటుపోట్లను చూసి ఇన్వెస్టర్లు ఆందోళన చెందవద్దని సిద్ధార్థ సూచించారు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య ఆదివారం నాటికి 108కి చేరింది. ముంబై తరువాత కర్ణాటక, కేరళలో వైరస్‌ తీవ్రత అధికంగా ఉందని వెల్లడైంది. ఇటువంటి పరిణామాలతో ఒడిదుడుకులు భారీ స్థాయిలోనే ఉండేందుకు ఆస్కారం ఉందని జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ పరిశోధనా విభాగం చీఫ్‌ వినోద్‌ నాయర్‌ విశ్లేషించారు. ముఖ్యంగా వైరస్‌ వ్యాప్తి ఆధారంగానే ఈ వారం మార్కెట్‌ గమనం ఉంటుందని రెలిగేర్‌ బ్రోకింగ్‌ వీపీ రీసెర్చ్‌ అజిత్‌ మిశ్రా అన్నారు. మార్కెట్లో ఒడిదుడుకులను సూచించే వోలటాలిటీ ఇండెక్స్‌ జీవితకాల గరిష్టస్థాయికి చేరినందున భారీ హెచ్చుతగ్గులకు అవకాశం ఉందని తాను భావిస్తున్నట్లు చెప్పారు. మార్కెట్లో బౌన్స్‌ బ్యాక్‌ ఉండొచ్చని ఇండియానివేష్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ హెడ్‌ వినయ్‌ పండిట్‌ తెలిపారు.

ఈ నెల్లో రూ. 37,976 కోట్లు వెనక్కి..
భారత క్యాపిటల్‌ మార్కెట్లో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెల్లో ఇప్పటివరకు రూ. 37,976 కోట్లను ఉపసంహరించుకున్నారు.  మార్చి 2–13 మధ్య కాలంలో ఈక్విటీ మార్కెట్‌ నుంచి రూ. 24,776 కోట్లను, డెట్‌ మార్కెట్‌ నుం చి రూ. 13,200 కోట్లను వెనక్కు తీసుకున్నారు.

మరిన్ని వార్తలు