డిస్కౌంట్లపై వాహనదారులకు ఎదురుదెబ్బ

3 Aug, 2018 01:00 IST|Sakshi

0.75% నుంచి 0.25%కి తగ్గింపు..

ఈ నెల 1 నుంచే అమల్లోకి 

న్యూఢిల్లీ: కారు, మోటార్‌ వాహనాదారులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. డిజిటల్‌ చెల్లింపుల విషయంలో కేంద్రం వైఖరి మారింది!. పెట్రోల్‌ పంపుల వద్ద డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహకానికి కేంద్రం కోత పెట్టేసింది. ప్రారంభించి 20 నెలలు కాకుండానే చమురు కంపెనీలు ప్రోత్సహకాల భారం తగ్గించుకున్నాయి. బిల్లు మొత్తంలో 0.75% ప్రోత్సాహకాన్ని 2016 డిసెంబర్‌ 13 నుంచి ఇస్తుండగా, దీన్ని 0.25%కి తగ్గించాయి. పెట్రోల్‌ పంపు నిర్వాహకులకు కంపెనీలు ఎస్‌ఎంఎస్‌ ద్వారా విషయాన్ని తెలిపాయి. ఆగస్ట్‌ 1 నుంచి ఇది అమల్లోకి వచ్చిందని, ఈ విషయాన్ని కస్టమర్లకు తెలపాలని డీలర్లను కోరాయి. క్రెడిట్, డెబిట్‌ కార్డులు, ఈ–వ్యాలెట్ల ద్వారా చేసే చెల్లింపులకు ప్రస్తుతం ప్రోత్సాహకం లభిస్తోంది. లీటర్‌ పెట్రోల్‌పై 57 పైసలుగా ఉన్న క్యాష్‌బ్యాక్‌ 19 పైసలకు, డీజిల్‌పై 50 పైసల ప్రోత్సాహకం 17 పైసలకు తగ్గింది. వివిధ ప్రాంతాల్లో అమ్మకం ధర ఆధారంగా ఈ క్యాష్‌బ్యాక్‌ ఆధారపడి ఉంటుంది. 

త్వరలో మిగిలిన వాటికీ కోత..: నగదు తిరిగి వ్యవస్థలోకి సమృద్ధిగా వచ్చిందని, డిజిటల్‌ చెల్లింపులు తగ్గాయని అధికార వర్గాలు తెలిపాయి. 2016 డిసెంబర్‌లో ప్రారంభించిన ఇతర డిజిటల్‌ చెల్లింపుల ప్రోత్సాహకాలకూ ఇదే విధంగా కోత విధించే అవకాశం ఉందని పేర్కొన్నాయి. సాధారణ బీమా ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేస్తే ప్రీమియంలో 10%, జీవిత బీమా ఉత్పత్తులపై 8% ప్రీమియం తగ్గింపును 2016 డిసెంబర్‌లో అమల్లోకి తీసుకొచ్చారు. సబర్బన్‌ రైల్వే నెలవారీ సీజనల్‌ టికెట్లపై డిజిటల్‌ రూపంలో చెల్లింపులకు 0.5% తగ్గింపు, టోల్‌ ప్లాజాల్లో ప్రీపెయిడ్‌ కార్డులతో చెల్లిస్తే 10% తగ్గింపు కూడా ఉన్నాయి. రూ.2,000 వరకు చెల్లింపులను క్రెడిట్‌ కార్డు లేదా డెబిట్‌ కార్డు ద్వారా చేస్తే సర్వీస్‌ ట్యాక్స్‌ కూడా మినహాయించారు. 2,000 వరకు డెబిట్‌ కార్డు, భీమ్‌ యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్‌ చార్జీలను సైతం కేంద్రమే భరిస్తోంది.    

>
మరిన్ని వార్తలు