‘ఎఫ్‌ఎంసీజీ’కి ధర దడ!

20 Jul, 2018 01:20 IST|Sakshi

ముడిచమురు ధరల పెరుగుదల

కరెన్సీ ఆటుపోట్లతో ఒత్తిళ్లు

దీంతో తయారీ వ్యయం భారం

ఉత్పత్తుల ధరలు  పెంచాల్సిన పరిస్థితి

లేకపోతే మార్జిన్లపై ప్రభావం

పెద్ద కంపెనీలకు సానుకూలతలే!

చిన్న కంపెనీలకే గడ్డు పరిస్థితులు

న్యూఢిల్లీ: పెరుగుతున్న ముడిచమురు ధరలు సామాన్యులకే కాదు, ఎఫ్‌ఎంసీజీ కంపెనీలను సైతం ఆందోళనకు గురి చేసేదే!. ముడి చమురు ధరలు ఒక్కటే కాదు, కరెన్సీ విలువ ఆటుపోట్లను కూడా గమనిస్తున్నామంటూ బడా ఎఫ్‌ఎంసీజీ కంపెనీ హిందుస్తాన్‌ యూనిలీవర్‌ చెబుతూనే, దీన్ని ఒక రిస్క్‌గా అభివర్ణించడం గమనార్హం. ఎఫ్‌ఎంసీజీ కంపెనీలు తయారు చేసే ఉత్పత్తులకు ముడి పదార్థాల్లో ముడి చమురు కీలకం. పామోలిన్‌ ఆయిల్‌ ధరలు అనుకూలంగానే ఉండగా, ముడి చమురు ధరలు మాత్రం గత ఏడాది కాలంలో 50 శాతం పెరిగి బ్యారల్‌ 72 డాలర్ల స్థాయికి చేరాయి. ముడి చమురు ధరలు పెరిగితే వాటి ఉప ఉత్పత్తులైన లైనియర్‌ ఆల్కిల్‌ బెంజేన్‌ (ఎల్‌ఏబీ), హై డెన్సిటీ పాలీ ఎథిలీన్‌ (హెచ్‌డీపీఈ) ధరలు కూడా పెరుగుతాయి. ఈ రెండూ ఎఫ్‌ఎంసీజీ కంపెనీలకు కీలకమైన ముడి పదార్థాలు. ముడి చమురు ధరలు పెరగడం కారణంగా తయారీ వ్యయం పెరుగుతుందని, దాంతో ఎఫ్‌ఎంసీజీ కంపెనీలపై తమ ఉత్పత్తుల ధరలు పెంచాల్సిన ఒత్తిడి ఏర్పడుతుందని ఈక్వినామిక్స్‌ రీసెర్చ్‌ అండ్‌ అడ్వైజరీ వ్యవస్థాపకుడు జి.చొక్కలింగం పేర్కొన్నారు. ధరల పెంపు ద్వారా కంపెనీలు మార్జిన్లు పడిపోకుండా చూసుకోగలవు.
 
సహేతుక స్థాయిలోనే... 
ఎల్‌ఏబీని డిటర్జెంట్‌ తయారీకి వినియోగిస్తారు. హెచ్‌డీపీఈని ఉపయోగించి ప్యాకింగ్‌ మెటీరియల్‌ను తయారు చేస్తారు. సబ్బుల నుంచి డిటర్జెంట్‌ వరకు, క్రీములు, షాంపూలు, హెయిర్‌ ఆయిల్, టూత్‌పేస్ట్‌ ఇలా అన్ని ఉత్పత్తుల ప్యాకింగ్‌కు దీన్నే వినియోగిస్తుంటారు. కంపెనీల ఉత్పత్తుల మొత్తం తయారీ వ్యయంలో ప్యాకింగ్‌ ఖర్చు 15–25 శాతం వరకు ఉంటుంది. హెచ్‌యూఎల్‌ ఇప్పటికే 2.5 శాతం వరకు ధరల పెంపును ఏప్రిల్, జూన్‌ క్వార్టర్లో అమలు చేసింది. ముఖ్యంగా డిటర్జెంట్‌ ధరలను పెంచింది. రానున్న త్రైమాసికాల్లో అన్ని విభాగాల్లో ధరలను పెంచే అవకాశం కనిపిస్తోంది. ‘‘సహేతుక స్థాయిలోనే ధరలు పెంచాలన్నది మా విధానం. అన్ని ప్యాక్‌లపై ఒకే స్థాయిలో ధరల పెంపు ఉండ దు. మొత్తం మీద పరిస్థితులను పరిగణనలోకి తీసు కుని, ధరలు, విలువ మధ్య సమానతను దృష్టిలో ఉంచుకుని, రేట్ల పెంపు చేపడతాం’’ అని హెచ్‌యూఎల్‌ చైర్మన్, ఎండీ సంజీవ్‌ మెహతా తెలిపారు.  

బడా కంపెనీలకు ఇదో అవకాశం 
‘‘వచ్చే రెండు మూడు త్రైమాసికాల్లో డిమాండ్‌ కారణంగా అమ్మకాలపై ప్రభావం ఉండకపోవచ్చు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులు మెరుగుపడుతున్నాయి. దీంతో కంపెనీల చేతిలో ఇప్పుడు ధరలను నిర్ణయించే శక్తి ఉంది. అయితే, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి సమస్యలు పెరుగుతాయి’’ అని షేర్‌ఖాన్‌ సీనియర్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌ కౌస్తుభ్‌ పవస్కార్‌ తెలిపారు. ఎడెల్వీజ్‌ ఇన్‌స్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ రీసెర్చ్‌ సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ అబ్నీష్‌ రాయ్‌ మాట్లాడుతూ... ద్రవ్యోల్బణ పరమైన ఒత్తిళ్ల కారణంగా చిన్న స్థాయి కంపెనీల నుంచి మార్కెట్‌ వాటాను హస్తగతం చేసుకునేందుకు పెద్ద కంపెనీలకు అవకాశమని పేర్కొన్నారు. ‘‘కంపెనీలు ధరల్ని సహేతుకంగానే పెంచితే ఇదో అవకాశం. అవి మార్జిన్లను కాపాడుకోవడమే కాకుండా, కస్టమర్లు సైతం వాటికి దూరం కారు. అయితే, కచ్చితంగా ధరల పెంపు భారీగా ఉండకూడదు. కానీ, చిన్న సంస్థల విషయంలో ఈ పరిస్థితి పూర్తిగా భిన్నం. ధరల్ని తక్కువగా ఉండేలా చూడటమే వాటి వ్యూహం. ఈ తరహా సమయాల్లో చిన్న సంస్థలు కార్యకలాపాలను తగ్గించుకుంటాయి. ఇది పెద్ద సంస్థలకు అనుకూలంగా మార్కెట్‌ను విడిచిపెట్టడమే’’ అని అబ్నీష్‌ రాయ్‌ అన్నారు.

రేట్లు ఎంత మేర పెరగవచ్చు..!
గోద్రెజ్‌ కన్సూమర్, డాబర్, మారికో, ఇమామి, బజాజ్‌ కార్ప్, జ్యోతి ల్యాబొరేటరీస్‌ సంస్థలు వచ్చే కొన్ని నెలల్లో ధరల్ని 4–5 శాతం స్థాయిలో పెంచొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అలాగే, ఏషియన్‌ పెయింట్స్, ఇతర రంగుల తయారీ పరిశ్రమలు ధరల్ని ఎక్కువగా పెంచాల్సిన పరిస్థితి నెలకొంది. ఎందుకంటే రంగుల పరిశ్రమకు ప్రధాన ముడి పదార్థాలు పెట్రోలియం నుంచి వచ్చేవే.      

మరిన్ని వార్తలు