మద్దతుపైనే పసిడి..

12 Mar, 2018 00:12 IST|Sakshi

మార్చి 9వ తేదీతో ముగిసిన వారంలో పసిడి అంతర్జాతీయ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ నైమెక్స్‌లో పటిష్ట స్థాయిలో నిలిచింది. వారం వారీగా ఔన్స్‌కు (31.1గ్రా) కేవలం ఒక డాలర్‌ అధికంగా 1,324 వద్ద ముగిసినప్పటికీ, తక్షణ మద్దతు 1,305 పైనే నిలవడం గమనార్హం. వారంలో 1,340 – 1,324 డాలర్ల శ్రేణిలో తిరిగింది. ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై వరుసగా 25,10 శాతం చొప్పున అమెరికా సుంకాల విధింపు... ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, డాలర్‌ ఇండెక్స్‌పై ఈ ప్రభావం దీనితోపాటు అమెరికా– ఉత్తరకొరియా మధ్య ఉద్రిక్తతల ఉపశమనం వంటి అంశాలు వచ్చే కొద్ది నెలల్లో పసిడి కదలికలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.

ఆయా ప్రభావ అంశాల నేపథ్యంలో సమీప భవిష్యత్తులో పసిడి 1,250 డాలర్లు – 1,400 డాలర్ల స్థాయిలోనే తిరిగే అవకాశం ఉందన్నది నిపుణుల అభిప్రాయం.  1,300, 1,270, 1,240 డాలర్ల వద్ద పసిడికి పటిష్ట మద్దతు ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక ఎగువస్థాయిలో తక్షణ నిరోధం 1,365 డాలర్లు. ఇక డాలర్‌ ఇండెక్స్‌ గడచిన వారంలో స్వల్పంగా 0.25 సెంట్లు పెరిగి 89.95 నుంచి 90.11కు ఎగసింది.

దేశంలో రూపాయి అడ్డు..: అంతర్జాతీయ ప్రభావంతోపాటు దేశీయంగా డాలర్‌ మారకంలో రూపాయి బలోపేతం (వారం వారీగా 28 పైసలు లాభంతో 64.94)  ఫ్యూచర్స్‌ మార్కెట్‌– మల్టీ కమోడిటీ ఎక్సే్ఛంజ్‌ (ఎంసీఎక్స్‌)లో పసిడిపై కనిపించింది. వారంలో  10 గ్రాముల ధర స్వల్పంగా రూ.47 తగ్గి, రూ.30,401కి చేరింది.  ఇక దేశీయంగా ముంబై ప్రధాన మార్కెట్‌లో పసిడి వారం వారీగా  99.9 స్వచ్ఛత ధర రూ.300 లాభంతో రూ.30,545కు చేరింది.

మరిన్ని వార్తలు