25 కేజీల బంగారం దొంగతనం.. ఎక్కడంటే?

28 Nov, 2023 20:46 IST|Sakshi

ప్రముఖ బంగారం స్టోర్‌ నుంచి గ్రాముల్లో కాదు ఏకంగా కేజీల్లో బంగారాన్ని దోచేసిన సంఘటన మంగళవారం తమిళనాడులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తమిళనాడు కోయంబత్తూరులోని జోస్ అలుక్కాస్ సంస్థకు చెందిన గాంధీపురం బ్రాంచ్‌లో దొంగతనం జరిగింది. ఈ క్రమంలో వారు ఏకంగా 25 కేజీల బంగారు ఆభరణాలను దోచేశారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి షాపు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. అర్థరాత్రి 2.30 గంటల సమయంలో ఈ చోరీ జరిగినట్లు గుర్తించారు. సోమవారం ఎప్పటిలాగే షాపు మూసిన ఉద్యోగులు తెల్లవారిన తర్వాత షోరూమ్ తెరిచి చూడగానే ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. షోరూమ్ వెనుకవైపు దొంగలు ఏసీ వెంటిలేటర్ ద్వారా స్టోర్‌లోకి ప్రవేశించినట్లు గుర్తించారు. దాంతో వెంటనే కంపెనీ అధికారులకు, పోలీసులకు సమాచారం అందించారు.

ప్రస్తుతం కోయంబత్తూరు పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయని పోలీసు వర్గాలు తెలిపాయి. ప్రస్తుత మార్కెట్‌ ప్రకారం దొంగలించబడిన బంగారం విలువ కోట్లలో ఉంటుందని తెలుస్తోంది. దాదాపు 200 సవర్ల బంగారం మాయం కావటంపై పోలీసులు కొన్ని ఆధారాలు సేకరించినట్లు సమాచారం.

జోస్‌అలుక్కాస్‌ను 1964లో అలుక్కా వర్గీస్‌ స్థాపించారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 కంటే ఎక్కువ స్టోర్‌లున్నాయి. త్వరలో ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.5500 కోట్లతో 100 స్టోర్లు ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది. కంపెనీకి ఏటా దాదాపు రూ.9000 కోట్ల రెవెన్యూ ఉందని సమాచారం. 

మరిన్ని వార్తలు