వెలుగులోకి మాల్యా కొత్త షెల్‌ కంపెనీలు

30 Jul, 2019 13:28 IST|Sakshi

అక్రమంగా నిధుల మళ్లింపు కేసులో ఈడీ గుర్తింపు

అనుచరుడి ఇంట్లో సోదాలు

న్యూఢిల్లీ: బ్యాంకులకు భారీ మొత్తంలో రుణాలను ఎగవేసి బ్రిటన్‌కు ఉడాయించిన విజయ్‌ మాల్యా కేసులో తవ్వేకొద్దీ అక్రమాలు వెలుగుచూస్తున్నాయి. అనుచరుల ద్వారా డొల్ల(షెల్‌) కంపెనీలను సృష్టించి వాటిద్వారా నిధులను(బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను) మాల్యా తన సొంత ఖాతాల్లోకి మళ్లించుకున్నట్లు తాజాగా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) వెలుగులోకి తెచ్చింది. ఈ లావాదేవీల్లో పాలుపంచుకున్నట్లు అనుమానిస్తూ కొన్ని షెల్‌ కంపెనీలను(యునైటెడ్‌ బ్రాండింగ్‌ వరల్డ్‌వైడ్‌ ఇతరత్రా) గుర్తించింది. దీని ఆధారంగా బెంగళూరుకు చెందిన వి.శశికాంత్, అతని కుటుంబ సభ్యుల ఇళ్లలో ఈడీ గతవారం సోదాలు నిర్వహించింది. శశికాంత్‌ అనే వ్యక్తి మాల్యాకు అత్యంత ఆప్తుడని ఈడీ వర్గాలు తెలిపాయి. తాజాగా అమల్లోకి వచ్చిన ఫ్యూజిటివ్‌ ఎకనమిక్‌ అఫెండర్‌(ఎఫ్‌ఈఓ) చట్టం కింద ఈ చర్యలు చేపట్టినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌ పేరుతో దాదాపు రూ.9,000 కోట్లకుపైగా రుణాలను ఎగ్గొట్టిన మల్యాపై ఇప్పటికే పలు క్రిమినల్‌ కేసులు నమోదయ్యాయి.  కేసుల నుంచి తప్పించుకోవడానికి బ్రిటన్‌ పారిపోయిన మాల్యాను భారత్‌కు రప్పించేందుకు కేంద్రం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది.

మరిన్ని వార్తలు