ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో...రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు

23 Mar, 2016 01:46 IST|Sakshi
ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో...రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు

ఐటీ మంత్రి రవిశంకర్ వెల్లడి
న్యూఢిల్లీ: భారత ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలోకి రూ.1.28 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని కమ్యూనికేషన్స్, ఐటీ శాఖల మంత్రి రవి శంకర్ ప్రసాద్ చెప్పారు. 2014 వరకూ రూ.11,700 కోట్లుగా ఉన్న ఈ రంగంలో పెట్టుబడులు ఈ ఏడాది ఇప్పటివరకూ రూ.1.28 లక్షల కోట్లకు పైగా పెరిగాయని తెలిపారు. ఎలక్ట్రానిక్స్ తయారీకి అంతర్జాతీయ కేంద్రంగా భారత్‌ను రూపొందించే ప్రయత్నాలు చేస్తున్నామని, కేంద్రం, రాష్ట్రాలది కీలకమైన పాత్ర అని వివరించారు. భారత్ టెక్నాలజీ వేగంగా అందుకుంటోందని, ఈ ఏడాది చివరికల్లా భారత్‌లో ఇంటర్నెట్‌ను వినియోగించే వారి సంఖ్య 50 కోట్లకు పెరుగుతుందని తెలిపారు. టైమ్స్ నెట్‌వర్క్ ఇక్కడ ఏర్పాటు చేసిన డిజిటల్ ఇండియా సదస్సులో ఆయన మాట్లాడారు. భారతీయులు ముందుగా టెక్నాలజీని గమనిస్తారని, తర్వాత దానిని వినియోగిస్తారని,  ఆ తర్వాత సాధికారత సాధిస్తారని రవి శంకర్ ప్రసాద్ తెలిపారు.

 ఆధార్‌తో రూ.50 వేల కోట్ల ఆదా..
వంద కోట్లకు పైగా మొబైల్ వినియోగదారులున్నారని, దాదాపు 99 కోట్ల మందికి ఆధార్ కార్డులిచ్చామని, ఆధార్ అనుసంధాన బ్యాంక్ అకౌంట్లకు నేరుగా సబ్సిడీలు చెల్లించడం ద్వారా రూ.50,000 కోట్లు ఆదా చేశామని  రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. భారత్‌లో ఈ కామర్స్ జోరుగా వృద్ధి సాధిస్తోందని, ఈ కామర్స్‌ను వినియోగిస్తున్న వారిలో 60 శాతం మంది చిన్న పట్టణాల ప్రజలేనని వివరించారు. 2.2 లక్షల గ్రామ పంచాయతీలను బ్రాడ్‌బ్యాండ్ ద్వారా అనుసంధానం చేసే కార్యక్రమంలో భాగంగా 1.3 లక్షల కి.మీ. మేర కొత్త పైప్‌లైన్లను వేశామని, 1.10 లక్షల కి.మీ. మేర ఆప్టికల్ ఫైబర్ వేశామని చెప్పారు. అన్ని గ్రామ పంచాయతీలను అనుసంధానం చేసి ఈ-బిజినెస్, ఈ-ఎడ్యుకేషన్, ఈ-హెల్త్, ఇతర ప్రాజెక్టులను గ్రామాల్లో ప్రారంభిస్తామని తెలిపారు. చిన్న నగరాల్లో బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్(బీపీఓ) జోరు పెంచే ప్రయత్నాలు చేస్తున్నామని, ఇప్పటివరకూ 78 కంపెనీలు 190 నగరాల్లో బీపీఓ సెం టర్ల ఏర్పాటుకు ముందుకొచ్చాయని వివరించారు.

మరిన్ని వార్తలు