ఎవరి ఆశలు వారివి...

27 Feb, 2015 02:01 IST|Sakshi
ఎవరి ఆశలు వారివి...

దేశ ఆర్థిక బడ్జెట్ అంటే అందరికీ ఆసక్తే. ఏయే రంగాలకు ఎంతమేరకు కేటాయింపులు ఉంటాయి? ఎవరికి ఎంత లాభం? భారమెంత? వంటి అంశాలపై నిపుణుల విశ్లేషణలు సహజం. అయితే ఈ విషయంలో సామాన్యుడి నుంచి పారిశ్రామికవేత్తవరకూ ఎవరి కోర్కెలు వారివి. వారు ఆర్థికమంత్రిని ఏమి కోరుకుంటున్నారో  ఒక్కసారి తెలుసుకుందామా...?
 
నేనూ కోరుకుంటున్నాను...
మీకే కాదు. నాకూ కొన్ని ఆశలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదాయ వ్యయాలకు మధ్య ఉన్న వ్యత్యాసం ద్రవ్యలోటును ఎట్టి పరిస్థితుల్లోనూ పెరగనీయకూడదు. కాబట్టి సబ్సిడీల విషయంలో ఆచితూచి వ్యవహరించాల్సిందే. అంతర్జాతీయంగా క్రూడ్ ధరల తగ్గుదల వల్ల లభిస్తున్న ప్రయోజనం- ప్రభుత్వ ఆర్థిక పటిష్టతకు దోహదపడేలా ముందు చూసుకోవాలి. దేశానికి ఇది ఎంతో ముఖ్యాంశం. ఇక దేశంలోకి క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్(ఎఫ్‌డీఐ, ఎఫ్‌ఐఐ, ఈసీబీ) భారీగా పెరగాలనీ కోరుకుంటున్నా. పన్నుల సంస్కరణలు, వ్యవస్థ పటిష్టత సంకేతాల ద్వారా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మరింత ఆకర్షించాలన్నది నా ప్రయత్నం.

ఇందులో విజయవంతం కావాలి. దీర్ఘకాలంలో ఇది దేశాభివృద్ధికి దోహదపడుతుంది. మీ దగ్గర ఎక్కువ డబ్బుండి... మీ వినియోగ సామర్థ్యం పెరగాలనీ కోరుకుంటున్నా.  ముఖ్యంగా ద్రవ్యోల్బణం అదుపులో ఉంచి... సామాన్యుడి కొనుగోలు, పొదుపు శక్తి పెరగడానికి తగిన చర్యలపై ఆలోచించాం. తద్వారా బ్యాంకింగ్ వడ్డీరేటు మరింత తగ్గుదలకు ఆర్‌బీఐ సంకేతాల కోసమూ ఎదురుచూస్తున్నాం.  ఇంకా నేనేం కోరుకుంటున్నానో తెలుసుకోవడానికి మరో 48 గంటలు వేచిచూడండి..!
- అరుణ్ జైట్లీ, ఆర్థికమంత్రి
 
మహిళా వ్యాపారవేత్త
మహిళా వ్యాపారవేత్తలను ప్రోత్సహిం చడానికి,  స్టార్టప్ కంపెనీలకు సలహాలు, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిం చేందుకు ప్రత్యేకంగా ఇన్‌క్యుబేటర్ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు సుశిక్షణ, పరి శ్రమల ఏర్పాటు, సాంకేతిక సహకారం నుం చి బ్యాంకుల రుణ సౌలభ్యం వరకూ తగిన సాయం అందేలా పథకాలను ప్రకటించాలి. ప్రత్యేక నిధిని ఏర్పాటూ ప్రయోజనమే.
 
విద్యార్థులు...
విద్యాభివృద్ధికి తగిన ప్రోత్సాహకాలు ఉం డాలి. ఇందుకు ప్రత్యేక పథకాలను ఆవిష్కరించాలి. అధికమొత్తంలో కేటాయింపులు జరపాలి. ముఖ్యంగా చదువుకునే విద్యార్థుల విషయంలో డ్రాప్‌అవుట్స్ లేకుండా ప్రత్యేక చర్యలు ఉం డాలి. విద్యా రుణాలపై వడ్డీ మాఫీ పరిమితి పెంచాలి.
 
సామాన్యుడు
నిత్యావసర ధరలు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయి. ఇక ప్రత్యేకించి ఆహార ఉత్పత్తుల ధరల విషయం చెప్పనక్కర్లేదు. ధరలు తగ్గడానికి తగిన చర్యలు బడ్జెట్లో వుండాలి. ముఖ్యంగా రైతు-వినియోగదారుని మధ్య దూరం తగ్గే చర్యలను కేంద్రం తీసుకుంటే ఫలితాలు బాగుంటాయి.
 
సాధారణ ఉద్యోగి
ఆదాయపు పన్ను మినహాయింపు పరిమితి ప్రస్తుత రూ. 2.5 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలి. దీనివల్ల సాధారణ ఉద్యోగిగా నాలుగు డబ్బులూ నా చేతులో ఉంటా యి. దీనికితోడు సెక్షన్ 80సీ కింద లభించే పన్ను మినహాయింపు పరిమితిని రూ.1.5 లక్షల నుంచి  మరింత పెంచితే... నా పొదుపులు మరింత పెరిగేందుకు అవకాశం ఉంటుంది.
 
పారిశ్రామికవేత్త...
వడ్డీరేట్లు మరింత తగ్గాలి. ఆర్‌బీఐ రేట్లు తగ్గించేందుకు వీలయ్యే చర్యల్ని బడ్జెట్లో చేపట్టాలి.  వడ్డీరేట్లు తగ్గించడం- పారిశ్రామిక వృద్ధి, ఉపాధి అవకాశాల మెరుగుదలకు, దేశాభివృద్ధికి దోహదపడుతుంది. దేశంలో నిర్మాణ రంగం అభివృద్ధికి ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలకు సొంత గూడు ఉండేలా చర్యలపైనా దృష్టి అవసరం. ప్రాజెక్టుల అమలులో జాప్యం జరక్కుండా చర్యలు తీసుకోవాలి. మౌలిక రంగానికి నిధుల కేటాయింపును భారీగా పెంచాలి.
 
సీనియర్ సిటిజన్
వడ్డీరేట్లు తగ్గుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. బ్యాంక్ డిపాజిట్ రేట్లూ తగ్గుతాయన్నదే దీని సంకేతం. కేవలం బ్యాంక్ డిపాజిట్లపై వచ్చే వడ్డీతో ఆధారపడి జీవిస్తున్న నా బోటి వృద్ధులకు ఇది కష్టకాలమే. ఈ స్థితిలో ద్రవ్యోల్బణాన్ని తట్టుకుని నిలబడగలిగే పథకాలను బడ్జెట్‌లో ప్రవేశపెట్టాలి. ఆదాయపు పన్నుల్లో  రిబేట్లు ఇవ్వాలి. వడ్డీల విషయంలో సీనియర్ సిటిజన్ల కోసం ప్రస్తుతం అనుసరిస్తున్న అర శాతం అధిక ప్రీమియంను మరో అర శాతానికి పెంచితే మంచిది. వైద్య ఖర్చులు తగ్గే చర్య లూ తీసుకోండి.

మరిన్ని వార్తలు