బడ్జెట్‌లో ఉంటేనే భవిష్యత్తుకు భరోసా...

7 May, 2017 23:40 IST|Sakshi
బడ్జెట్‌లో ఉంటేనే భవిష్యత్తుకు భరోసా...

ఖరీదవుతున్న జీవనశైలి
► మెరుగైన జీవనం కోసం ఆర్జనంతా ధారపోత
► ఆదాయానికి తగ్గట్టు విలాసాలు, వ్యయాలు
► ఏటేటా పెరిగేదేకానీ తరుగుదల లేదు
►  ఫలితంగా ఆర్థిక లక్ష్యాలకు విఘాతం
► వర్తమానమే కాదు... భవిష్యత్తూ ముఖ్యమే
► ఖర్చుల అదుపు–మదుపుతోనే భరోసా...


ఎంతైనా ఫర్వాలేదు...
జీవనశైలి ద్రవ్యోల్బణం కూడా నేడు సాధారణమైపోయింది. పెరుగుతున్న ఆదాయానికి తగ్గట్టు ఓ వ్యక్తి జీవన ప్రమాణాలు సైతం ఉన్నత స్థాయికి వెళుతున్నాయి. మెరుగైన జీవనం కోసం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధపడటమే గానీ దాని గురించి ఆలోచించే వారు మనలో చాలా తక్కువ మందే ఉంటారు.

పైగా ఇలా ఖరీదైన జీవనం అన్నది ఓ అవసరంగా మార్పు చెందుతోంది. ఎందుకంటే ఆర్జన అధికమవుతుండటంతో వ్యక్తి ఆలోచనాతీరులోనూ మార్పు వస్తోంది. ఉదాహరణకు సెల్‌ఫోన్లు వచ్చిన కొత్తలో ఒక్కో ఫోన్‌ను సంవత్సరాలపాటు వాడుకునే వారు. ఇప్పుడు గట్టిగా 6 నెలల్లో ఫోన్‌ మార్చేస్తున్నారు. ప్రజా రవాణా సాధనాల్లో వెళ్లడానికి బదులు యాప్‌లో క్యాబ్‌ బుక్‌ చేసుకుని దర్జాగా వెళుతున్నారు.

భవిష్యత్తుకూ ప్రాధాన్యం
కీలకమైన ఆర్థిక లక్ష్యాలకు అడ్డపడనంత వరకూ ఖర్చుల వల్ల ఇబ్బంది లేదు. ప్రస్తుతం ఎంజాయ్‌ కోసం ఖర్చు చేసేవారు భవిష్యత్‌ అవసరాల కోసమూ పొదుపు చేయాల్సిన అవసరాన్ని తెలుసుకోవాలి. ఈ రెండింటి మధ్య సమతుల్యత ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

అవసరమైతే కొన్ని ఖర్చులను వాయిదా వేసుకోవడం వల్ల తర్వాతి కాలంలో అందుకు తగ్గ తీపి ఫలాలను అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. ఆదాయ స్థాయికి తగినట్టు జీవించడం తప్పేమీ కాదు. కానీ ఆర్థిక లక్ష్యాలకు సరిపడా మదుపు చేసిన తర్వాత చేసే ఖర్చుల వల్ల నిజమైన ఆనందాన్ని పొందొచ్చు. అ లాగే, పెరుగుతున్న ఆదాయానికి అనుగుణంగా మదుపూ పెంచుకుంటూ పోవాలి. దీనివల్ల భవిష్యత్తులో భారీ వ్యయాలకు తగ్గట్టుగా పొదుపు శాతం తగ్గకుండా ఉంటుంది.

25–30 మధ్యలో మరీ ఎక్కువ...
జీవనశైలి ద్రవ్యోల్బణం మనలో చాలా మందిపై ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా 25కుపైన 30 ఏళ్లకు సమీపంలో ఉన్న వారిపై దీని ప్రభావం మరింత ఎక్కువ. కెరీర్‌లో అప్పుడే మంచి వృద్ధి దశలో ఉంటారు. దాంతో చేతినిండా ఆర్జన. ఆ సమయంలో బాధ్యతలూ తక్కువే. ఫలితంగా విలాసాలకు ధారపోయడం అలవాటవుతుంది. దీని ఫలితంగా రిటైర్మెంట్‌ నాటికి కూడబెట్టేది పెద్దగా ఉండదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 25–40 ఏళ్ల మధ్య వయస్కులకు జీవనశైలి ద్రవ్యోల్బణం అన్నది 15–20 శాతంగా ఉంటుంది.

ఆదాయం పెరుగుదల ఈ స్థాయిలో లేకపోతే అప్పుడు ఏమవుతుందో ఆలోచించండి. ఖర్చులు క్రమంగా పెరుగుతూ వెళితే ఇబ్బంది అనిపించదు. ఒకసారి మెరుగైన జీవనశైలికి అలవాటు పడితే ఆ తర్వాత మిత వ్యయానికి మారాలంటే కష్టం. సాధారణ ద్రవ్యోల్బణంతో పోలిస్తే జీవనశైలి ద్రవ్యోల్బణం పొదుపు సామర్థ్యాన్ని రెండింతలు వేగంగా దెబ్బతీస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాదు, లక్ష్యాలకు అవసరమైన పొదుపు, మదుపు చేయకుండా అడ్డుపడుతుంది. చివరికి రాజీ పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే దీన్ని సరైన విధంగా ఎదుర్కోవాలని నిపుణులు చెబుతున్నారు.

లక్ష్యాలకు, పెట్టుబడులకు అనుసంధానం
ఆర్థిక లక్ష్యాలకు అందుకు అవసరమైన పెట్టుబడులకు మధ్య అనుసంధానం ఉండాలి. ఎలాగంటే ముందు రిటైర్మెంట్, పిల్లల విద్య, వివాహం, ఇల్లు కొనుగోలు ఇటువంటి లక్ష్యాలను నిర్ణయించుకోవాలి. వాటికి అవసరమైన మేర పెట్టుబడులను తరలించేలా ప్రత్యేక బకెట్‌ ఏర్పాటు చేసుకోవాలి. నెలనెలా బ్యాంకు ఖాతా నుంచి నేరుగా వీటికి పెట్టుబడులు వెళ్లేలా చూసుకోవాలి.

దాంతో లక్ష్యాల విషయంలో రాజీపడాల్సిన పరిస్థితి ఎదురవదు. మ్యూచువల్‌ ఫండ్స్‌కు సిప్‌ మొత్తాన్ని బ్యాంకు నుంచి తీసుకునేలా అంగీకారం తెలపాలి. రికరింగ్‌ డిపాజిట్‌ అయినా సరే ఇలా ఆటోమేటిక్‌గా వెళ్లేలా చూసుకోవాలి. దీనివల్ల ఆదాయం చేతికందే లోపే పెట్టుబడులకు నిర్ణీత మొత్తం వెళుతుంది. నెలసరి ఆదాయంలో కనీసం 30 శాతం అయినా పొదుపు చేయాలని ఆర్థిక సలహాదారులు ఇచ్చే సూచన. ఆ తర్వాత వినోదానికి, విలాసానికి ఖర్చు చేసుకున్నా వచ్చే నష్టం ఉండదు.

బడ్జెట్‌కు కట్టుబడి ఉండడం
వ్యక్తిగత అవసరాలు లేదా కుటుంబ అవసరాలు... వీటికోసం కేటాయించిన బడ్జెట్‌ దాటిపోకుండా చూసుకోవాలి. ఖర్చులను నిరంతరం గమనిస్తూ ఉండాలి. ఇంకా వివరంగా ఒక్కో అవసరానికి ఇంతని బడ్జెట్‌ కేటాయించినట్టయితే పెరుగుతున్న ఆదాయానికి తగినట్టు ఆయా అవసరాలకు కూడా అంతే మొత్తం బడ్జెట్‌ను పెంచుకుంటూ వెళ్లొచ్చు. దీనివల్ల ఖర్చులు అదుపుతప్పకుండా ఉంటాయి.

ఎక్కడ అవకాశం ఉందో చూడాలి...
నెల ఆదాయంలో 25 శాతం అయినా పొదుపు చేయలేకుంటే జీవనశైలి ప్రభావం మీపై బాగానే ఉన్నట్టు. మరి ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొనేవారు ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రత్యామ్నాయాలను పరిశీలించాలి. ఇందుకు వ్యయాలు తగ్గించుకోవడం ఓ మార్గమని నిపుణులు సూచిస్తున్నారు. ఉదాహరణకు పాణిగ్రాహి, అతడి అర్ధాంగికి ఏటా పర్యటనలు చేయడం అలవాటు. దీన్ని త్యాగం చేయక్కర్లేదు. కాకపోతే ధరలు తక్కువగా ఉండే ఆఫ్‌ సీజన్‌లో ప్రయాణాలు పెట్టుకోవడం వల్ల కొంత ఆదా చేసుకోవచ్చు. ముందుగానే టూర్‌ ప్లాన్‌ చేసుకుంటే విమాన టికెట్లు చౌకగానూ సొంతం చేసుకోవచ్చు.

మరిన్ని వార్తలు