ఏటీఎంలో నకిలీ నోట్లు

23 Feb, 2017 02:19 IST|Sakshi
ఏటీఎంలో నకిలీ నోట్లు

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఓ ఏటీఎంలో నకిలీ రూ.2000 కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి. విత్‌డ్రా చేయగా రూ.2000 నోటు ముందువైపు పైభాగంలో ‘రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని ఉండాల్సిన చోట ‘చిల్డ్రన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా’ అని రాసి ఉన్న నాలుగు నకిలీ నోట్లు వచ్చాయి. ఢిల్లీలోని సంగమ్‌ విహార్‌లోని ఎస్‌బీఐ ఏటీఎం నుంచి రోహిత్‌ కుమార్‌ అనే వ్యక్తి నగదు డ్రా చేయగా ఈ నోట్లు వచ్చాయి. ఈ నెల ఆరో తేదీన విత్‌డ్రా చేసినపుడు వచ్చిన ఈ నోట్లకు కుడివైపు నిలువుగా అధికారిక వాటర్‌మార్క్‌కు బదులు ‘చురన్‌ లేబుల్‌’ అని ముద్రించి ఉంది. ఆర్‌బీఐ స్టాంపు స్థానంలో పీకే అని ఉంది.

రిజర్వ్‌బ్యాంకు ఆఫ్‌ ఇండియా స్థానంలో భారతీయ మనోరంజన్‌ బ్యాంక్‌ అని రాసి ఉంది. దీంతో కంగారు పడిన అతడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కూడా సదరు ఏటీఎం వద్దకు వెళ్లి డబ్బులు డ్రా చేయగా అలాంటివే నకిలీ నోట్లు వచ్చాయి. దీంతో సంగం విహార్‌ పోలీస్‌స్టేషన్‌లో చీటింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏటీఎంలో డబ్బులు నింపిన చివరి వ్యక్తి ఎవరనే దానిపై పోలీసులు దృష్టి పెట్టారు. నిందితుడిని గుర్తించేందుకు ఏటీఎంలోని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కాగా, తమ బ్యాంకు ఏటీఎంలలో నకిలీ నోట్లు వచ్చే ఆస్కారమే లేదని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో పేర్కొంది. దర్యాప్తు కొనసాగుతోందని బ్యాంకు తెలిపింది.

మరిన్ని వార్తలు