Air India: టాటా గ్రూప్‌ సంస్థపై భారీ పెనాల్టీ.. కారణం ఇదేనా..

22 Nov, 2023 20:25 IST|Sakshi

ప్రభుత్వ యాజమాన్యంలో కొనసాగిన ఎయిర్ ఇండియా తన సొంత గూటికి చేరుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాటాగ్రూప్‌ నిర్వహిస్తోన్న ఈ కంపెనీపై సివిల్ ఏవియేషన్‌ చర్యలు చేపట్టింది. ఏకంగా రూ.10 లక్షలు జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే..

డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్(డీజీసీఏ) మే-సెప్టెంబర్‌లో షెడ్యూల్డ్ డొమెస్టిక్ ఆపరేటర్ల కోసం దిల్లీ, కొచ్చిన్‌, బెంగళూరు విమానాశ్రయాల్లో తనిఖీలు నిర్వహించింది. డీజీసీఏ నిబంధనల ప్రకారం ప్రయాణికులకు అందిస్తున్న సౌకర్యాలు, నష్టపరిహారానికి సంబంధించిన అంశాలను పరిశీలించింది. అయితే వీటిని పాటించటంలో ఎయిర్ ఇండియా విఫలమైందని తనిఖీల్లో వెల్లడైంది.

ఇదీ చదవండి: రూ.750 కోట్లు జీఎస్టీ బకాయి.. జొమాటో, స్విగ్గీలకు నోటీసులు

ఫలితంగా సంస్థ నిబంధనలు పాటించకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ నవంబర్ 3న ఎయిర్ ఇండియాకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. ఎయిర్ ఇండియా ఇచ్చిన  వివరణను సమీక్షించిన తర్వాత.. సీఏఆర్‌ నిబంధనలు పాటించడంలో టాటా గ్రూప్‌ సంస్థ విఫలమైందని నిర్ధారించారు.  ఆలస్యమైన విమానాల వల్ల ఇబ్బందులు ఎదు​ర్కొన్న ప్రయాణికులకు హోటల్ వసతి లేకపోవడం, కొంతమంది గ్రౌండ్ సిబ్బందికి తగిన శిక్షణ ఇవ్వకపోవడం, కొందరు సర్వీస్‌లేని సీట్లలో ప్రయాణించవలసి రావడం వంటి అంశాలను పరిగణలోని తీసుకున్నారు. వారికి పరిహారం చెల్లించడంలో సంస్థ విఫలం అయిందని గుర్తించారు. దాంతో సంస్థకు రూ.10 లక్షలు జరిమానా విధించారు.

మరిన్ని వార్తలు