ఫ్లిప్‌కార్ట్ @ లక్ష కోట్లు!

8 May, 2015 01:20 IST|Sakshi
ఫ్లిప్‌కార్ట్ @ లక్ష కోట్లు!

కంపెనీ ప్రస్తుత వాల్యుయేషన్ 15 బిలియన్ డాలర్లు..
* త్వరలో 800 మిలియన్ డాలర్ల పెట్టుబడి  
* ఆ తరవాత నుంచి రుణ సమీకరణపై దృష్టి

బెంగళూరు/న్యూఢిల్లీ: నిధుల కోసం ఇప్పటిదాకా ఇన్వెస్టర్లపై ఆధారపడిన భారతీయ ఆన్‌లైన్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్... ఇకపై రుణాలు సేకరించాలని భావిస్తున్నట్లుగా తెలిసింది. నిజానికిప్పటికే ఫ్లిప్‌కార్ట్ దాదాపు 15 మంది ఇన్వెస్టర్ల నుంచి 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్ని తీసుకుంది.

ఇదికాక మరో 600-800 మిలియన్ డాలర్లను కూడా పెట్టుబడులుగా స్వీకరించడానికి సంస్థ చర్చిస్తోందని, దాదాపు 15 బిలియన్ డాలర్ల(దాదాపు రూ.లక్ష కోట్లు) వాల్యుయేషన్‌పై ఈ నిధుల్ని స్వీకరిస్తోందని ఇటీవలే వార్తలు వెలువడ్డాయి. గత డిసెంబర్లో సంస్థ 700 మిలియన్ డాలర్ల పెట్టుబడి స్వీకరించినపుడు దాని విలువను 11.5 బిలియన్ డాలర్లుగా అంచనా వేశా రు. నాలుగు నెలలు తిరక్కుండానే ఆ విలువ 15 బిలియన్ డాలర్లకు చేరుతుండటం గమనార్హం.

ఈ నేపథ్యంలో ఇకపై వాటా తగ్గకుండా రుణాల ద్వారా నిధులు సేకరించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలియజేశాయి. ఎంత సేకరించాలన్నది ఇంకా నిర్ణయించకపోయినా.. తొలి విడత 200 మిలియన్ డాలర్లు సమీకరించవచ్చని తెలిసింది. దీనిపై ఫ్లిప్‌కార్ట్ ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు. సంస్థ భారీ నిధుల సమీకరణ కోసం వచ్చే 18 నెలల్లో ఐపీఓకు రానున్నదన్న వార్తలూ ఇప్పటికే ప్రచారంలో ఉన్నాయి. వీటిని ఒకదశలో ఫ్లిప్‌కార్ట్ యాజమాన్యం కూడా ధ్రువీకరించటం గమనార్హం.

>
మరిన్ని వార్తలు