2030 నాటికి 40 శాతానికి ఈవీలు

8 Dec, 2023 05:02 IST|Sakshi

ఇండియా ఈవీ రిపోర్ట్‌–2023

ముంబై: దేశీయ ఎలక్ట్రిక్‌ వెహికల్‌ (ఈవీ) మార్కెట్‌ దిశ మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని ఒక నివేదిక వెల్లడించింది. బ్లూమ్‌ వెంచర్స్‌ సహకారంతో బెయిన్‌ అండ్‌ కంపెనీ రూపొందించిన ఇండియా ఎలక్ట్రిక్‌ వెహికల్‌ రిపోర్ట్‌ 2023 ప్రకారం.. ఈవీ పరిశ్రమ గణనీయ వృద్ధికి సిద్ధంగా ఉంది. ఈవీ వాటా ప్రస్తుతం 5 శాతం నుండి 2030 నాటికి 40 శాతానికి పైగా చొచ్చుకుపోయే అవకాశం ఉంది.

ద్విచక్ర, త్రిచక్ర వాహనాలు రెండింటిలోనూ 45 శాతంపైగా బలమైన స్వీకరణ ద్వారా ఈవీ రంగం వృద్ధి చెందుతుంది. కార్ల విస్తృతి 20 శాతానికి పైగా పెరుగుతుంది. ఈ అంచనాలను చేరుకోవడానికి కొత్త ఉత్పత్తుల అభివృద్ధి, పంపిణీ, కస్టమర్ల సెగ్మెంట్‌ ప్రాధాన్యత, సాఫ్ట్‌వేర్‌ అభివృద్ధి, ఛార్జింగ్‌ మౌలిక వసతుల అంశాల్లో అనేక నిర్మాణాత్మక సవాళ్లను పరిష్కరించాల్సిన అవసరం ఉంది’ అని వివరించింది.  

100 బిలియన్‌ డాలర్లు..
‘ప్రస్తుతం ఉన్న 5 శాతం నుండి 2030 నాటికి 45 శాతానికి పైగా ఎలక్ట్రిక్‌ టూ–వీలర్‌ మార్కెట్‌ చొచ్చుకుపోవచ్చు. ఈవీ తయారీ కంపెనీలు మధ్యస్థాయి మోడళ్లను అభివృద్ధి చేయడం ద్వారా స్కూటర్ల విభాగంలో 50 శాతానికి పైగా వాటా కైవసం చేసుకోవచ్చు. అలాగే అద్భుతమైన ఎంట్రీ–లెవల్‌ ఈ–మోటార్‌సైకిళ్లను ప్రవేశపెట్టాలి. త్రిచక్ర వాహన మార్కెట్‌ ఈవీల వైపు స్థిరంగా మారుతున్న ఈ సమయంలో మోడళ్లు సీఎన్‌జీ వాహనాలతో సరితూగాల్సి ఉంటుంది.

ఈవీల రంగంలో 100 బిలియన్‌ డాలర్ల అవకాశాలను అందుకోవాలంటే కస్టమర్ల సూచనల ఆధారంగా ఉత్పత్తుల అభివృద్ధి,, మెట్రో, ప్రథమ శ్రేణి నగరాలకు మించి అభివృద్ధి చెందడానికి పంపిణీ నమూనాలను పునర్నిర్మించడం, బీ2బీ/ఫ్లీట్‌ కస్టమర్‌ విభాగాలకు ప్రాధాన్యత, భిన్నత్వం కోసం సాఫ్ట్‌వేర్‌ వినియోగం, చార్జింగ్‌ మౌలిక సదుపాయాలను పెంచడం వంటివి కీలకం’ అని నివేదిక వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు