పెట్టుబడిదారులు కంగారు పడక్కర్లేదు..

29 Nov, 2023 00:57 IST|Sakshi

ప్రధాని మోదీ ప్రభుత్వానికి మళ్లీ మంచి మెజారిటీ

ఆర్థికమంత్రి సీతారామన్‌ ఉద్ఘాటన

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం 2024లో  ‘మంచి మెజారిటీ’తో మళ్లీ అధికారంలోకి రానుందని,  ప్రపంచ పెట్టుబడిదారులు ‘చింతించాల్సిన అవసరం లేదు’అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. వృద్ధి వేగాన్ని పెంచేందుకు వ్యవస్థాగత సంస్కరణలకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కూడా ఆమె ఇండియా గ్లోబల్‌ ఫోరమ్‌ నిర్వహించిన కార్యక్రమాన్ని ఉద్దేశించి చేసిన ఒక వెర్చువల్‌ చర్చాగోష్టిలో  చెప్పారు.

భారత్‌ ఆర్థిక వ్యవస్థను, రాజకీయ వాతావరణాన్ని,  క్రింది స్థాయిలో వాస్తవాలను గమనించే ఎవ్వరికైనా ప్రధాని మోదీ మళ్లీ మంచి మెజారిటీతో తిరిగి వస్తున్నారని అర్థమవుతుందని ఆమె ఉద్ఘాటించారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ప్రతి భారతీయుడి జీవితాన్ని మార్చే వివిధ కార్యక్రమాలను చేపట్టిందని, అలాగే కేంద్రం తీసుకున్న పలు చర్యల వల్ల వ్యాపార వాతావరణం మెరుగుపడిందని అన్నారు.

రోజ్‌గార్‌ మేళా ద్వారా ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి దేశంలో 10 లక్షల మంది యువతకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. ఇప్పటికే 8 లక్షల ఉపాధి అవకాశాలు కల్పించడం జరిగిందన్నారు. పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందన్నారు.  ఇండియా–మిడిల్‌ ఈస్ట్‌–యూరోప్‌ కనెక్టివిటీ కారిడార్‌ (ఐఎంఈసీ)పై ఇజ్రాయెల్‌ –గాజాలో కొనసాగుతున్న సంఘర్షణ ప్రభావం గురించి అడిగిన ప్రశ్నకు ఆమె సమాధానం చెబుతూ ‘‘అది దీర్ఘకాలిక ప్రాజెక్ట్‌. ఒకటి లేదా మరొక సంఘటన ఏదీ దీనిని ప్రభావితం చేయబోదు’’ అని స్పష్టం చేశారు.

మరిన్ని వార్తలు