3రోజూ నష్టాల్లో బంగారం ధర

3 Jul, 2020 10:46 IST|Sakshi

అంతర్జాతీయ మార్కెట్లోనూ ఫ్లాట్‌గానే

దేశీయ మల్టీ కమోడిటీ ఎక్చ్సేంజీలో బంగారం ధర శుక్రవారం స్వల్ప నష్టాన్ని చవిచూసింది. నేటి ఉదయం 10గంటలకు 10గ్రాముల బంగారం ధర రూ.100 నష్టపోయి రూ.48058 వద్ద ట్రేడ్‌ అవుతోంది. బంగారానికిది ఇది వరుసగా మూడో రోజూ నష్టాల ట్రేడింగ్‌ కావడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరకు డిమాండ్‌ తగ్గడం, ఈక్విటీ మార్కెట్లు లాభాల్లో కదలాడటం, డాలర్‌ మారకంలో రూపాయి విలువ బలపడటం తదితర కారణాలు బంగారం దిగివచ్చేందుకు కారణమైనట్లు బులియన్‌ పండితులు చెబుతున్నారు. ఎంసీఎక్స్‌ మార్కెట్‌లో నిన్నరాత్రి 10గ్రాముల బంగారం ధర రూ. 109లు నష్టపోయి రూ.48,158 వద్ద స్థిరపడింది. (జూన్‌లో బంగారం దిగుమతులు 11టన్నులే.!)

అంతర్జాతీయ ఆర్థిక పునరుద్ధరణ ఆశలతో ఈక్విటీలకు డిమాండ్‌ పెరిగవచ్చు. ఈ నేపథ్యంలో స్వల్పకాలం పాటు బంగారం ధర ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉందని కోటక్‌ సెక్యూరిటీస్‌ బ్రోకరేజ్‌ సంస్థ తెలిపింది. అయితే కరోనా కేసుల పెరుగుదల, ఆర్థిక వ్యవస్థ రికవరీకి ఆయా సెంట్రల్‌ బ్యాంక్‌లు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటనలు రానున్న రోజుల్లో బంగారానికి కనిష్ట స్థాయిలో మద్దతునిస్తాయని బ్రోకరేజ్‌ సంస్థ పేర్కోంది. 

ఇదే వారంలో బుధవారం ఎంసీఎక్స్‌లో 10గ్రాముల బంగారం ధర రూ.48,982 వద్ద జీవితకాల గరిష్టాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. అలాగే ఈ ఏడాది ప్రథమార్థంలో బంగారం ధర 25శాతం ర్యాలీ చేసింది. 

అంతర్జాతీయ మార్కెట్లో ఫ్లాట్‌గా: 
అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఫ్లాట్‌గా ట్రేడ్‌ అవుతోంది. నేటి ఉదయం ఆసియాలో ఔన్స్‌ 3డాలర్ల నష్టపోయి 1,786.70డాలర్ల వద్ద కదలాడుతుంది. అమెరికాలో జూన్‌ ఉపాధి కల్పన గణాంకాలు అంచాలకు మించి నమోదు కావడంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులను ఈక్విటీల్లోకి మళ్లించారు. ఫలితంగా బంగారానికి డిమాండ్‌ తగ్గింది. అయితే కరోనా కేసుల పెరుగుదలపై ఆందోళనలు, అమెరికా-చైనా దేశాల మధ్య వాణిజ్య ఉద్రిక్తతలు మరోసారి తెరపైకి రావడం తదితర కారణాలు రానున్న రోజుల్లో బంగారానికి మద్దతునిచ్చే అంశాలుగా ఉన్నాయి. 

మరిన్ని వార్తలు